క్వారంటైన్‌లో ఆకలి కేక!

ABN , First Publish Date - 2020-07-06T08:18:15+05:30 IST

రాష్ట్రంలోని కొవిడ్‌-19 ఆస్పత్రుల్లో అందించే భోజనం, సౌకర్యాలు అధ్వానంగా ఉన్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లోనూ చికిత్స పొందుతున్నవారు పౌష్టికాహారం అందక

క్వారంటైన్‌లో ఆకలి కేక!

  • ఉడికీ ఉడకని అన్నం.. మాడిపోయిన చపాతీ
  • నీళ్ల సాంబారు.. ఉప్పూకారం లేని కూరలు
  • పేరుకు పౌష్టికాహారంతో కూడిన మెనూ
  • కానీ.. నోట్లో పెట్టుకునే వీల్లేని భోజనం 
  • 340 చెల్లిస్తున్నా.. కాంట్రాక్టర్ల చేతివాటం
  • మంచినీళ్లకూ కరువే.. మందులు కూడా లేవు
  • క్వారంటైన్‌ సెంటర్లలో జనాల దీనావస్థ
  • నాణ్యత లేని ఆహారం తినలేమంటూ
  • హోం క్వారంటైన్‌కు పంపాలని వేడుకోలు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): రాష్ట్రంలోని కొవిడ్‌-19 ఆస్పత్రుల్లో అందించే భోజనం, సౌకర్యాలు అధ్వానంగా ఉన్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లోనూ చికిత్స పొందుతున్నవారు పౌష్టికాహారం అందక అల్లాడుతున్నారు. కడప జిల్లాలోని కొవిడ్‌ ఆస్పత్రిలో సమయానికి ఆహారం అందడం లేదని వారు గగ్గోలు పెడుతున్నారు. తమ గోడును సోషల్‌ మీడియాలో వెళ్లబోసుకుంటున్నారు. ఇక్కడ తాగేందుకే కాదు.. బాత్‌రూముల్లో కూడా నీళ్లు ఉండడం లేదని చెబుతున్నారు. ఉదయం అందించే ఉప్మా సంగటిని తలపిస్తోందని, చట్నీ నీళ్లలాగా ఉందని చెబుతున్నారు. ఇక్కడే ఉంటే కరోనా వల్లేమోగానీ.. ఈ తిండి తినలేక చనిపోతామని ఓ యువకుడు భయందోళన వ్యక్తం చేశాడు. భార్యాభర్తలు రెండున్నరేళ్ల చంటిబిడ్డతో క్వారంటైన్‌కు వస్తే.. ఆ బాబుకు తాగడానికి పాలు అడిగినా ఇవ్వలేదని వారు బాధపడ్డారు.


భోజన కాంట్రాక్టరుకి పెద్దల అండ

నెల్లూరు జీజీహెచ్‌లో నాసిరకం ఆహారం పంపిణీ చేస్తున్నారు. ఒక్కోరోగికి ఆహార పంపిణీ కోసం కాంట్రాక్టరుకి రూ.340 చెల్లిస్తున్నారు. అయినా ఈ సెంటర్‌లో ఉంటున్న 200 మందికి నాసిరకమైన భోజనమే అందిస్తున్నారు. సదరు కాంట్రాక్టర్‌ జిల్లాలోని ఓ మంత్రి అనుచరుడు కావడంతో వైద్యాధికారులు ఏం చేయలేక చూస్తూ ఉండాల్సి వస్తోంది. ఇలాంటి ఆహారం తినలేక పోతున్నామని, బయటనుంచి ఆహారం తెప్పించుకుంటామని బతిమాలుకుంటున్నా అనుమతి ఇవ్వరని కొందరు వాపోతున్నారు. ఏలూరు సమీపాన ఆశ్రం కొవిడ్‌ ఆస్పత్రిలో బాధితులకు కనీసం మంచినీరు కూడా సరిపడా అందడం లేదు. ఒక్కొక్కరికి రోజుకు 5బాటిళ్ల చొప్పున మంచినీరు అందించాలి. కానీ రోజుకి 2లీటర్లతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఉదయం 10గంటలు దాటితేగానీ.. టిఫిన్‌ పెట్టడం లేదు. మధ్యాహ్నం భోజనం పెట్టేసరికి 2.30అవుతుంది. గుంటూరు జిల్లాలోని క్వారంటైన్‌ సెంటర్లలో మొదట్లో భోజనం బాగోలేదని ఆరోపణలు వచ్చాయి.  అధికారులు చర్యలు తీసుకోవడంతో పరిస్థితిలో కాస్త మార్పు కనిపిస్తోంది. విజయనగరం జిల్లాలో మూడు క్వారంటైన్‌ సెంటర్లలో అందిస్తున్న ఆహారం అధ్వానంగా ఉంటోంది. నాసిరకమైన బియ్యంతో వండిన అన్నం, రుచీపచీలేని కూరలు పెడుతున్నారని రోగులు చెబుతున్నారు.


పడకల కొరత.. మందులు లేవు

విశాఖ జిల్లాలో విమ్స్‌, ప్రభుత్వ ఛాతి, అంటువ్యాధుల ఆస్పత్రితోపాటు ప్రైవేటుకు చెందిన గీతం, గాయత్రి, ఎన్‌ఆర్‌ఐ, ప్రథమ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. వీటిల్లో గాయత్రి, విమ్స్‌లో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని అక్కడివారు చెబుతున్నారు. కొద్దిరోజుల క్రితం వైరస్‌ బారినపడి విమ్స్‌లో చేరిన పీజీ వైద్య విద్యార్థులు.. అక్కడి పరిస్థితులు, భోజన సదుపాయాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సమయానికి భోజనం పెట్టడం లేదని, రోజు మొత్తానికి ఒక బాటిల్‌ (లీటరు) నీటిని మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా తీవ్రతను తగ్గించే మందులు కూడా ఇవ్వడం లేదన్నారు. గాయత్రి ఆస్పత్రిలో రోగులకు సరిపడా పడకలు లేవని, భోజనం అధ్వానంగా ఉంటుందని, మూడు రోజుల నుంచి మందులు కూడా ఇవ్వడం లేదని పలువురు రోగులు చెబుతున్నారు. ఇక్కడ ఇన్ని బాధలు పడేకంటే తమను ఇంటికి పంపిస్తే ‘హోం ఐసొలేషన్‌’లో ఉంటామని అంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కొవిడ్‌ పాజిటీవ్‌లకు అందించే ఆహారంపై పర్యవేక్షణ కొరవడుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్వారంటైన్‌ కేంద్రాల్లో సౌకర్యాలు బాగోలేవని, సరైన భోజనం అందడం లేదని.. వారు సోషల్‌ మీడియాలో వీడియోలు పోస్టు చేస్తున్నారు. సెలవుల నిమిత్తం స్వగ్రామాలకు వచ్చిన కొంతమంది ఆర్మీ జవాన్లను కూడా పాత్రునివలసలోని క్వారంటైన్‌ కేంద్రంలో ఉంచారు. వారికి సైతం సౌకర్యాలు సక్రమంగా అందలేదు. దీంతో వారు నేరుగా కలెక్టర్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమకు హోం క్వారంటైన్‌కు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.


ప్యాకెట్ల భోజనం వాసన వస్తోంది..

అనంతపురం జిల్లాలో చికిత్స పొందుతున్న ఒక్కొక్కరికి పౌష్టికాహారంతోపాటు ఇతర వసతులు కల్పించేందుకు ప్రభుత్వం రోజుకు రూ. 500 ఖర్చు పెడుతోంది. అయితే ఆ మేరకు.. బాధితులకు చికిత్స కేంద్రాల్లో ఆహారం, ఇతరత్రా వసతులు కల్పించడంలో యంత్రాంగం విఫలమవుతోంది. జిల్లా ఆస్పత్రిలో సాధారణ రోగులకు ఆహారం అందించే ఫుడ్‌ ఏజెన్సీకే భోజనాల బాధ్యతను అప్పగించారు. కానీ.. కరోనా రోగులకు కూడా సాధారణ ఆహారమే అందిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. మిగిలిన కొవిడ్‌ చికిత్సా కేంద్రాల్లో చికెన్‌, గుడ్లు ఇతరత్రా భోజనం అందిస్తున్నా.. క్యాటరింగ్‌ ఇవ్వడంతో ప్యాకెట్లలో సరఫరా చేస్తున్నారు. దీంతో దుర్వాసన వస్తోందని, తినలేకపోతున్నామని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చికిత్స సైతం సక్రమంగా అందడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డాక్టర్లు బయటే ఉండి అక్కడికే కరోనా బాధితులను పిలిపించి తూతూ మంత్రంగా పరీక్షించి పంపిస్తున్నారు.


ఒకరోజు భోజనానికి 100 మాత్రమే

ఒంగోలు రిమ్స్‌లో 600మంది చికిత్స పొందుతున్నారు. వారిలో పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు ఉన్నారు. వీరికి పౌష్టికాహారం అందడం లేదు. ఒకరోజు చిమిడిన, మరోరోజు ఉడకని అన్నం పెడుతున్నారు. నీళ్ల సాంబారు, రాళ్లలా ఉండే ఇడ్లీలు అందిస్తున్నారు. వీటిని నోట్లో పెట్టుకోలేకపోతున్నామని బాధితులు వాపోతున్నారు. అధికారులు భోజనం కోసం ఒక్కొక్కరికి రూ.100 మాత్రమే ఖర్చుచేస్తున్నారు. అందుకే కాంట్రాక్టర్‌ నాసిరకమైన భోజనం అందిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి.

Updated Date - 2020-07-06T08:18:15+05:30 IST