తిమింగలం నోట్లో 40 సెకన్లు.. ఆ తర్వాత!

ABN , First Publish Date - 2021-06-13T00:07:46+05:30 IST

పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి బయటపడ్డ వారిని చావు నోట్లో తల పెట్టి బయటపడ్డారని అంటుంటారు. తాజాగా అమెరికాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. మరణానికి అతి దగ్గరగా వెళ్లి ఓ అమెరికన్ తృటిలో త

తిమింగలం నోట్లో 40 సెకన్లు.. ఆ తర్వాత!

ఇంటర్నెట్ డెస్క్: పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి బయటపడ్డ వారిని చావు నోట్లో తల పెట్టి బయటపడ్డారని అంటుంటారు. తాజాగా అమెరికాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. మరణానికి అతి దగ్గరగా వెళ్లి ఓ అమెరికన్ తృటిలో తప్పించుకున్నాడు. సముద్ర జంతువులలో పెద్దదైన హంప్ బ్యాక్ తిమింగలం బారినపడ్డ ఇతను.. దాదాపు 40 సెకన్లపాటు దానినోట్లోనే ఉండిపోయాడు. అయితే భూమి మీద నూకలు బాకీ ఉండటంతో అతను అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. అసలేం జరిగిందంటే..


అమెరికాకు చెందిన మైకేల్ ప్యాకార్డ్ అనే 56ఏళ్ల వ్యక్తి సముద్రంలోకి దూకి.. రొయ్యల వంటి జీవులను వేటాడుతూ జీవనం సాగిస్తుంటాడు.  మైకేల్ ఎప్పటిలాగే వేట కోసం.. మసాచుసెట్స్‌లోని కేప్ కాడ్ ప్రాంతానికి వెళ్లి సముద్రంలోకి దూకాడు. ఈ క్రమంలోనే మైకేల్.. హంప్ బ్యాక్ తిమింగలం నోట్లో చిక్కుకున్నాడు. దీంతో తాను ఇక ప్రాణాలతో బతికి బయటపడనని మైకేల్ భావించాడు. బతుకుపై ఆశలు వదిలేసుకుని ఏకంగా 30 నుంచి 40 సెకెండ్లపాటు తిమింగలం నోట్లోనే బిక్కుబిక్కుమని గడిపాడు. అయితే ఆ తిమింగలం.. నోట్లో చిక్కిన మైకేల్‌ను మింగేయకుండా బయటకు ఉమ్మేసింది. దీంతో మైకేల్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ విషయాన్ని స్వయంగా ఫేస్‌బుక్ ద్వారా మైకేలే వెల్లడించాడు. 



‘అందరికీ హాయ్, ఈ రోజు నాకు జరిగిన ప్రమాదం గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను డైవింగ్ చేసినప్పుడు హంప్‌బ్యాక్ తిమింగలం నన్ను తినడానికి ప్రయత్నించింది. దీంతో 30 నుంచి 40 సెకన్లపాటు నేను తిమింగలం నోట్లోనే చిక్కుకున్నాను. అప్పుడు నాకు చావు తప్పడని నేను ఫిక్స్ అయిపోయాను. అయితే తిమింగలం నీటి ఉపరితలం పైకి లేచి నన్ను ఉమ్మివేసింది. దీంతో ప్రాణాలతో బయటపడ్డాను. అయితే చాలా గాయాలయ్యాయి. ప్రొవిన్స్‌టౌన్ రెస్యూ స్క్వాడ్ నాకు సహాయం చేసింది. వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’ అని మైకేల్ పేర్కొన్నారు. అంతేకాకుండా తాను ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు.. 12, 15ఏళ్ల వయసున్న తన కొడుకుల గురించే ఆలోచించినట్టు మైకేల్ చెప్పాడు. 


Updated Date - 2021-06-13T00:07:46+05:30 IST