Abn logo
Jan 6 2021 @ 00:39AM

రహస్యాల వేటగాడు

వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అస్సాంజ్ విషయంలో బ్రిటన్ కోర్టు సోమవారం నాడు ఇచ్చిన తీర్పు వల్ల తాత్కాలికమైన ఊరటే తప్ప, ఆయన కష్టాలకు తెరపడినట్టు కాదు. అమెరికన్ జైళ్లలో ఉన్న దుర్భరపరిస్థితుల కారణంగాను, నిందితుడి మానసిక స్థితి వల్లనూ, అస్సాంజ్ ఆత్మహత్యకు పాల్పడే ప్రమాదం ఉన్నందున, ఆయనను అమెరికాకు అప్పగించడం కుదరదు అని న్యాయమూర్తి బరైస్టర్ తీర్పు చెప్పారు. అదే సమయంలో, అస్సాంజ్పై ఉన్న అభియోగాల విషయంలో అమెరికా తరహాలోనే న్యాయమూర్తి నిర్ధారణలు చేశారు. అస్సాంజ్ పదిసంవత్సరాల కిందట చేసింది పాత్రికేయ వృత్తి పరిధికి మించిందని ఆమె వ్యాఖ్యానించారు. ఈ తీర్పుపై అప్పీలు చేసుకోవడానికి అమెరికాకు రెండు వారాల గడువుంది. అమెరికా చేతికి బదలాయింపు జరిగి, అక్కడ నిరీక్షిస్తున్న తీవ్ర అభియోగాలను ఎదుర్కొంటారా, అదే రకపు వ్యాజ్యాన్ని బ్రిటన్‌లో ఎదుర్కొంటారా అన్నది మున్ముందు కానీ తెలియదు. 


అస్సాంజ్ ఏ దేశపు ఖైదీగా పరిణమిస్తారా అన్నది ముఖ్యమైన కుతూహలం కానక్కరలేదు. ఇది ఆయన వ్యక్తిగతమైన కష్టనష్టాలకు సంబంధించిన అంశమూ కాదు. పత్రికాస్వేచ్ఛ, పరిశోధక కథనాలను ప్రచురించే స్వేచ్ఛ మొదలైన ప్రాథమిక హక్కులు గెలిచి నిలుస్తాయా, అగ్రరాజ్యాల దాష్టీకం ముందు పరాజితం అవుతాయా అన్నది ఇక్కడ ప్రశ్న. జూలియన్ అస్సాంజ్, ఎడ్వర్డ్ స్నోడెన్ వంటి రహస్యఛేదకులను కాపాడుకోలేకపోతే, ప్రభుత్వాల క్రూరరహస్యాలకు ఇనుపతెరల రక్షణ లభిస్తూనే ఉంటుంది. మరోవైపు ప్రజల వ్యక్తిగత సమాచారానికి ఎటువంటి భద్రతా లేకుండా పోతుంది. రక్షణ పొందే ప్రభుత్వ రహస్యాలు ఎటువంటివి? విదేశాలపై చేసే వైమానిక దాడులకు సంబంధించిన కీలక సమాచారం, సకల దేశాల పౌరుల ఫోన్ సంభాషణల రికార్డులు, ఇవే, ఇటువంటివే. ఏవి ప్రజాభద్రతకు, దేశభద్రతకు సంబంధించిన రహస్యాలో నిర్ణయించే అధికారం ప్రభుత్వాలకే ఏకపక్షంగా దక్కితే, పాలకపక్షంలోని అవినీతి సమాచారాన్ని కూడా భద్రతారహస్యాలుగా పరిగణించాలని వాదించగలరు.   ఏ దేశం మాత్రం గూఢచర్యం చేయదు, అమెరికా ఇతర దేశాల విషయంలో చేసినదానిపై ఇంత యాగీ అవసరమా- అని స్నోడెన్ విషయంలో బరాక్ ఒబామా వ్యాఖ్యానించారు. ఇక ట్రంప్ సంగతి చెప్పనక్కరలేదు, అస్సాంజ్పై గూఢచర్యం కేసును, స్నోడెన్‌పై దేశద్రోహ కేసును మోపవలసిందేనని పట్టుదల చూపారు. అస్సాంజ్పై గూఢచర్యం కేసు మోపితే, ఆయన ఇచ్చిన కీలక సమాచారాన్ని ప్రచురించిన అనేక అమెరికన్, అంతర్జాతీయ పత్రికలపై కూడా అభియోగాలు చేయవలసి వస్తుందని, అదంతా పెను వివాదాలకు దారితీస్తుందన్న అధికారుల హెచ్చరిక మేరకు, ఒబామా హయాంలో వెనుకంజ వేయగా, అస్సాంజ్‌ను వెనక్కు రప్పించడం మీద ట్రంప్ దృష్టి పెట్టారు. 


ఆస్ట్రేలియన్ అయిన జూలియన్ అస్సాంజ్, చాలా చిన్నతనం నుంచే హ్యాకింగ్ మీద అభిరుచి కలిగినవాడు. మిత్రులతో కలసి 2006లో వికీలీక్స్‌ను స్థాపించాడు. యెమెన్ మీద డ్రోన్ దాడులు, అరబ్ దేశాల్లో అవినీతి, కెన్యాలో చట్టవ్యతిరేక మరణశిక్షలు... ఇవి తొలిరోజుల   కథనాలు. 2009లో  ఇరాన్‌లోని అణు కేంద్రంలో జరిగిన ప్రమాదాన్ని, దాని వెనుక అమెరికా- ఇజ్రాయిల్ సైబర్ కుట్రను బయటపెట్టాడు. అమెరికా సైనికులు ఇరాక్‌లో హెలికాప్టర్పై నుంచి కాల్పులు జరుపుతూ, ఒక రాయిటర్ విలేఖరి సహా 18 మంది పౌరులను హతమార్చే విడియోను 2010లో వికీలీక్స్ విడుదల చేసింది. సైన్యంలో పనిచేసిన చెల్సీ మానింగ్ అనే మహిళా కార్యకర్త అందించిన కీలకపత్రాల ద్వారా- ఇరాక్ యుద్ధ సమాచారం, ఆప్ఘనిస్థాన్‌ యుద్ధ వివరాలు, లక్షలాది దౌత్యసంభాషణలు 2010లోనే వికీలీక్స్ ద్వారా బయటి ప్రపంచానికి తెలిసి పెనుకలకలం చెలరేగింది. అప్పటినుంచి అస్సాంజ్పై వేట మొదలైంది. అదే సంవత్సరం స్వీడన్ పర్యటనకు వెళ్లిన అస్సాంజ్పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి, అయినా వెంటనే అతనిపై కేసు నమోదు చేయలేదు. కొంత కాలం తర్వాత అతను లండన్ లో ఉన్నప్పుడు పాత వేధింపుల కేసును పైకి తీసి, స్వీడన్ వారంట్లు జారీచేసింది. ఆ దేశం తనను అమెరికాకు అప్పగిస్తుందని గ్రహించి, అస్సాంజ్ లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలోకి వెళ్ళి ఆశ్రయం కోరాడు. అనేక సంవత్సరాలు అక్కడే ఉన్న తరువాత, ఈక్వెడార్ ఇక తాను ఆశ్రయం ఇవ్వలేనని చెప్పడంతో బ్రిటిష్ పోలీసులు అస్సాంజ్‌ను గత ఏడాది అరెస్టు చేశారు. బెయిల్ ఉల్లంఘన కేసులో అతనికి 50 వారాల శిక్ష పడింది. నిర్బంధంలో ఉండగానే, తరలింపునకు అనుకూలంగా తీర్పు కోసం అమెరికా ప్రయత్నిస్తూ వచ్చింది. 


అస్సాంజ్ చేసింది పాత్రికేయం కాదు, గూఢచర్యం అని అమెరికా వాదిస్తుంటే, తరలింపును కాదన్న న్యాయమూర్తి కూడా పాత్రికేయం కాదనే వ్యాఖ్యానించారు. నిజానికి, అస్సాంజ్ చేసింది అత్యంత సాహసోపేతమైన, ప్రజాహితమైన చర్య. సరిహద్దులు లేవని, కట్టడులు లేవని, దాపరికాలు ఉండవద్దని చెబుతున్న ఆధునిక కాలంలో, వెల్లడి నేరం ఎట్లా అవుతుంది? ప్రభుత్వాలు తమ ప్రజలపైనా, ఇతర దేశాల ప్రజలపైనా జరిపిన దారుణాలు ఎట్లా రహస్యాలు అవుతాయి? తాత్కాలికమైన నిర్బంధం నుంచి అతను విడుదల అవుతాడు కానీ, వికీలీక్స్ ద్వారా ఆయన చేసిన దోహదంపై ఎటువంటి అభియోగమూ మిగలకూడదని, స్వేచ్ఛతో సాహసంతో అతను మరిన్ని రహస్యాలను బట్టబయలు చేయాలని ప్రజాస్వామ్యవాదులు కోరుకుంటున్నారు.

Advertisement
Advertisement
Advertisement