పెళ్లి సందడి

ABN , First Publish Date - 2021-12-09T04:50:30+05:30 IST

మార్గశిర మాసం వేళ.. పెళ్లి సందడి మొదలైంది. నేటి నుంచి ఈ నెల 13వరకు పెళ్లి బాజా మోగనుంది. కరోనా వ్యాప్తి కారణంగా రెండేళ్ల నుంచి చాలామంది పెళ్లిళ్లు వాయిదా వేసుకుంటూ వచ్చారు. కానీ, వైరస్‌ వ్యాప్తి పూర్తిస్థాయిలో తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించకపోవడంతో ఈ ఏడాది శ్రావణమాసం, మార్గశిర మాసంలో పెళ్లిళ్లకు చాలామంది ముహూర్తాలు ఖరారు చేశారు.

పెళ్లి సందడి

- ఐదు రోజుల్లో వందలాది ముహూర్తాలు

- పొంచి ఉన్న కొవిడ్‌ మూడో దశ ముప్పు

- జాగ్రత్తలు పాటించాలని అధికారుల హెచ్చరికలు

(టెక్కలి)

మార్గశిర మాసం వేళ.. పెళ్లి సందడి మొదలైంది. నేటి నుంచి ఈ నెల 13వరకు పెళ్లి బాజా మోగనుంది. కరోనా వ్యాప్తి కారణంగా రెండేళ్ల నుంచి చాలామంది పెళ్లిళ్లు వాయిదా వేసుకుంటూ వచ్చారు. కానీ, వైరస్‌ వ్యాప్తి పూర్తిస్థాయిలో తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించకపోవడంతో ఈ ఏడాది  శ్రావణమాసంలో పెళ్లిళ్లకు చాలామంది ముహూర్తాలు ఖరారు చేశారు. ఈ క్రమంలో ఆగస్టు నెలలో అధిక సంఖ్యలో వివాహాలు అయ్యాయి. తర్వాత పెద్దగా ముహూర్తాలు లేవు. మరోవైపు ఈ నెల 14న నెలగంటు. చాలామంది హిందువులు నెలగంటు పెట్టిన తర్వాత వివాహాలు చేసేందుకు ఇష్టపడరు.  నెలగంటు తర్వాత ఫిబ్రవరి 2 వరకు పెళ్లి ముహూర్తాల కోసం ఆగాల్సిందే. ఈ నేపథ్యంలో మార్గశిర మాసంలోనే పెళ్లిళ్లు చేసేందుకు చాలామంది ఆసక్తి చూపారు. ఈ క్రమంలో గురువారం నుంచి ఐదు రోజులపాటు జిల్లాలో వందలాది పెళ్లిళ్లు జరగనున్నాయి. జిల్లాలో సుమారు 500 కల్యాణ మండపాలు ఉన్నాయి. వీటితో పాటు ఆడిటోరియాలు, సంఘ భవనాలు, ప్లాజాల్లో పెళ్లిళ్లు చేసేందుకు నిర్వాహకులు సన్నద్ధమయ్యారు. అకాల వర్షాల నేపథ్యంలో కల్యాణమండపాల్లో పెళ్లిళ్లు నిర్వహించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కాగా, మూడో దశ కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో కొవిడ్‌ నిబంధనలు పాటించాలని అధికారులు పదే పదే ఆదేశిస్తున్నారు. వివాహ కార్యక్రమానికి వరుడు, వధువు తరఫున పరిమిత సంఖ్యలో బంధువులను ఆహ్వానించాలని చెబుతున్నారు. మాస్క్‌లు ధరించాలని, భౌతికదూరం పాటించాలని, శానిటైజర్‌ వినియోగించాలని సూచిస్తున్నారు. పెళ్లిళ్ల హడావుడిలో కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే.. మూడోదశ వైరస్‌ వ్యాప్తి ముప్పు తప్పదని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు.


 మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ 

- సీమెన్‌ ఇంట వాయిదా పడిన వివాహం                                                           

సంతబొమ్మాళి, డిసెంబరు 8: సంతబొమ్మాళి మండలంలోని ఓ తీరప్రాంత గ్రామంలో బుధవారం మరో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దక్షిణాఫ్రికా నుంచి తీర గ్రామానికి వచ్చిన ఓ సీమెన్‌కు మంగళవారం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఆయనతో సన్నిహితంగా ఉన్నవారికి వైద్యసిబ్బంది కరోనా పరీక్షలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం 24 మందికి కరోనా పరీక్షలు చేయగా, సీమెన్‌ బంధువుల్లో మరో ఇద్దరికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. సీమెన్‌ కుమార్తెకు గురువారం వివాహం జరగాల్సి ఉంది. కానీ, సీమెన్‌తో పాటు కుటుంబ సభ్యుల్లో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో వివాహాన్ని వాయిదా వేశారు. గ్రామంలో బుధవారం మరో 68 మందికి కరోనా పరీక్షలు చేయగా.. నేడు రిపోర్టులు రానున్నాయి. సర్పంచ్‌ కె.లక్ష్మీజగన్నాయకులు ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు చేపడుతున్నారు. క్వారంటైన్‌ జోన్‌ ఏర్పాటు చేశారు. 

Updated Date - 2021-12-09T04:50:30+05:30 IST