వందశాతం వ్యాక్సినేషన్‌ త్వరగా పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2021-10-27T04:59:21+05:30 IST

ప్రపంచంలోని అనేక దేశాల్లో కరోనా కేసులు, మరణాల రేటు పెరుగుతున్న దృష్ట్యా తెలంగాణలో సాధ్యమైనంత త్వరగా వందశాతం కరోనా వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే్‌షకుమార్‌ అధికారులను ఆదేశించారు.

వందశాతం వ్యాక్సినేషన్‌ త్వరగా పూర్తి చేయాలి
వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి, అధికారులు

వీడియో కాన్ఫరెన్స్‌లో సూచించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ 

ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తాం : కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి


సిద్దిపేట టౌన్‌, అక్టోబరు 26 : ప్రపంచంలోని అనేక దేశాల్లో కరోనా కేసులు, మరణాల రేటు పెరుగుతున్న దృష్ట్యా తెలంగాణలో సాధ్యమైనంత త్వరగా వందశాతం కరోనా వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే్‌షకుమార్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి టీకా పంపిణీపై ఆయన హైదరాబాద్‌ నుంచి జిల్లా కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలోని ఐడీవోసీలో కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి, జిల్లా అధికారులు ఈసమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమే్‌షకుమార్‌ మాట్లాడుతూ చైనా, నెదర్లాండ్‌, బ్రెజిల్‌ వంటి దేశాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తోందని, కేసులు, మరణాలు పెరుగుతున్నాయని తెలియజేశారు. అలాంటి పరిస్థితి తెలంగాణలో ఉత్పన్నం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామాల్లో అంగన్‌వాడీ కార్యకర్తలు, వీఆర్వోలు, రేషన్‌ డీలర్లు, ఆశ, పంచాయతీ సెక్రటరీలతో కూడిన గ్రామస్థాయి బృందాలు వాక్సినేషన్‌ డ్రైవ్‌ చేపట్టాలని ఆదేశించారు. రెండు డోసులు వేసుకుంటేనే ప్రతిరక్షకాలు పూర్తిస్థాయిలో ఉత్పత్తి అవుతున్నాయని అధ్యయనాలు చెబుతున్న దృష్ట్యా రెండో డోసు విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దన్నారు. గ్రామ, మండల ప్రత్యేక అధికారులు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, డీపీవోలు గ్రామాల్లో పర్యటిస్తూ వాక్సినేషన్‌ వేగంగా జరిగేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో వ్యాక్సినేషన్‌ తాజా ప్రగతిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే్‌షకుమార్‌కు వివరించారు. జిల్లాలో మున్సిపాలిటీలతో సహా అన్ని మండలాల్లో జనవరి 1వ తేదీ నుంచి నేటి వరకు 18 సంవత్సరాలు నిండిన వ్యక్తులు 7,11,893 మంది ఉండగా 5,55,785 మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయిందని వివరించారు. ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించిన వందశాతం పూర్తిచేస్తామని తెలియజేశారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌, ట్రైనీ కలెక్టర్‌ ప్రపుల్‌ దేశాయ్‌, జిల్లా రెవెన్యూ అధికారి చెన్నయ్య, డీఎంఅండ్‌హెచ్‌వో డా.మనోహర్‌, జడ్పీ సీఈవో రమేష్‌, డీఆర్‌డీవో గోపాల్‌రావు అధికారులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-27T04:59:21+05:30 IST