పెద్ద మనసు మీది... రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌పై ప్రధాని ప్రశంసలు!

ABN , First Publish Date - 2020-09-22T16:30:16+05:30 IST

సస్పెన్షన్‌కి గురైన ఎంపీలకు టీ తీసుకెళ్లిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు...

పెద్ద మనసు మీది... రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌పై ప్రధాని ప్రశంసలు!

న్యూఢిల్లీ: సస్పెన్షన్‌కి గురైన ఎంపీలకు టీ తీసుకెళ్లిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. భగవంతుడు ఆయనకు వినయమైన స్వభావం, పెద్ద మనసు ఇచ్చాడంటూ కొనియాడారు. రాజ్యసభలో ఓటింగ్ లేకుండా వివాదాస్పద వ్యవసాయ బిల్లులను ఆమోదించడాన్ని నిరసిస్తూ పార్లమెంటులో ఎనిమిది మంది బహిష్కృత ఎంపీలు చేపట్టిన ధర్నా రెండో రోజుకు చేరుకుంది. సోమవారం రాత్రంతా పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్దే గడిపిన ఎంపీలకు ఇవాళ ఉదయం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ టీ, స్నాక్స్ తీసుకెళ్లారు. దీనిపై ప్రధాని ట్విటర్లో స్పందిస్తూ.... ‘‘కొద్ది రోజుల క్రితం తనపై దాడి చేసి, అవమానించడమే కాకుండా ధర్నాకి కూర్చున్న వారి కోసం స్వయంగా టీ తీసుకెళ్లి ఇవ్వడం హరివంశ్ వినయం, పెద్దమనసుకు నిదర్శనం. ఇది ఆయన గొప్పతనాన్ని చాటిచెబుతోంది. హరివంశ్‌కు అభినందనలు చెబుతున్న భారత ప్రజలతో నేనూ ఏకీభవిస్తున్నాను...’’ అని పేర్కొన్నారు.


ఎన్నో శతాబ్దాలుగా గొప్ప ప్రాంతమైన బీహార్ మనకు ఎన్నో ప్రజాస్వామ్య విలువలను బోధిస్తున్నదని ఆయన అన్నారు. ‘‘అద్భుతమైన సంస్కృతీ, సంప్రదాయాల నుంచి వచ్చిన బీహార్ ఎంపీ, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ఇవాళ కనబర్చిన స్ఫూర్తి, హుందాతనం... ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరికీ గర్వకారణం..’’ అని ప్రధాని పేర్కొన్నారు.



Updated Date - 2020-09-22T16:30:16+05:30 IST