అప్పులు తీర్చేందుకు భార్యను అమ్మకానికి పెట్టిన భర్త.. తల్లిదండ్రులతో కలిసి రూ.7లక్షలకు డీల్.. చివరకు సీన్ రివర్స్..!

ABN , First Publish Date - 2022-02-20T23:51:01+05:30 IST

అప్పు తీసుకున్నప్పుడు బాగుంటుంది కానీ.. తీర్చే క్రమంలోనే సమస్యలు తలెత్తుతుంటాయి. చివరకు గొడవలకు దారి తీస్తుంటాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారు వాటిని ఎలా తీర్చాలా.. అని వివిధ రకాలుగా ఆలోచిస్తుంటారు..

అప్పులు తీర్చేందుకు భార్యను అమ్మకానికి పెట్టిన భర్త.. తల్లిదండ్రులతో కలిసి రూ.7లక్షలకు డీల్.. చివరకు సీన్ రివర్స్..!
ప్రతీకాత్మక చిత్రం

అప్పు తీసుకున్నప్పుడు బాగుంటుంది కానీ.. తీర్చే క్రమంలోనే సమస్యలు తలెత్తుతుంటాయి. చివరకు గొడవలకు దారి తీస్తుంటాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారు వాటిని ఎలా తీర్చాలా.. అని వివిధ రకాలుగా ఆలోచిస్తుంటారు. పరువు పోతుందనే భయంతో కొందరు ఏదో ఒక పని చేసి అప్పులు తీరుస్తుంటారు. మరికొందరు దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. రాజస్థాన్‌లో ఓ భర్త తన అప్పులు తీర్చేందుకు తల్లిదండ్రులతో కలిసి ఏకంగా కట్టుకున్న భార్యనే.. రూ.7లక్షలకు అమ్మకానికి పెట్టాడు. చివరకు సీన్ రివర్స్ అయింది. వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్‌ రాష్ట్రం బన్స్వారా జిల్లాలోని ఖమేరా ప్రాంతానికి చెందిన గోపాల్, రేణుక దంపతులు. వీరికి ఏడేళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం ఈ దంపతులకు నాలుగేళ్ల కుమార్తె ఉంది. పెళ్లి సమయంలో రేణుక తల్లిదండ్రులకు కట్నం కూడా భారీగానే ఇచ్చారు. వివాహానంతరం రేణుక భర్త, అత్తమామలతో సంతోషంగా ఉండేది. అయితే కొన్నేళ్ల తర్వాత ఓ రోజు గోపాల్.. మామిడి చెట్టు మీద నుండి ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఉదయపూర్‌లోని ఓ ఆసుపత్రిలో సుమారు 3 నెలల పాటు కోమాలో ఉన్నాడు. చికిత్స కోసం ఖర్చు కూడా ఎక్కువగానే అయింది. దీంతో ఇంట్లోని నగలు, నగదుతో పాటూ ఉన్న కొద్ది పాటి భూమిని కూడా తాకట్టు పెట్టి మరీ చికిత్స చేయించారు. అంతేగాకుండా భారీగా అప్పులు చేశారు. చివరకు ఈ అప్పులన్నింటినీ తీర్చేందుకు ఏకంగా భార్యనే అమ్మకానికి పెట్టాలని గోపాల్, అతడి కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు.

కొద్ది రోజుల్లో పెళ్లి.. డాబా మీద దుస్తులు ఆరేద్దామని వెళ్లిందా 20 ఏళ్ల యువతి.. ఊహించని రీతిలో..


సభ్యసమాజం తలదించుకునేలా రేణుకను రూ.7లక్షలకు విక్రయానికి పెట్టారు. ఈ విషయం తెలుసుకుని రేణుక షాక్ అయింది. ‘‘ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి పనికి నేను ఒప్పుకోను’’.. అంటూ ఆమె తెగేసి చెప్పింది. దీంతో ఆగ్రహించిన గోపాల్, కుటుంబ సభ్యులు రేణుకను చిత్రహింసలకు గురిచేశారు. వేధింపులు తాళలేక బాధితురాలు చివరకు పోలీసులను ఆశ్రయించింది. అయితే దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో చివరికి కోర్టు మెట్లు ఎక్కింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు.. ఎట్టకేలకు గోపాల్, అతడి తల్లిదండ్రులతో పాటూ సోదరులైన కన్హయ్య బమ్నియా, మోగా బామ్నియా, నాథూ బామ్నియాపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ వార్త బయటికి తెలియడంతో గోపాల్ కుటుంబంపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తాయి.

ఇంట్లోకి దూరి మరీ ప్రేయసి ముక్కు, జుట్టు కత్తిరించిన ప్రియుడు.. ఇంతకీ అసలేం జరిగిందంటే..

Updated Date - 2022-02-20T23:51:01+05:30 IST