మాట వినకుంటే వేటు

ABN , First Publish Date - 2022-05-24T05:42:41+05:30 IST

మాట విన్నారా సరే... లేదంటే బదిలీ వేటు పడినట్లే...! జిల్లాలో జిల్లాస్థాయి అధికారుల పనితీరు నచ్చకపోతే ఇబ్బడి ముబ్బడిగా బదిలీవేటు వేస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

మాట వినకుంటే వేటు

జిల్లా యంత్రాంగంపై అధికార పార్టీ నేతల ఒత్తిడి 

తమ మాట వినకపోతే బాధ్యతల నుంచి తప్పించడం.. బదిలీ చేయడమే..

ఆందోళనలో జిల్లా అధికార యంత్రాంగం 

ఇప్పటికే ఆరుగురు అధికారులపై బదిలీ వేటు 

మరికొందరిపైనా వేటు వేసేందుకు రంగం సిద్ధం 

నిర్మల్‌, మే 23 (ఆంధ్రజ్యోతి) : మాట విన్నారా సరే... లేదంటే బదిలీ వేటు పడినట్లే...! జిల్లాలో జిల్లాస్థాయి అధికారుల పనితీరు నచ్చకపోతే ఇబ్బడి ముబ్బడిగా బదిలీవేటు వేస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సాఽధారణ బదిలీలు లేకపోయినా.. ఉన్నతాధికారుల పదవీ కాలం పూర్తికాకపోయినా ఇక్కడ బదిలీ జరుగుతుంది. అవసరమైతే స్పెషల్‌ జీఓలు తెప్పించి మరీ బదిలీవేటు వేస్తున్నారు. గడిచినా నాలుగు నెలలకాలంలో ఐదుగురు ఉన్నతాధికారులపై బదిలీవేటు పడడం చర్చనీయాంశంగా మారింది. అధికారపార్టీ నియోజకవర్గస్థాయి అగ్రనేతల ఒత్తిళ్లకు జిల్లా అధికారులు బలవుతున్నారు. గతంలో జిల్లాలో పనిచేసే అవకాశం దక్కడం అంటే అదొక ఉత్తమఛాన్స్‌గా అధికారులు భావించేవారు. కానీ పరిస్థితులు మారుతున్నాకొద్దీ నేతల అధికారదాహం, అక్ర మాలను అడ్డుకుంటున్నారన్న అక్కసు వంటి కారణాలతో బదిలీలు ఎ క్కువగా పెరిగిపోతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటిదాక ఐదుగురు అధికారులను బదిలీ చేసిన తీరుచూస్తే ఆ అధికారులను రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే బదిలీ చేసిన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

ఆ ముగ్గురికి నచ్చకపోతే బదిలీ వేటే

జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో పెద్దన్నపాత్ర పోషిస్తున్న ఆ ముగ్గురునేతలకు అధికార యంత్రాంగం చెప్పుచేతల్లో మెలగాల్సిందే. పోలీసు అధికారుల నుంచి మొదలుకొని కీలక ప్రభుత్వశాఖల్లో ముఖ్యమైన పోస్టుల్లో  కొనసాగే ఉన్నతాధికారులు వారిని ప్రసన్నం చేసుకోవాల్సిందే. లేదంటే రాష్ట్రస్థాయిలో ఒత్తిళ్లులు తెచ్చి అధికారులపై బదిలీ వేటు వేయిస్తారన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాన్ని అధికార పార్టీ నేతలే అవునంటున్నారు. నిర్మల్‌ నియోజకవర్గంలో కొనసాగుతున్న కాలేశ్వరం ప్రాజెక్ట్‌ ప్యాకేజీ నంబర్‌ - 27 డిప్యూటీ ఈఈగా పనిచేసిన జగదీష్‌ను తక్కువకాలంలోనే బదిలీచేశారు. ఇక్కడి నేతకు సన్నిహితంగా ఉండే మరో డీఈని ఇక్కడికి తీసుకువచ్చారు. గతంలో ప్యాకేజీనంబర్‌ - 27 బాధ్యతలతో పాటు సరస్వతీ కాలువ వ్యవహారాలు చూసిన ఆ అధికారిని తమకు అనుకూలంగా ఉంటాడన్న కారణంగా మళ్లీపోస్టింగ్‌ ఇప్పించారన్న ఆరోపణలున్నాయి. మత్స్యశాఖలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన దేవేందర్‌ను కరీంనగర్‌కు డిప్యూటేషన్‌పై పంపించారు. ఖానాపూర్‌ నియోజకవర్గ ముఖ్యనేత ఆయనను పట్టుబట్టి మరీబదిలీ చేయించారన్న ఆరోపణలున్నాయి. తమకు అనుకూలంగా ఉన్నవ్యక్తిని జగిత్యాల్‌ నుంచి ఇక్కడికి బదిలీపై రప్పించినట్లు తెలుస్తోంది. ఇటీవల పురపాలకసంఘం పారిశుధ్య కార్మికుల నియామక ప్ర క్రియలో వ్యూహాత్మకంగా కమిషనర్‌ను అధికారపార్టీ ఒత్తిళ్లతో బదిలీ చే యించారన్న ఆరోపణలున్నాయి. గతంలో మున్సిపల్‌ డీఈగా పనిచేసిన సంతోష్‌ను కూడా రాజకీయ ఒత్తిడిలతోనే బదిలీ చేసినట్లు ప్రచారం ఉండగా తనకు అనుకూలంగా ఉంటాడని మరోనేత ఆయనను ఖానాపూర్‌లో డిప్యూటేషన్‌పై పోస్టింగ్‌ ఇప్పించుకున్నట్లు విమర్శలున్నాయి. ఇక నిర్మల్‌ డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి బదిలీకి ముందు నుంచే తమకు అనుకూలంగా ఉండే మరో అధికారి స్థానికంగా అటాచ్‌పోస్టు ఇప్పించి ఇటీవలనే రెగ్యులర్‌ డీఎస్పీగా అవకాశం కల్పించినట్లు కూడా విమర్శలున్నాయి. 

ఆర్డీఓ పోస్టుల్లో తహసీల్దార్‌లు...? 

నిర్మల్‌ జిల్లాలో రెండు ఆర్డీఓ పోస్టులు ఉన్నాయి. నిర్మల్‌ , భైంసా ఆర్డీఓ స్థానాల్లో ఇప్పుడు తహసీల్దార్‌లకు ఆర్డీఓలుగా పదవి బాధ్యతలు ఇవ్వడం విమర్శలతో పాటు చర్చనీయాంశంగా మారింది. గతంలో భైంసాలో ఆర్డీఓగా పని చేసిన రాజు బదిలీ కాగా తాజాగా నిర్మల్‌ ఆర్డీఓ రాథోడ్‌ రమేష్‌పై బదిలీ వేటు వేశారు. రెవెన్యూ రికార్డుల వ్యవహారంలో కొన్ని డి - 1 పట్టాల విషయంలో కొంతకాలం నుంచి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన ఆ అధికారిని వ్యూహత్మకంగా భవిష్యత్‌ విచారణల నేపథ్యంలో బదిలీపై పంపించినట్లు తెలుస్తోంది. భైంసాలో లోకేశ్వర్‌రావు , నిర్మల్‌లో తుకారం అనే ఇద్దరు తహసీల్దార్‌లకు ఏకంగా ఆర్డీఓ స్థానాల్లో ఎఫ్‌ఎసీ ( ఫుల్‌ అడిషనల్‌ చార్జ్‌ )గా నియమస్తూ ఉత్తర్వులు జారీ చేయడంలో కూడా అధికార పార్టీ నేతల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలన్ని చూస్తుంటే తమ మాట వింటే సరి లేకపోతే బదిలీ వేటు తప్పదన్న రీతిలో అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్నట్లు ప్రచారం ఉంది. మరో ముగ్గురు కీలక శాఖ అధికారులపై కూడా బదిలీ వేటు వేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇదీ అధికార వర్గాల్లో కలకలం రేపుతుండగా కొందరు అధికారులు నేతల తీరు పట్ల ఆందోళన చెందుతున్నారు. మితిమీరిన రాజకీయ జోక్యం వల్ల నిర్మల్‌ జిల్లాలో పని చేయకపోవడమే మంచిదన్న అభిప్రాయానికి అఽధికారులు వస్తున్నారు. 

జిల్లాకు వచ్చేందుకు వెనకంజ

తరచుగా అధికారులను బదిలీ చేస్తున్న తీరుతో ఈ జిల్లాకు వచ్చేందుకు అధికారులుల ఆసక్తిని చూపడం లేదు. ముఖ్యంగా నిర్మల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ పోస్టు విషయంలో అధికారులు పెదవి విరుస్తున్నట్లు సమాచారం. చిన్న చిన్న విషయాలకే పొగ పెట్టి ఇక్కడి నుంచి పంపిస్తారన్న ప్రచారం నేపథ్యంలో ఇక్కడికి రావడానికి జంకుతున్నారు. అలాగే ఇతర కీలక శాఖల పోలీసు , రెవెన్యూ విభాగాల అధికారులు కూడా ఎందుకు వచ్చిన గొడవ అన్నట్లు నిర్మల్‌ జిల్లాకు వచ్చేందుకు వెనకంజ వేస్తున్నట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 

Updated Date - 2022-05-24T05:42:41+05:30 IST