విశాఖలో విషాదం.. సింగపూర్‌లో భర్త అంత్యక్రియలు.. భార్య వాట్సప్‌కు ఫొటోలు..

ABN , First Publish Date - 2020-04-08T17:24:40+05:30 IST

సింగపూర్‌లో వెల్డర్‌గా పనిచేసేందుకు వెళ్లిన ఎస్‌.రాయవరం మండలం వమ్మవరం గ్రామానికి చెందిన వెలుగుల సూర్యారావు (35) రెండు రోజుల క్రితం మృతిచెందాడు. అయితే కరోనా వైరస్‌ను నియంత్రించే చర్యల్లో భాగంగా విమానాల రాకపోకలు

విశాఖలో విషాదం.. సింగపూర్‌లో భర్త అంత్యక్రియలు.. భార్య వాట్సప్‌కు ఫొటోలు..

కడసారి చూపునకు నోచుకోలేదు!

కుటుంబ సభ్యుల ఆవేదన

సింగపూర్‌లో విశాఖ జిల్లా వాసి మృతి

మృతదేహాన్ని తీసుకువచ్చే మార్గం లేక అక్కడే అంత్యక్రియలు


ఎస్‌.రాయవరం (విశాఖపట్టణం): సింగపూర్‌లో వెల్డర్‌గా పనిచేసేందుకు వెళ్లిన ఎస్‌.రాయవరం మండలం వమ్మవరం గ్రామానికి చెందిన వెలుగుల సూర్యారావు (35) రెండు రోజుల క్రితం మృతిచెందాడు. అయితే కరోనా వైరస్‌ను నియంత్రించే చర్యల్లో భాగంగా విమానాల రాకపోకలు నిలిపివేయడంతో చివరి చూపు కూడా దక్కక అతడి కుటుంబం విలవిల్లాడుతోంది. వివరాలిలా ఉన్నాయి... వమ్మవరం గ్రామానికి చెందిన సూర్యారావు నాలుగు నెలల కిందట సింగపూర్‌ వెళ్లాడు. అక్కడ ఒక కంపెనీలో వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం పనిచేస్తుండగా సూర్యారావు మృతి చెందినట్టు సంబంధిత  కంపెనీ ప్రతినిధి ఒకరు ఫోన్‌లో తమకు సమాచారమిచ్చినట్టు అతడి భార్య శ్రావణి చెప్పారు.


తన భర్త ఎలా చనిపోయాడో కూడా తెలియలేదని, ప్రమాదమా?, మరేమైనా కారణమా? అనేది చెప్పలేదని వాపోయింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో విమాన రాకపోకలు నిలిచిపోవడంతో మృతదేహాన్ని స్వగ్రామానికి చేర్చే దారి లేక అక్కడ వున్న సూర్యారావు స్నేహితులు, సిబ్బంది, తెలుగు అసోసియేషన్‌ ప్రతినిధులు సోమవారం అంత్యక్రియలు నిర్వహించి ఆ వీడియో, ఫొటోలు తమకు పంపారని శ్రావణి చెప్పారు. సూర్యారావు, శ్రావణి దంపతులకు ఒక బాబు(4), పాప(3) ఉన్నారు. కుటుంబ పోషణ కోసం సింగ్‌పూర్‌ వెళ్లిన తన భర్త మరణించడంతో తాము రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని శ్రావణి కన్నీటి పర్యంతమయ్యింది. కనీసం భర్త కడసారి చూపు కూడా దక్కలేదని రోదిస్తోంది. గ్రామంలో ఈ సంఘటన విషాదాన్ని నింపింది.

Updated Date - 2020-04-08T17:24:40+05:30 IST