హర్మన్‌ తుఫాన్‌

ABN , First Publish Date - 2022-09-22T06:42:17+05:30 IST

కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (111 బంతుల్లో 18 ఫోర్లు, 4 సిక్స్‌లతో 143 నాటౌట్‌) అజేయ శతకంతో కదంతొక్కింది.

హర్మన్‌ తుఫాన్‌

సెంచరీతో కౌర్‌ విజృంభణ 

భారత్‌ 333/5 

ఇంగ్లండ్‌తో రెండో వన్డే


రెండో అత్యధికం

భారత మహిళల జట్టుకు వన్డేల్లో ఇది రెండో అత్యధిక స్కోరు. అంతకుముందు 2017లో ఐర్లాండ్‌పై 358/2 స్కోరు చేసింది. 


వన్డేలలో వేగవంతంగా 3వేల రన్స్‌ చేసిన తొలి భారత బ్యాటర్‌ మంధాన

సంక్షిప్తస్కోర్లు

భారత్‌: 50 ఓవర్లలో 333/5 (హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 143 నాటౌట్‌, హర్లీన్‌ డియోల్‌ 58, స్మృతి మంధాన 40, యాస్తిక భాటియా 26, పూజ 16, దీప్తిశర్మ 15 నాటౌట్‌, బెల్‌ 1/79, క్రాస్‌ 1/68, కెంప్‌ 1/82, చార్లీ 1/39, ఎకిల్‌స్టోన్‌ 1/64).


కాంటర్‌బరీ:  కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (111 బంతుల్లో 18 ఫోర్లు, 4 సిక్స్‌లతో 143 నాటౌట్‌) అజేయ శతకంతో కదంతొక్కింది. వన్డేలో టీ20లను మించిన సుడిగాలి ఇన్నింగ్స్‌ ఆడింది. ఆమెతోపాటు హర్లీన్‌ డియోల్‌ (58), స్మృతి మంధాన (40) కూడా సత్తా చాటడంతో ఇంగ్లండ్‌తో బుధవారంనాటి రెండో వన్డేలో భారత్‌ 5 వికెట్లకు 333 పరుగులు చేసింది. ఆ జట్టుపై భారత్‌కిది అత్యధిక స్కోరు కావడం విశేషం. భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌.. కడపటి సమాచారమందేసరికి 43 ఓవర్లలో 243/9 స్కోరు చేసింది. డానీ వ్యాట్‌ (65) హాఫ్‌ సెంచరీ చేయగా, కెప్టెన్‌ అమీ జోన్స్‌ 39, క్యాప్సీ 39 పరుగులు సాధించారు. రేణుకా సింగ్‌ 4 వికెట్లు పడగొట్టింది.  


తొలుత మంధాన, హర్లీన్‌: టాస్‌ కోల్పోయి భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేపట్టగా.. ఓపెనర్‌ షఫాలీ వర్మ (8) తన వైఫల్య పరంపర కొనసాగించింది. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లోనే పేసర్‌ క్రాస్‌ ఓ అద్భుత బంతితో వర్మను క్లీన్‌బౌల్డ్‌ చేసింది. తొలి వన్డేలో అర్ధ శతకాలు చేసిన మంధాన, కీపర్‌ యాస్తికా భాటియా అదే జోరును ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించారు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరుబోర్డును పరిగెత్తించారు. కానీ కుదురుకుంటున్న ఈ జోడీని తన బౌలింగ్‌లోనే భాటియాను క్యాచవుట్‌ చేయడం ద్వారా స్పిన్నర్‌ చార్లీ విడదీసింది. స్మృతి, యాస్తిక  రెండో వికెట్‌కు 54 పరుగులు జోడించారు. ఈ దశలో మంధానకు కెప్టెన్‌ హర్మన్‌కౌర్‌ జత కలిసింది. అయితే హాఫ్‌ సెంచరీకి చేరువైన తరుణంలో స్మృతిని మరో స్పిన్నర్‌ ఎకిల్‌స్టోన్‌ ఎల్బీగా పెవిలియన్‌కు చేర్చింది. హర్లీన్‌ డియోల్‌ వస్తూనే ఫోర్లతో ఎదురు దాడికి దిగగా.. మరోవైపు కౌర్‌ కూడా బౌండరీలతో దూకుడు ప్రదర్శించింది. ఈక్రమంలో చార్లీ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌ బాదిన హర్మన్‌ వరుసగా మూడో హాఫ్‌ సెంచరీ చేసింది. తర్వాత హర్లీన్‌ కూడా ఆ మార్క్‌కు చేరింది. 113 రన్స్‌ జోడించి ప్రమాదకరంగా మారిన ఈ జోడీని బెల్‌ విడదీసింది. బెల్‌ బంతిని భారీ షాట్‌గా మలిచే యత్నంలో క్యాచ్‌ ఇచ్చి హర్లీన్‌ నిష్క్రమించింది. 


హర్మన్‌..చెలరేగెన్‌: అర్ధ శతకం పూర్తి చేశాక హర్మన్‌ ఒక్కసారిగా బ్యాట్‌ ఝుళిపించింది. ఇంగ్లండ్‌ పేసర్లు క్రాస్‌, కెంప్‌, స్పిన్నర్‌ ఎకిల్‌స్టోన్‌లను చెడుగుడు ఆడుకుంది. పూజా వస్త్రాకర్‌ అవుటయ్యాక, ఎకిల్‌స్టోన్‌ బౌలింగ్‌లో స్లాగ్‌ స్వీప్‌ ఫోర్‌తో సెంచరీ చేసిన కౌర్‌..ఆపై కెంప్‌ బౌలింగ్‌లో 6,4,తో దుమ్ము రేపింది. ఇక ఎకిల్‌స్టోన్‌ బౌలింగ్‌లో కళ్లు చెదిరే షాట్లతో 4,6,4 రాబట్టింది. కెంప్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్లోనైతే 6,4,4,4తో కౌర్‌ చెలరేగింది. అటు హర్మన్‌కు తోడు ఇటు దీప్తీ శర్మ (15 నాటౌట్‌) ధాటిగా ఆడడంతో చివరి మూడు ఓవర్లలో భారత్‌కు 62 పరుగులు లభించాయి.  

Updated Date - 2022-09-22T06:42:17+05:30 IST