చౌరీ చౌరాకు వందేళ్లు

ABN , First Publish Date - 2022-02-04T06:13:12+05:30 IST

ప్రజల స్వేచ్ఛను హరించే రౌలట్‌ చట్టం, అత్యంత దారుణమైన జలియన్‌వాలాబాగ్‌ ఊచకోతల తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమానికి గాంధీజీ పిలుపునిచ్చారు....

చౌరీ చౌరాకు వందేళ్లు

ప్రజల స్వేచ్ఛను హరించే రౌలట్‌ చట్టం, అత్యంత దారుణమైన జలియన్‌వాలాబాగ్‌ ఊచకోతల తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమానికి గాంధీజీ పిలుపునిచ్చారు. 1920 సెప్టెంబర్‌లో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్‌ ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు తీర్మానాన్ని కూడా ఆమోదించారు. దేశవ్యాప్త పర్యటనతో గాంధీజీ ప్రజలను ఉద్యమానికి సమాయత్తం చేశారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగానే పలు ఉద్యమాలు పురుడు పోసుకున్నాయి. దేశంలోని ప్రతి వ్యక్తి తన వ్యక్తిగత స్థాయిలో, సామూహిక స్థాయిలో, సంఘటిత స్థాయిలో ఆంగ్లేయుల పట్ల వ్యతిరేకత ప్రకటించడం, వారికి సహాయాన్ని నిరాకరించడమే ఈ ఉద్యమ ప్రధాన లక్ష్యం. ప్రజలందరు తమ తమ స్థాయిల్లో తమ పరిమితులతో పాల్గొనే సౌలభ్యం ఉండడంతో ఈ సహాయ నిరాకరణ పిలుపునకు విశాలమైన స్పందన వచ్చింది. 


విదేశీవస్త్ర దహనం వంటి కార్యక్రమాలు కూడా చేపట్టారు. బ్రిటిష్‌ ప్రభుత్వం ఇచ్చిన పదవులు, గౌరవాలను పలువురు త్యజించారు.


ఈ ఉద్యమంలో పాల్గొన్న సమూహాలు గాంధీజీ విధించిన అహింసా పరిధిలో ఒదిగి ఉండడం అన్ని సమయాల్లో సాధ్యం కాలేదు. ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా ఊపందుకుంటుండగానే 1922 ఫిబ్రవరి 4న ఉత్తరప్రదేశ్‌ గోరఖ్‌పూర్‌ జిల్లాలోని చౌరీ చౌరా పట్టణంలో ఒక హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. చౌరీ చౌరా రైల్వేస్టేషన్‌ రెండు గ్రామాలను మిళితం చేస్తుంది. ఫిబ్రవరి 2న చౌరీ చౌరాలో మద్యం అమ్మకాలకు వ్యతిరేకంగా మాజీ సైనికుడు భగవాన్‌ అహిర్‌ నాయకత్వంలో రైతులు నిరసన ప్రదర్శన జరిపారు. ఈ ప్రదర్శనకారులను పోలీసులు కొట్టి, నాయకులను అరెస్టు చేశారు. దీనికి ప్రతిస్పందనగా, పోలీసులకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 4న పోలీస్‌స్టేషన్‌ వద్ద ప్రజలు గుమిగూడారు. తమ నాయకులను విడుదల చేయాలని వారు నినాదాలు చేశారు. ఈసారి పోలీసులు లాఠీచార్జితో పాటు కాల్పులు కూడా జరిపారు. మందుగుండు అయిపోయేంత వరకు కాల్పులు జరిపి, పోలీసులు లోపలకు వెళ్లి తలుపులు వేసుకుని దాక్కున్నారు. పోలీసు కాల్పుల్లో ముగ్గురు పౌరులు మరణించారు. పలువురు గాయపడ్డారు. దీంతో కోపోద్రిక్తులయిన ప్రజలు పోలీస్‌స్టేషన్‌కు నిప్పంటించారు. 22 మంది పోలీసులు అందులో సజీవ దహనమయ్యారు. పారిపోవడానికి ప్రయత్నించిన పోలీసులను కూడా ప్రజలు పట్టుకుని మంటల్లోకి తోశారు.


ఈ ప్రజాగ్రహం గురించి తెలుసుకున్న గాంధీజీ చలించిపోయారు. రక్తపాతం జరగడం తన అపరాధంగా భావించారు. ఐదు రోజులు ఉపవాసదీక్ష ప్రారంభించారు. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించారు. గాంధీజీ నిర్ణయాన్ని పలువురు నాయకులు విమర్శించారు. చివరకు 1922 ఫిబ్రవరి 12న ఉద్యమం సమాప్తి అయింది. మోతీలాల్‌ నెహ్రూ, చిత్తరంజన్‌దాస్‌ వంటి నాయకులు ఉద్యమ విరమణను వ్యతిరేకించారు. వారు తర్వాత స్వరాజ్‌ పార్టీని స్థాపించారు. ఈ విధంగా చౌరీ చౌరా ఘటన భారతదేశ స్వాతంత్య్ర పోరాట చరిత్రలో నిర్ణయాత్మక ఘట్టంగా ఖ్యాతి గడించింది.


చౌరీ చౌరా కేసులో మొత్తం 228 మందిని విచారించారు. తొలుత 172 మందికి ఉరిశిక్ష విధించారు. ఎనిమిది నెలల విచారణ తర్వాత 1923 ఏప్రిల్‌ 20న 19 మందికి అలహాబాద్‌ హైకోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. ఈ కేసులో పండిట్‌ మదన్‌మోహన్‌ మాలవ్య నిందితుల తరఫున వాదించారు. బ్రిటిష్‌ ప్రభుత్వం చనిపోయిన పోలీసులకు స్మారక చిహ్నం నిర్మించింది. 1971లో ఆ ప్రాంత ప్రజలు ‘చౌరీ చౌరా షాహీద్‌ స్మారక సమితి’ అనే సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 1973లో చౌరీ చౌరా సరస్సు దగ్గర త్రిభుజాకార మినార్‌ నిర్మించారు. ప్రజలు స్వచ్ఛందంగా వేసుకున్న రూ.13,500 చందాలతో దీనిని నిర్మించారు. ఈ మినార్‌పై ఒక వ్యక్తి తన మెడకు ఉరితాడుతో వేలాడుతున్నట్లు చిత్రీకరించారు.


ఉరి తీయబడిన వారిని గౌరవించడానికి భారత ప్రభుత్వం షాహీద్‌ స్మారక్‌ను నిర్మించింది. ఈ స్మారకచిహ్నానికి సమీపంలో స్వాతంత్య్ర పోరాటం గురించి తెలిపే మ్యూజియం కూడా ఏర్పాటుచేశారు. అక్కడ చౌరీ చౌరా కేసులో ఉరి తీసిన వారి విగ్రహాలను కూడా నెలకొల్పారు. ఈ కేసులో ఉరితీయబడిన వారి గౌరవార్థం భారతీయ రైల్వే ఒక రైలుకు ‘చౌరీ చౌరా ఎక్స్‌ప్రెస్‌’గా నామకరణం చేసింది. ఈ రైలు గోరఖ్‌పూర్‌–కాన్పూర్‌ల మధ్య నడుస్తుంది.


ఈ ఏడాది ఫిబ్రవరి 4న చౌరీ చౌరా చారిత్రక ఘటనకు వందేళ్లు నిండుతాయి. గత ఫిబ్రవరి 4న చౌరీ చౌరా శతాబ్ది ఉత్సవాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఆ సందర్భంగా ఒక స్మారక తపాలాబిళ్లను కూడా విడుదల చేశారు.

డా. పి.సి. సాయిబాబు

Updated Date - 2022-02-04T06:13:12+05:30 IST