పాము కాటు వేసిన చోటకు తీసుకురా.. నీ భార్యను బతికిస్తా.. భర్తకు తేల్చిచెప్పిన మాంత్రికుడు.. సరేనని అతడు తీసుకెళ్తోంటే..

ABN , First Publish Date - 2022-06-25T21:34:22+05:30 IST

సైన్స్, వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెందిన ఈ కాలంలో కూడా కొందరు మూఢనమ్మకాలతో ప్రమాదాలకు గురవుతున్నారు.

పాము కాటు వేసిన చోటకు తీసుకురా.. నీ భార్యను బతికిస్తా.. భర్తకు తేల్చిచెప్పిన మాంత్రికుడు.. సరేనని అతడు తీసుకెళ్తోంటే..

సైన్స్, వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెందిన ఈ కాలంలో కూడా కొందరు మూఢనమ్మకాలతో ప్రమాదాలకు గురవుతున్నారు. వైద్యులను కాకుండా బాబాలను, మంత్రగాళ్లను నమ్మి ఎన్నో కష్టాలు పడుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి పాము కాటుకు గురైన తన భార్యను హాస్పిటల్‌కు కాకుండా, మంత్రగాడి దగ్గరకు తీసుకెళ్లి విలువైన సమయాన్ని వృథా చేశాడు. ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. అయితే అప్పటికే ఒళ్లంతా విషం వ్యాపించడంతో ఆమె మరణించింది. 


ఇది కూడా చదవండి..

క్రైమ్ థ్రిల్లర్‌ సినిమాకు మించిన ట్విస్టులు.. 13 ఏళ్ల బాలిక మిస్సింగ్.. ఫోన్లో దొరికిన ఒక్క క్లూతో స్పెషల్ ఆపరేషన్..



మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా ఖుర్ద్ గ్రామంలో నిద్రిస్తున్న 26 ఏళ్ల మహిళ సోనమ్‌ను గురువారం రాత్రి పాము కాటు వేసింది. సుమారు 24 గంటల విలువైన సమయం తర్వాత, కుటుంబ సభ్యులు ఆ మహిళను శుక్రవారం రాత్రి ఖురాయ్ సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పాముకాటు వేసిన వెంటనే భర్త ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లకుండా, టికామ్‌ఘర్‌లోని ఓ తాంత్రికుడి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడేవో పూజలు చేసిన తాంత్రికుడు రూ.20 వేలు తీసుకుని వారిని ఇంటికి పంపాడు. అయితే ఇంటికి వచ్చాక ఆ మహిళ పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఖురాయ్ సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. 


అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భార్య చనిపోయిన తర్వాత కూడా ఆ మహిళ భర్తకు తాంత్రికుడిపై నమ్మకం పోలేదు. భార్య చనిపోయిన విషయం తాంత్రికుడికి ఫోన్‌ చేసి చెప్పాడు. పాము కాటు వేసిన చోటుకు మహిళ మృతదేహాన్ని తీసుకువస్తే బతికిస్తానని తాంత్రికుడు చెప్పడంతో అందుకు సిద్ధమయ్యాడు. ఆస్పత్రి నుంచి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. సమాచారం అందుకున్న పోలీసులు హాస్పిటల్‌కు చేరుకుని ఆ మహిళ భర్తను మందలించారు. 

Updated Date - 2022-06-25T21:34:22+05:30 IST