కరోనా భయంతో వెళ్లొద్దంటున్నారు.. రేపట్నుంచి డ్యూటీకి రాను.. అని చెప్పిన కొద్ది గంటలకే..

ABN , First Publish Date - 2020-04-08T18:03:51+05:30 IST

విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలో గల హెటెరో ఔషధ పరిశ్రమలో మంగళవారం ఉదయం జూనియర్‌ కెమిస్టుగా పనిచేస్తున్న ఒక యువకుడు మృతిచెందాడు. దీనికి సంబంధించి నక్కపల్లి ఎస్‌ఐ శివరామకృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా

కరోనా భయంతో వెళ్లొద్దంటున్నారు.. రేపట్నుంచి డ్యూటీకి రాను.. అని చెప్పిన కొద్ది గంటలకే..

హెటెరోలో జూనియర్‌ కెమిస్టు మృతి

కెమికల్‌ ట్యాంక్‌ క్లీన్‌ చేస్తుండగా 

ఊపిరాడకపోవడంతో అపస్మారక స్థితికి...

ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూత


నక్కపల్లి (విశాఖపట్టణం): విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలో గల హెటెరో ఔషధ పరిశ్రమలో మంగళవారం ఉదయం జూనియర్‌ కెమిస్టుగా పనిచేస్తున్న ఒక యువకుడు మృతిచెందాడు. దీనికి సంబంధించి నక్కపల్లి ఎస్‌ఐ శివరామకృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా కోటనందూరు మండలం కేఏ మల్లవరం గ్రామానికి చెందిన గాడి శ్రీను (29) హెటెరో పరిశ్రమలో జూనియర్‌ కెమిస్టుగా పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం యథావిధిగా విధులకు హాజరయ్యాడు. యూనిట్‌-3 ‘హెచ్‌’ బ్లాక్‌లో వున్న రసాయన ట్యాంకును శుభ్రం చేస్తున్న సమయంలో శ్రీను ప్రమాదానికి గురయ్యాడు. ట్యాంకు హెడ్‌ను శుభ్రం చేసిన అనంతరం లోపలకు దిగి క్లీన్‌ చేస్తున్న సమయంలో శ్రీను ఊపిరాడక స్పృహతప్పి పడిపోయాడు. అతడ్ని రక్షించే క్రమంలో షిఫ్ట్‌ ఇన్‌చార్జి యుఎన్‌ అప్పారావు కూడా అస్వస్థతకు గురై ట్యాంకులో ఉండిపోయాడు. ఇది గమనించిన సీనియర్‌ కెమిస్టు...మరికొందరి సాయంతో ఇద్దరినీ బయటకు తీశారు. 


అపస్మారక స్థితిలో వున్న గాడి శ్రీనును విశాఖపట్నం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. షిఫ్ట్‌ ఇన్‌చార్జి అప్పారావు క్షేమంగా వున్నాడని ఎస్‌ఐ చెప్పారు. ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. మృతుడి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ చెప్పారు. మృతుడి కుటుంబానికి హెటెరో యాజమాన్యం రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలని సీపీఎం జిల్లా నేత ఎం.అప్పలరాజు డిమాండ్‌ చేశారు. కాగా గాడి శ్రీనుకు నాలుగు నెలల క్రితం వివాహమైంది. ప్రమాద విషయం తెలిసి అతడి భార్య రోహిణీ పార్వతి కుప్పకూలిపోయింది.


పెళ్లయి నాలుగు నెలలే...

మండలంలోని హెటెరో ఔషధ పరిశ్రమలో మంగళవారం జరిగిన ఘటనలో జూనియర్‌ కెమిస్ట్‌ గాడి శ్రీను ప్రాణాలు కోల్పోవడాన్ని కుటుంబ సభ్యులు, తోటి ఉద్యోగులు  జీర్ణించుకోలేకపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కోటనందూరు మండలం కేఏ మల్లవరం గ్రామానికి చెందిన శ్రీనుకు గత ఏడాది డిసెంబరు 11వ తేదీన కోటవురట్ల మండలం లింగాపురం గ్రామానికి చెందిన రోహిణి పార్వతితో వివాహమైంది. ఉద్యోగం చేస్తున్న కంపెనీకి అత్తవారి ఊరు దగ్గరగా వుండ డంతో   లింగాపురం నుంచే రాకపోకలు సాగిస్తు న్నారు. యథావిధిగా మంగళవారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరి విధులకు హాజర య్యారు. విధి నిర్వహణలో భాగంగా ట్యాంకు లోపలకు దిగి శుభ్రం చేస్తుండగా ఊపిరాడక స్పృహతప్పి పడిపోయాడు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రీను భర్త, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు. జీవితాంతం తోడుంటాడనుకున్న భర్తను నాలుగు నెలలు తిరక్కుండానే మృత్యువు దూరం చేయడాన్ని భార్య రోహిణి పార్వతి తట్టుకోలేపోతున్నారు. ‘‘కరోనా వైరస్‌ వల్ల డ్యూటీకి వెళ్ల వద్దని ఇంటివద్ద ఒత్తిడి చేస్తున్నారు. ఈ రోజు పనిచేసి బుధవారం నుంచి సెలవు పెట్టేస్తాను, కరోనా వైరస్‌ ప్రభావం తగ్గే వరకు విధులకు రాను’’ అని చెప్పాడని సహచర ఉద్యోగులు గుర్తు చేసుకుంటున్నారు.

Updated Date - 2020-04-08T18:03:51+05:30 IST