నూరేళ్ళ తిలక్‌ ఈనాటి మనం

ABN , First Publish Date - 2020-08-03T06:13:20+05:30 IST

వయస్సు సగం తీరకముందే అంతరించిన ప్రజాకవి నభస్సు సగం చేరకముందే అస్తమించిన ప్రజారవి అని శ్రీశ్రీగారు తిలక్‌ గారిని గురించి...

నూరేళ్ళ తిలక్‌ ఈనాటి మనం

తనది సామ్యవాదం కాదని తిలక్‌ చెప్పుకున్నా, తన సాహిత్యం నిండా సామ్యవాదులు చిత్రించిన దృశ్యాలనే, సన్నివేశాలనే, సందర్భాలనే చిత్రించారు. తిలక్‌ గారిని 21వ శతాబ్దం యువ రచయితలు, యువ విమర్శకులు అధ్యయం చేయాలి. ఇది వరకే చదివినవాళ్ళు మారిన ప్రపంచ సందర్భంలో కొత్తగా చదవాలి. వాదాలకు లొంగనంత మాత్రాన ఆయన దేనికీ చెందని రచయిత కాదు. 


‘‘దేవుడా! రక్షించు నా దేశాన్ని.../ లక్షలాది దేవుళ్ళ నుండి/ వారి పూజల నుండి/ వారి వారి ప్రతినిధుల నుండి’’ అని తిలక్‌ అయిదున్నర దశాబ్దాల క్రితం చేసిన ప్రార్థన అప్పటికన్నా ఇప్పటి మన సమాజానికి బాగా నప్పుతున్నది. ఈ కవితలో కవి పేర్కొన్న వారు ఇప్పుడు కుప్పలు తెప్పలుగా పెరిగిపోయి శాసించే దశకు చేరుకున్నారు. ఇది తిలక్‌ ముందు చూపు. ‘‘మాకు నటనలు వద్దు’’ అన్నాడు కవి. ఈ నటననే తర్వాత దిగంబర కవులు ఎండగట్టింది. ఇప్పుడు నటనే రాజ్యమేలుతున్నది. 


వయస్సు సగం తీరకముందే

అంతరించిన ప్రజాకవి

నభస్సు సగం చేరకముందే

అస్తమించిన ప్రజారవి

- అని శ్రీశ్రీగారు తిలక్‌ గారిని గురించి సరిగ్గానే అన్నారు. తిలక్‌గా ప్రసిద్ధులైన దేవరకొండ బాలగంగాధర తిలక్‌ బతికింది నలభై అయిదేళ్ళే (01.08.1921 - 02.09.1966). నడీడు కూడా తీరకుండా మరణించిన భారతీయ రచయితలలో తిలక్‌ ఒకరు. తిలక్‌ గారితో తెలుగు సమాజానికి చాలా అవసరం ఉండింది. అది తీరకుండానే అనారోగ్యం ఆయన్ని కబళించింది. ఎన్నేళ్ళు బతికామన్నది కాదు, బతికినన్నాళ్ళలో ఏమి చేశామన్నది ప్రధానం. తిలక్‌ గారు బతికిన నలబై అయిదేళ్ళలోనే ముప్ఫై ఆరేళ్ళ రచనా జీవితం గడిపారు (1932-66). ఆ రచనలలో చాలావరకు ఈ నాటికీ ప్రామాణికంగా ఉన్నాయి. ప్రాసంగికత కలిగి ఉన్నాయి. 


తొంభై తొమ్మిదేళ్ళ క్రితం 1921 ఆగష్టు ఒకటవ తేదీన ఒక సుసంపన్నమైన కుటుంబంలో, పశ్చిమ గోదావరి జిల్లా మందపాకవాసులు రామసోదెమ్మ, సత్యనారాయణ మూర్తి దంపతులకు రెండవ సంతానంగా పుట్టిన తిలక్‌ అప్పటి రచనా రంగంలో మాత్రం అద్వితీయు లలో ఒకడుగా నిలిచారు. స్వాతంత్ర్యో ద్యమకారుడైన సత్యనారాయణమూర్తి లోకమాన్య బాలగంగాధర తిలక్‌ మొదటి వర్ధంతినాడు పుట్టిన కుమా రునికి అభిమానంతో, గౌరవంతో ఆ పేరును పెట్టుకున్నారు. ఆత్రేయ, కుందుర్తి, అనిసెట్టి, ఆరుద్ర, గజ్జెల మల్లారెడ్డి, రా.రా., రెంటాల, మధునాపంతుల మొద లైన రచయితలంతా ఇరవయ్యవ శతాబ్దం ప్రారంభంలో ఒకరి మెడలు ఒకరు తొక్కు కుంటూ తెలుగు నేలను చీల్చుకుంటూ పుట్టుకొచ్చారు. ఈ తానులో పోగే తిలక్‌. ఆయన పుట్టి నేటికి తొంభై తొమ్మిదేళ్ళు ముగిసాయి. నూరో సంవత్సరం మొదలైంది. ఆయనను స్మరించుకుందాం. 


తిలక్‌గారు కవి, కథకుడు, నాటక రచయిత, విమర్శకుడు. నవలా రచన కూడా ప్రారంభిం చారు. పూర్తి కాలేదు. ఆధునిక సాహిత్య ప్రక్రియ లన్నిటినీ చేపట్టారు. కవిగా, కథకునిగా మంచి గుర్తింపు పొందారు. తన పదకొండవ ఏటనే 1932లో తిలక్‌గారు కథ రాశారనీ, అది ‘మాధురి’ అనే పత్రికలో అచ్చయిందనీ, కాని అది దొరకడం లేదనీ విమర్శకులు చెబుతున్నారు. చిన్న వయసు లోనే రచనలు మొదలుబెట్టిన తెలుగు రచయితలలో ఒకరుగా తిలక్‌ చేరారు. కవిగా ఆయన పద్యాలు, వచన కవితలు రాశారు. ‘ప్రభాతము-సంధ్య’ (1937), ‘అమృతం కురిసిన రాత్రి’ (1941-66 మధ్య రాసినవి), ‘గోరువంకలు’ (1942-66 మధ్య రాసినవి) ఆయన కావ్యాలు. తిలక్‌ రాసిన కథలు 1961లో రెండు సంపుటా లుగా వచ్చాయి. తర్వాత అన్నీ కలిసి ‘తిలక్‌ కథలు’ పేరుతో 1967లో వచ్చాయి. ‘ఇరుగు పొరుగు’ (1960), ‘సుచిత్ర ప్రణయం’ (1961), ‘సుప్తశిల’ (1967), ‘పొగ’ (1968) అనే నాటికలు, ‘భరతుడు’ అనే ఏకపాత్రాభి నయం, ‘సుశీలపెళ్ళి’ (1961), ‘సాలెగూడు’ (1980 ప్రచు రణ) అనే నాటకాలు రాశారు. వీటి రచనా కాలాలు, ప్రచురణ కాలాలు వేరు వేరు. కొన్ని వ్యాసాలూ ఉన్నాయి. ‘అమృతం కురిసిన రాత్రి’ అనే వచన కవిత్వ సంపుటికి 1969లో ఆం.ప్ర సాహిత్య అకాడమీ పురస్కారం, 1971లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చాయి. 


ఆమధ్య కొన్నాళ్ళు 1955-65 మధ్య తెలుగు సాహిత్య చరిత్రలో స్తబ్ధత కాలం అని అంటుండేవారు. దీని మీద సుదీర్ఘ చర్చలూ జరిగాయి. అయితే ఆ పదేళ్ళలో గొప్ప రచనలు చాలా వచ్చాయి. తిలక్‌ గారు రాసిన ముప్ఫై కథలలో పదహారు కథలు 1955-65 మధ్యనే వచ్చాయి. నాటకాలు దాదాపు అన్నీ ఆ కాలంలోనే వచ్చాయి. ‘అమృతం కురిసిన రాత్రి’లోని 93 కవితలలో యాభై కవితలకు పైగా ఆ పదేళ్ళలోనే వచ్చాయి. అయినా అది స్తబ్ధతా యుగం కావడం విచిత్రం. 


తిలక్‌ సహాయ నిరాకరణోద్యమ కాలంలో పుట్టారు. విప్లవోద్యమ తూర్పు పటం ఎగురుతున్న సమయంలో కన్ను మూశారు. భారత స్వాతంత్ర్యోద్యమం, తెలంగాణ రైతాంగ పోరాటం, చైనా విప్లవం, రెండవ ప్రపంచ యుద్ధం, ఆంధ్ర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల అవతరణ చూశారు. విద్యార్థి దశలో ఆయన వామపక్షవాదిగా ఉండేవారు. తర్వాత రాయిస్ట్‌ అయ్యారు. ఆ తర్వాత గాంధియన్‌ అయినట్లున్నారు.


తిలక్‌ తననుతాను ‘అనభూతివాది’గా ప్రకటించుకు న్నారు. ‘‘స్వాతంత్య్రంలో సామ్యవాదం పనికిరాదు’’ అన్నారు. ‘‘ఏదో ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉంటే కవికి లాభదా యకం కాదు. ఉత్తమ కవితా సృష్టికి సరిపడదు,’’ అన్నారు. ‘‘నా కవిత్వం కాదొక తత్వం/ మరికాదు మీరనే మన స్తత్వం/ కాదు ధనికవాదం, సామ్యవాదం/ కాదయ్యా అయోమయం, జరామయం’’ - అని 1941లో ‘నా కవిత్వం’ అనే కవితలో ప్రకటించుకున్నారు. ఈ అభిప్రాయాలన్నీ ఆయన కాలంలో ప్రధాన స్రవంతిగా ఉన్న అభ్యుదయ, మార్క్సీయ సాహిత్య ధోరణిని ప్రతిఘటించేవిగా కనిపిస్తాయి. ఆయన అభిప్రాయాలు ఆయన ఒక అనిబద్ధ రచయిత అనే అభిప్రాయం కలిగిస్తాయి. 


‘‘కాదేదీ స్థిరబిందువు’’ అని ప్రకృతిలో సమాజంలో మార్పును గుర్తించారు. మధ్యతరగతి జీవుల ఊగిసలాటను, క్రింది తరగతి జీవుల నిజాయితీని చిత్రించారు. పెట్టుబడి దారీ వ్యవస్థ దుర్మార్గాలను ఖండించారు. మానవత్వాన్ని ఆలింగనం చేసుకున్నారు. ప్రపంచ యుద్ధాన్ని చాలా కాలం వస్తువుగా చేసుకుని రచనలు చేశారు. ప్రపంచ శాంతిని కోరుకున్నారు. సమాజంలో కనిపించే వ్యథార్త జీవుల యథార్థ గాథలను సాహిత్యీకరించారు. చైనాతో మన దేశా నికి యుద్ధం వచ్చినప్పుడు చైనాను వ్యతిరేకించారు. తిలక్‌ సాహిత్యంలో అంతర్జాతీయ సమాజం కనిపిస్తుంది. జాతీయ దృష్టి ఉంది. ఏమైనా ఆయన కాల్పనిక లక్షణాలను వదులు కోకున్నా, ప్రజా వ్యతిరేక, తిరోగమనవాద రచయిత కాలేదు. సమకాలీన సామాజిక వాస్తవికత విమర్శనాత్మకంగా, కళాత్మకంగా ఆయన సాహిత్యంలో ప్రతిబింబిస్తుంది. అది ఈనాటికీ మనకు ఆదర్శం. 


‘‘తత్వాల పేర, విప్లవాల పేర/ ఒకరినొకరు చంపుకో లేము’’, ‘‘మరచిపోకు అసలువాణ్ణి/ నీ సోదరుడైన మానవుణ్ణి’’ -అన్నది తిలక్‌ ఆలోచనను ప్రతిబింబిస్తు న్నది. రాజకీయ పార్టీలకూ, పాలక వర్గానికీ రచయితలు లోబడి ఉండడం ఆయనకు నచ్చలేదు. ‘కవివాక్కు’ కవితలో ఈ విషయం ప్రకటించారు. మార్క్సిజం కన్నా ఆయనకు దేశీయమైన బౌద్ధం బాగా ఇష్టమై నట్లుంది: ‘‘పరదేశీ స్తుతిలో స్వకీయ సంస్కృతి విస్మరించకు/ ఇంకా కరిగి నీరైపోలేదు హిమాలయ శిఖరాలు/ ఇంకా మరచిపోలేదు తథాగతుని మహాత్ముని ప్రవచనాలు’’ అని ప్రకటించారు. 


తనది సామ్యవాదం కాదని తిలక్‌గారు చెప్పుకున్నా, తన సాహిత్యం నిండా సామ్య వాదులు చిత్రించిన దృశ్యాలనే, సన్నివేశా లనే, సందర్భాలనే చిత్రించారు. స్తబ్ధతా యుగంగా ప్రచారం జరిగిన 1955-65 మధ్య తిలక్‌ రాసిన ఆరు కవితలు చాలు వారిలోని అభ్యుదయ కవిని గుర్తించడా నికి. అవి ఆర్తగీతం (1956), ప్రార్థన (1963), నవత-కవిత (1964), తపాలా బంట్రోతు (1959), సిఐడి రిపోర్టు (1965), మన సంస్కృతి (1965).. ఇవి అప్పటికే కాదు, ఈనాటికి మన సమాజంతో, మన సాహిత్యంతో ప్రాసంగికత కలిగి ఉన్నాయి. ‘ఆర్తగీతం’లో కవి చూసిన దృశ్యాలు ‘కవితా! ఓ కవితా!’లో శ్రీశ్రీగారికి కనిపించిన దృశ్యాలను తలపిస్తాయి: ‘‘నా దేశాన్ని గురించి పాడలేను.../ ఒక్క నిరుపేద వున్నంత వరకు/ ఒక్క మలినాశ్రుబిందువొలకినంతవరకు/ ఒక్క ప్రేగు ఆకలి కనలి నంతవరకు’’ అని 65 ఏళ్ళ క్రితం అన్నారు తిలక్‌. దేశం వెలిగిపోతోంది, అంతా బావుంది, స్వర్ణ భారత్‌, స్వచ్ఛ భారత్‌ వంటి ఆకర్షణీయమైన స్వీయ ముద్రలనడుమ కరోనా కాలంలో లాక్‌డౌన్‌ సడలింపు నేపథ్యంలో ఆరు వారాలు పనిలేక తిండి దొరక్క, నగరాల నుండి స్వస్థలా లకు రోడ్లమీదికి వచ్చి కాలి నడకన బయలుదేరిన 15కోట్ల మంది వలస కూలీలను చూస్తే తిలక్‌ నిరసనకు మనకు ఉన్న సంబంధం అర్థమౌతుంది. ‘‘ఏ వెలుగులకీ ప్రస్థానం’’ అని శ్రీశ్రీ ప్రశ్నించినట్లు ‘‘ఈ ఆర్తి ఏ సౌధాంతరాలకు పయనింపగలదు’’ అని తిలక్‌ ప్రశ్నించారు. 


‘‘దేవుడా! రక్షించు నా దేశాన్ని.../ లక్షలాది దేవుళ్ళ నుండి/ వారి పూజల నుండి/ వారి వారి ప్రతినిధుల నుండి’’ అని తిలక్‌ అయిదున్నర దశాబ్దాల క్రితం చేసిన ప్రార్థన అప్పటి కన్నా ఇప్పటి మన సమాజానికి బాగా నప్పుతున్నది. ఈ కవితలో కవి పేర్కొన్నవారు ఇప్పుడు కుప్పలు తెప్పలుగా పెరిగిపోయి శాసించే దశకు చేరుకున్నారు. ఇది తిలక్‌ ముందు చూపు. ‘‘మాకు నటనలు వద్దు’’ అన్నాడు కవి. ఈ నటననే తర్వాత దిగంబర కవులు ఎండగట్టింది. ఇప్పుడు నటనే రాజ్యమేలుతున్నది. గిరీశాలు ఇప్పుడు ఎందెందు వెదకి చూచిన అందందే కనిపిస్తున్నారు. ‘‘బ్రతుకు పొడుగునా స్వతంత్రం’’ కావాలని కోరుకున్నారు తిలక్‌ గారు. ఈ మాట ఇప్పటికీ అవసరమే. 


‘‘మనగలిగినదీ/ కాలానికి నిలబడగలిగినదీ/ వద్దన్నా పోదు.../ మనుశిక్షాస్మృతికి/ గౌరవం లేదని వీరికి లోపల దిగులు.../ అయిదు ఖండాల మానవ సంస్కృతి/ అఖండ వసుధైక రూపాన్ని ధరిస్తోందనీ/ గ్రహించలేరు పాపం వీరు’’- ఈ మాటలు గత కొంత కాలంగా మన సమాజంలో నెలకొన్న పిడివాద పరిస్థితులను ప్రతిబింబిస్తున్నాయి. ‘‘గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్‌’’ అని నమ్మే వాళ్ళకు, ‘‘మంచి గతమున కొంచెమేనోయ్‌’’ అని నమ్మే వాళ్ళు శత్రువులుగా కనిపిస్తున్నారు. అణచివేయవలసిన వాళ్ళుగా కనిపిస్తున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా నివారించడానికి భౌతిక దూరం పాటించమని తెలిసిన వాళ్ళు సూచిస్తే, ఇదే అదను అనుకొని ‘చూశారా! మా పూర్వీకులు చెప్పిందే ఇప్పుడు ప్రపంచానికి ఆదర్శమైంది’ అంటూ గతకాలపు దుర్మార్గాన్ని పద్యాలుగా రాసి రాగాలు తీసినవాళ్ళని మనం ఇటీవల చూశాం. కవిగా తిలక్‌గారు ఇలాంటివాళ్ళ కన్నా ఎంత ముందున్నారో కదా! వీళ్ళ నుంచే దేశాన్ని రక్షించమని ఆయన ప్రార్థించింది. ‘‘కవి ప్రవక్తా కాలం కన్నా ముందుంటారు’’ అని గురజాడ అన్నది మనం గుర్తు చేసుకోవాలి. 


తిలక్‌గారు మధ్యతరగతి రచయితగా పేరొందారు. క్రింది తరగతివాళ్ళను గురించి కూడా ఆయన రాశారు. అయినా ఆయన సాహిత్యంలో ‘మధ్యతరగతి మందహాసం’ వాస్తవిక రూపంతో ప్రతిబింబిస్తుంది. ఆయన కథలలో ఇది బాగా కనిపిస్తుంది. సీతాపతి కథ, ఆశాకిరణం, నల్లజర్ల రోడ్డు, సుందరీ సుబ్బారావు వంటివన్నీ మధ్యతరగతి కథలే. ‘సముద్రపు అంచులు’, ‘ఊరిచివరి ఇల్లు’ వంటి కథలు క్రింది తరగతి జీవిత ప్రతిఫలనాలు. 


తిలక్‌గారిని 21వ శతాబ్దం యువ రచయితలు, యువ విమర్శకులు అధ్యయం చేయాలి. ఇదివరకే చదివినవాళ్ళు మారిన ప్రపంచ సందర్భంలో కొత్తగా చదవాలి. వాదాలకు లొంగనంతమాత్రాన ఆయన దేనికీ చెందని రచయిత కాదు. 

‘‘మతం నల్ల మందు

గతం ముదిమికి విందు’’ (‘న్యూసిలబస్‌’ 1962)

రాచపాళెం చంద్రశేఖరరెడ్డి

(ఆగస్టు 1తో తిలక్‌ శతజయంతి సంవత్సరం ప్రారంభం)


Updated Date - 2020-08-03T06:13:20+05:30 IST