ఉపాధి కూలీల ఆకలి కేకలు

ABN , First Publish Date - 2022-06-29T06:11:45+05:30 IST

జిల్లాలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు దాదాపు 1.22 కోట్ల పనిదినాలను అధికారులు కూలీలకు కల్పించారు.

ఉపాధి కూలీల ఆకలి కేకలు

నెలన్నరికి పైగా అందని వేతనాలు 

జిల్లాలో రూ.133 కోట్లకుపైగానే పెండింగ్‌

పలుచోట్ల ఆందోళనలు

పనులకు తగ్గుతున్న హాజరు

జిల్లాలో అత్యధికంగా ఉపాధి పనులు జరిగే ఎర్రగొండపాలెం క్లస్టర్‌లోని అన్ని మండలాల్లోనూ భారీగానే కూలీలకు వేతనాలు పెండింగ్‌ ఉన్నాయి. పుల్లలచెరువు మండలంలో సుమారు 2.40లక్షల పని దినాలకు సంబంధించి దాదాపు రూ.4.50 కోట్ల వేతనాలు చెల్లించాల్సి ఉంది. దోర్నాల మండలంలో రూ.56 లక్షల మేర నాలుగు వారాలుగా పెండింగ్‌లో ఉండిపోయింది.  

దర్శి క్లస్టర్‌ పరిధిలోని ఐదు మండలాల్లో సుమారు 16,800 మంది ఉపాధి కూలీలకు ఆరు వారాలుగా వేతనాలు అందలేదు. దాదాపు 6.85 లక్షల పని దినాలకు సంబంధించి ఇంచుమించు రూ.10.50 కోట్ల మేర బకాయిలు ఉన్నట్లు సమాచారం. 

బేస్తవారపేట మండలంలో లక్షా 80వేల పని దినా లకు సంబంధించి ఇంచుమించు రూ.3.60 కోట్ల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి.

జిల్లాలో ఉపాధి కూలీలకు వేతన చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో వారు ఆకలి కేకలు పెడుతున్నారు. ఇంచుమించు నెలన్నర నుంచి పనులు చేయడం తప్ప వేతనాలు జమ కావడం లేదు. ఇప్పటి వరకూ దాదాపు రెండు లక్షలకు పైగా కుటుంబాలకు చెందిన దాదాపు 68 లక్షల పని దినాలకు సంబంధించి ఇంచుమించు రూ.133 కోట్లకు పైగా వేతన బకాయిలు పేరుకుపోయాయి. ఈ ఏడాది పనులు జరిగిన 85 రోజుల్లో దాదాపు 50 రోజుల వేతనాలు నిలిచిపోయాయి. వ్యవసాయ పనులు లేని వేసవిలో ఆసరా కోసం గ్రామాల్లో ఉపాధి పనులకు వెళ్తున్న లక్షలాది మందికి కూలి నగదు రాక.. పూటగడవక అవస్థలు పడుతున్నారు. 

ఒంగోలు, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు దాదాపు 1.22 కోట్ల పనిదినాలను అధికారులు కూలీలకు కల్పించారు. జిల్లాలో 38 మండలాల్లోని 716 గ్రామ పంచాయతీల్లో 5.94 లక్షల కుటుంబాలకు జాబ్‌ కార్డులు ఉన్నాయి. వీటిలో 4.04 లక్షలు యాక్టివ్‌గా ఉన్నట్లు అంచనా. అందులో 2.98 లక్షల కుటుంబాలకు చెందిన సుమారు 5.20లక్షల మంది కూలీలు పనులకు ఈ సీజన్‌లో రాగా ఏప్రిల్‌ 1 నుంచి ఈనెల 25 వరకు కోటి 22 లక్షల పని దినాలు లభించాయి. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం రోజుకు గరిష్ఠ వేతనం రూ.257 కాగా జిల్లాలో ప్రస్తుతం సగటు రోజువారీ వేతనం రూ.196గా ఉంది. ఏప్రిల్‌లో 23.60 లక్షలు, మేలో 63.39 లక్షలు, ఈనెలలో ఇప్పటి వరకు సుమారు 25.38 లక్షల పనిదినాలు కల్పించారు. వాటికి మొత్తం వేతన రూపంలో కూలీలకు రూ.234.52 కోట్లు దక్కింది. మెటీరియల్‌ కోటా కింద రూ.15.35 కోట్లు, పాలనా ఖర్చుగా రూ.2.85 కోట్లు కలిపి మొత్తం రూ.252.40 కోట్లు పథకం కింద వెచ్చించారు.


గతనెల 9 నుంచి నిలిచిన చెల్లింపులు 

అందుతున్న సమాచారం ప్రకారం ఏప్రిల్‌లో చేసిన పనులకు వేతనాలు అందగా మే 9 నుంచి కొన్ని ప్రాంతాలు, 13నుంచి మరికొన్ని ప్రాంతాల వారికి వేతనాలు జమ కాలేదు. ఎక్కువ మంది మేలో పనులకు రాగా వారిలో అత్యధికులకు వేతనాలు అందలేదు. అలా దాదాపు జిల్లాలో రెండు లక్షలకు పైగా కుటుంబాల వారికి సుమారు 68 లక్షల పనిదినాలకు సంబంధించి ఇంచుమించు రూ.133 కోట్లకుపైగా వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ఇటు చేసిన ఉపాధి పనులకు వేతనాలు అందక, అటు వ్యవసాయ పనులు లేక గ్రామీణ ప్రాంత  కూలీలు గగ్గోలు పెడుతున్నారు. 


ఆందోళనలకు దిగుతున్న కూలీలు 

అధికారులు మాత్రం వేతనాలు పెండింగ్‌ తమ పరిధిలోది కాదని కేంద్రం నుంచి సకాలంలో నిధులు రాకా అంతా సమస్య  ఉందని చెప్తున్నారు. కొన్ని మండలాల్లో నాలుగైదు కోట్ల మేర వేతన బకాయిలు ఉండటంతో వాటికోసం పలుచోట్ల కూలీలు ఆందోళనలకు దిగుతున్నారు. మరోవైపు ఆరేడు వారాలుగా వేతనాలు నిలిచిపోవడంతో పలు ప్రాంతాల్లోని కూలీలు పనులకు వచ్చేందుకు వెనుకంజ వేస్తున్నారు. దీంతో జిల్లాలో రోజువారీ పనులకు హాజరయ్యే వారి సంఖ్య తగ్గిపోతోంది. వారం క్రితం వరకు జిల్లాలో రోజువారీ 2.10 లక్షల నుంచి 2.20 మంది కూలీలు రోజువారీ పనులకు రాగా ప్రస్తుతం ఆ సంఖ్య లక్షా 40వేలకు తగ్గిపోయింది. 


Updated Date - 2022-06-29T06:11:45+05:30 IST