హుస్సేన్‌సాగర్‌కు గేట్లు

ABN , First Publish Date - 2021-04-08T07:02:08+05:30 IST

గ్రేటర్‌ హైదరాబాద్

హుస్సేన్‌సాగర్‌కు గేట్లు

ట్యాంక్‌బండ్‌ వద్ద ఆరులేన్ల భారీ బ్రిడ్జి నిర్మాణం

నాలాలు ఆక్రమణకు గురికాకుండా చర్యలు

రూ.858 కోట్లతో అభివృద్ధి పనులు

మొత్తం 15 ప్యాకేజీల కింద నిధుల కేటాయింపు 

52 పనులకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం


హైదరాబాద్‌ సిటీ ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ హైదరాబాద్‌ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మునుపెన్నడూ లేని రీతిలో వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు నడుం బిగించింది. ఈ మేరకు రూ.858 కోట్లతో భారీ ప్రణాళికతో పలు ప్రతిష్టాత్మక పనులు పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేసింది. ప్రధానంగా భాగ్యనగరానికి తలమానికమైన హుస్సేన్‌సాగర్‌కు భారీ గేట్లు ఏర్పాటు చేయనున్నారు. మారియట్‌ హోటల్‌ ఎదురుగా ఆరులైన్లతో కూడిన అతిపెద్ద బ్రిడ్జిని నిర్మించనున్నారు. వీటితో పాటు గ్రేటర్‌లోని చారిత్రాత్మకమైన నాలాలు ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకుంటున్నారు. గతేడాది అక్టోబర్‌లో నగరంలో కురిసిన భారీ వర్షాలతో నాలా పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజ లు తీవ్ర ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. భవిష్యత్‌లో వరదనీటితో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు మొత్తం 15 ప్యాకేజీల కింద 52 పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయడంతో నగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మునిసిపల్‌, జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో చేపట్టనున్న పనులను త్వరలో ప్రారంభించనున్నారు. 


వివిధ ప్రాంతాల్లో చేపట్టే పనులు

- ప్యాకేజీ-1లో భాగంగా రూ.39 కోట్లతో సికింద్రాబాద్‌ జోనల్‌ కమిషనరేట్‌ పరిధిలోని పద్మాకాలనీ-శివానంద్‌నగర్‌ (తిలక్‌నగర్‌ బ్రిడ్జి) వయా ఫీవర్‌ ఆస్పత్రి మీదుగా నిర్మించనున్నారు. రూ.16 కోట్లతో రాణిగంజ్‌ బస్‌డిపో సమీపంలో, బుద్దభవన్‌ నుంచి గ్రేవ్‌యార్డు క్రాసింగ్‌ మీదుగా బ్రిడ్జి నిర్మాణం, మారియట్‌ హోటల్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ మీదుగా నాలా నిర్మాణం చేపట్టనున్నారు.

- ప్యాకేజీ-2 కింద సికింద్రాబాద్‌ జోనల్‌ కమిషనర్‌లో ఆర్‌యూబీ నుంచి మారియట్‌ వరకు రూ.20 కోట్లతో నాలాను విస్తరించనున్నారు.

- ప్యాకేజీ-3లో రూ.25 కోట్లతో మారియట్‌ హోటల్‌ ఎదురుగా ట్యాంక్‌బండ్‌పై ఆరులైన్ల భారీ బ్రిడ్జిని నిర్మించనున్నారు. వీటితోపాటు రూ.41 కోట్ల భారీ బడ్జెట్‌తో హుస్సేన్‌సాగర్‌కు గేట్లను ఏర్పాటు చేయనున్నారు. 

- ప్యాకేజీ-5లో కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌ పరిధిలో రూ.95 కోట్లతో  ఫాక్స్‌సాగర్‌ సర్‌ప్లస్‌ ఏరియా అభివృద్ధి, కోల్‌కాల్వ నుంచి వెన్నెలగడ్డ చెరువు వరకు కెమికల్‌ నాలా మీదుగా నాలాను అభివృద్ధి చేయనున్నారు. 

- ప్యాకేజీ-6 కింద ఎల్‌బీనగర్‌ పరిధిలో రూ.30 కోట్లతో బండ్లగూడ చెరువు నుంచి మూసీనది వరకు 9 అలైన్‌మెంట్లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే రూ.28.10 కోట్లతో చందనా గార్డెన్స్‌ నుంచి సరూర్‌నగర్‌ లేక్‌ వరకు 3 నుంచి 5 అలైన్‌మెంట్లు నిర్మించనున్నారు. 

- ప్యాకేజీ-6 కింద ఎల్‌బీనగర్‌ జోనల్‌ కమిషనర్‌ పరిధిలో రూ.21.47 కోట్లతో సరూర్‌నగర్‌ లేక్‌ నుంచి చైతన్యపురి, సరూర్‌నగర్‌ లేక్‌ నుంచి చైతన్యపురి వయా కోదండరాంనగర్‌ వరకు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. 

- ప్యాకేజీ-7 కింద ఖైరతాబాద్‌ పరిధిలో రూ.31.92 కోట్లతో షాహతీమ్‌ నుంచి లంగర్‌హౌజ్‌ (వయా మోతీ దర్వాజా), నదీమ్‌కాలనీ నుంచి షాహతీమ్‌, మజీద్‌-ఈ-అబూబకర్‌ నుంచి షాహతీమ్‌ వరకు పలు పనులు చేపట్టనున్నారు. రూ.56.34 కోట్లతో భోలక్‌పూర్‌ నాలాను పునరుద్ధరించనున్నారు.

- ప్యాకేజీ-8 కింద రూ.26.19 కోట్లతో చార్మినార్‌ పరిధిలో ఎర్రకుంట నుంచి కొత్త చెరువు వరకు రెండు అలైన్‌మెంట్లు నిర్మించనున్నారు. 

- ప్యాకేజీ-9 కింద రూ.42.14 కోట్లతో చార్మినార్‌ జోనల్‌ కమిషనర్‌ పరిధిలో ముల్‌గండ్‌ నది నుంచి ఈసర్‌ రివర్‌ వరకు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.

- ప్యాకేజీ-10లో భాగంగా రూ.24 కోట్లతో శేరిలింగంపల్లి జోనల్‌ కమిషనర్‌ పరిధిలో నెక్నంపూర్‌ నాలాను మూసీనది వరకు విస్తరించనున్నారు. 

- ప్యాకేజీ-11లో భాగంగా మీర్‌పేట్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌లో రూ. 27.43 కోట్లతో టీచర్స్‌కాలనీ రోడ్‌ నంబర్‌-15 నుంచి గాయత్రీనగర్‌ (వయా నందిహిల్స్‌, టీకేఆర్‌ సౌత్‌ గేట్‌) వరకు 3 అలైన్‌మెంట్లు ఏర్పాటు చేయనున్నారు. 

- ప్యాకేజీ-14 కింద రూ.32.42 కోట్లతో పెద్ద అంబర్‌పేట్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో పెద్ద చెరువు (కంట్లూర్‌ ట్యాంక్‌) నుంచి పోచమ్మకుంట వయా బోధన్‌కాలనీ వరకు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. 

- ప్యాకేజీ-15 కింద నిజాంపేట్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో రూ.53.57 కోట్లతో కేజీఎం ఎన్‌క్లేవ్‌ నుంచి కోకాకోలా వరకు 5 అలైన్‌మెంట్లు ఏర్పాటు చేయనున్నారు.

అలాగే పెద్ద అంబర్‌పేట్‌  మునిసిపల్‌ కార్పొరేషన్‌లో రూ.13.86 కోట్లతో దూలపల్లి నుంచి ఫాక్స్‌సాగర్‌ వరకు ఒక అలైన్‌మెంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వీటితోపాటు జల్‌పల్లి, బడంగ్‌పేట్‌ కార్పొరేషన్ల పరిధిలో నాలాలు, వివిధ పనులు చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. 

Updated Date - 2021-04-08T07:02:08+05:30 IST