Abn logo
Jan 25 2021 @ 03:15AM

గంటల్లోనే భార్యాభర్త హఠాన్మరణం

ముందు ఆమె.. అది తెలిసి ఆయనా మృతి

శృంగవరపుకోట, జనవరి 24: గుండెపోటుతో గంటల్లోనే ఒకరి తరువాత ఒకరిగా భార్య, భర్త ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన విజయనగరం జిల్లా శృంగవరపుకోట పందిరప్పన్న కూడలిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా అమదాలవలసకు చెందిన అర్ధంకి రాజమనోహర్‌రావు(57)..మేనకోడలు వరసైన సూర్య ప్రభావతిని(48) ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఎల్‌ఐసీ డెవల్‌పమెంట్‌ ఆఫీసర్‌ విధుల్లో భాగంగా రాజమనోహర్‌రావు తన కుటుంబంతో కలిసి ఇరవై ఏళ్లుగా శృంగవరపుకోటలో ఉంటున్నారు. ఇంట్లో భార్య, డిగ్రీ చదువుతున్న కుమారుడు రామలిఖిత్‌లతోపాటు సూర్యప్రభావతి చెల్లెలు ఎం తేజశ్రీ కూడా వీరితో కలిసి ఉంటున్నారు శనివారం రాత్రి 11 గంటల సమయంలో భార్య, భర్త మధ్య ఏదో విషయంలో వాగ్వాదం జరిగింది. దంపతులిద్దరికీ హైబీపీ ఉండడంతో తీవ్ర ఉద్రేకానికి లోనయ్యారు. వాగ్వాదం తరువాత కోపంతో రాజమనోహర్‌రావు ఇంటి పై అంతస్థులోని తన గదిలోకి వెళ్లిపోయారు.


ఇంతలో సూర్య ప్రభావతి అస్వస్థతకు గురయ్యారు. దీన్ని గమనించిన కుమారుడు రామలిఖిత్‌ ఒక పక్క సపర్యలు చేస్తూ, మరో పక్క తండ్రికి సమాచారం ఇచ్చారు. ఆయన కిందకు వచ్చి ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు 108 వాహనానికి ఫోన్‌ చేశారు. వారొచ్చి చూసేటప్పటికే ఆమె మృతిచెందింది. భార్య మృతిని తట్టుకోలేని రాజమనోహర్‌రావు.. ఆ తరువాత కొద్ది సేపటికే ఉన్నచోటే కుప్పకూలారు. క్షణాల్లోనే ప్రాణాలు విడిచాడు. రాజమనోహర్‌రావు ఐదేళ్లగా గుండె జబ్బు, చక్కెర వ్యాధితో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు, ఎల్‌ఐసీ ఉద్యోగులు చెబుతున్నారు. 

Advertisement
Advertisement
Advertisement