మందుల్లేక.. పూట గడవక.!

ABN , First Publish Date - 2020-08-07T10:06:24+05:30 IST

భర్త పోలియో బాధితుడు. రెండు కాళ్లూ చచ్చుబడ్డాయి. ఏడాది క్రితం వరకూ కుటుంబ భారాన్ని మోసిన ఆయన ..

మందుల్లేక.. పూట గడవక.!

అజిత్‌సింగ్‌నగర్‌, ఆగస్టు 6: భర్త పోలియో బాధితుడు. రెండు కాళ్లూ చచ్చుబడ్డాయి. ఏడాది క్రితం వరకూ కుటుంబ భారాన్ని మోసిన ఆయన భార్య కిడ్నీ చెడిపోయి కొంతకాలంగా మంచం పట్టింది. ఆమెకు పింఛన్‌ కోసం అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. భార్యతోపాటు ఇద్దరు పిల్లల పోషణ కష్టమైంది. వికలాంగుడైనా.. భర్త చెప్పులు తయారీ పనికెళ్లి కుటుంబాన్ని కొంతకాలం నెట్టుకొచ్చాడు. కరోనా లాక్‌డౌన్‌తో ఆ పనీ పోయింది. ఇల్లు గడవడం గగనమైంది.  ఒక పూట తిని రెండు పూటలు పస్తులుంటూ కన్నీరుమున్నీరవుతున్న ఆ దంపతుల దుస్థితిపై కథనం.వాంబేకాలనీ ఎఫ్‌ బ్లాకులో నివసించే దూరు నాగరాజుకు చిన్నతనంలోనే పోలియో కారణంగా రెండు కాళ్లూ పని చేయవు. ఆయన్ను పదేళ్ల క్రితం కెజియా ఇష్టపడి పెళ్లి చేసుకుంది. భార్యే వంట పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించేది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. ఏడాది క్రితం వరకు వీరి జీవనం ప్రశాంతంగా సాగింది.


కొంత కాలంగా భార్య అనారోగ్యంతో ఉంది. గుంటూరు జీజీహెచ్‌ వైద్యులు ఒక కిడ్నీ పూర్తిగా చెడిపోయిందని చెప్పారు. శస్త్ర చికిత్స చేసి దాన్ని తొలగించారు. అప్పటి వరకూ కుటుంబ భారాన్ని మోసిన ఆమె కూడా మంచానికి పరిమితమైంది. ఇల్లు గడవడం కోసం భర్త నాగరాజు చెప్పుల తయారీ పనికివెళుతున్నాడు. వచ్చే కూలి భార్య వైద్యానికీ, ఇంటి పోషణకూ సరిపోయేది. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా చెప్పుల తయారీ ఆగిపోయింది. నాగరాజు పనీ పోయింది. 5 నెలలుగా ఉపాధి లేదు. భార్య మందులకూ డబ్బుల్లేవు. పూటగడవడం కష్టంగా మారింది. ప్రభుత్వం కిడ్నీ బాధితులకు ఇస్తున్న పింఛన్‌ కోసం ఏడాది నుంచి తిరుగుతున్నా అధికారులు పట్టించుకోలేదు. ఈ కష్ట సమయాన ప్రభుత్వం, దాతలు తమ కుటుంబాన్ని ఆదుకోవాలని నాగరాజు కోరుతున్నాడు. సహాయం అందించే దాతలు 99858 92703 నెంబరుకు సంప్రందించాలని కోరారు. 

Updated Date - 2020-08-07T10:06:24+05:30 IST