ఆకలి చదువులు

ABN , First Publish Date - 2022-05-03T05:09:39+05:30 IST

పదో తరగతి చదువుతున్న విద్యార్థులు మెరుగైన ఉత్తీర్ణత సాధించేందుకు ప్రతిరోజు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు

ఆకలి చదువులు
ప్రత్యేక తరగతులకు హాజరై చదువుకుంటున్న విద్యార్థినులు

పదోతరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు

పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో మధ్యాహ్న భోజనం బంద్‌

ఖాళీ కడుపుతో చదువుపై దృష్టిసారించలేకపోతున్న విద్యార్థులు

దాతలు సహకరిస్తే  విద్యార్థులకు తీరనున్న ఆకలి బాధలు


మెదక్‌ అర్బన్‌, మే2: పదో తరగతి చదువుతున్న విద్యార్థులు మెరుగైన ఉత్తీర్ణత సాధించేందుకు ప్రతిరోజు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే స్పెషల్‌ క్లాసులకు హాజరవుతున్న విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు సెలవులు రావడంతో మధ్యాహ్న భోజనం నిలిపివేశారు. ఇక పదోతరగతి విద్యార్థులకు ఉదయం 8:30 గంటలకే తరగతులు ప్రారంభించడంతో మారుమూల గ్రామాల నుంచి వచ్చే వారికి ఇబ్బందులు తప్పడం లేదు. చాలామంది ఇళ్లలో ఉదయం వంట కాకపోవడంతో పరిగడుపుతో పాఠశాలకు వస్తున్నారు. 11 గంటలకు వరకు చదువుకుని తిరిగి వెళ్తున్నారు. కానీ ఆ సమయంలో ఆకలితో చదువుపై దృష్టి సారించడం కష్టమే. అయితే దాతలెవరూ ముందుకు రాకపోవడంతో మెదక్‌ జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు ఆకలితోనే చదువుకుంటున్నారు.


ఉత్తమ ఫలితాల కోసం

కొవిడ్‌ వల్ల రెండేళ్లు వార్షిక పరీక్షలు లేకుండానే పదోతరగతి విద్యార్థులను ప్రమోట్‌ చేసిన సర్కారు.. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈసారి పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం పదోతరగతి చదువుతున్న విద్యార్థులు 8, 9 తరగతులు చదవకుండానే ప్రమోటై ఈ ఏడాది పది వార్షిక పరీక్షలు రాయనున్నారు. వారు ఉత్తమ ప్రతిభ కనబరిచేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఉదయం, సాయంత్రం తరగతులు నిర్వహిస్తున్నారు.


ముందుకు రాని దాతలు

 ఈ స్పెషల్‌ క్లాసులు మే 20 వరకు కొనసాగనున్నాయి. ఒంటిపూట బడి సమయంలో మఽధ్యాహ్న భోజనం పెట్టేవారు. ప్రస్తుతం వేసవి సెలవులు రావడంతో మధ్యాహ్న భోజనానికి అవకాశం లేదు. దాంతో ప్రస్తుతం ఉదయం 11 గంటల వరకు చదువుకుంటున్న విద్యార్ధులకు ఆహారం అందక ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా ఇరవై రోజుల సమయం ఉంది. కనీసం అప్పటివరకైనా ఎవరైనా దాతలు వస్తే విద్యార్థుల ఆకలి బాధలు తీరుతాయి.


అల్పాహారం అందించాలి 

- స్వాతి, విద్యార్థిని అవుసులపల్లి

నిత్యం అవుసుపల్లి నుంచి మెదక్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ప్రత్యేక తరగతులకు హాజరుతున్నాం. మాకు ఎవరూ ఎలాంటి అల్పాహారం ఇవ్వడం లేదు. ఉదయం వంట కాకపోవడంతో ఖాళీ కడుపుతో పాఠశాలకు వస్తున్న. ఇది వరకు మధ్యాహ్న భోజనం అందించేవారు. కానీ ఇప్పుడు మేం ఆకలికి ఇబ్బందులు పడుతున్నాం.


దాతలు ముందుకొచ్చి సహకరించాలి

- రమే్‌షకుమార్‌, డీఈవో 

పదో తరగతి విద్యార్థుల అల్పాహారం కోసం నిధులు రాలేదు. దాంతో ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్ధులకు కొంత ఇబ్బంది ఉన్న మాట వాస్తవమే. ఆయా గ్రామాల్లో దాతలు ముందుకువచ్చి విద్యార్థులకు సహకరించాలి. ఒకవేళ ప్రభుత్వ నిధులు కేటాయిస్తే అల్పాహారం సమకూరుస్తాం.

Read more