పతనం దిశగా మానవాళి

ABN , First Publish Date - 2021-07-28T08:19:40+05:30 IST

జీవన నాణ్యత పడిపోతుంది! ఆహారోత్పత్తి, పారిశ్రామిక ఉత్పత్తి పతనమైపోతాయి. క్రమంగా మానవ జనాభా తగ్గిపోతుంటుంది.

పతనం దిశగా మానవాళి

  • 2040 నాటికి మానవ సమాజ పతనం!
  • 1972లోనే ఎంఐటీ పరిశోధకుల హెచ్చరిక
  • నిజమవుతోందని తాజా అధ్యయనంలో వెల్లడి


వాషింగ్టన్‌, జూలై 27: జీవన నాణ్యత పడిపోతుంది! ఆహారోత్పత్తి, పారిశ్రామిక ఉత్పత్తి పతనమైపోతాయి. క్రమంగా మానవ జనాభా తగ్గిపోతుంటుంది... మస్సాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పరిశోధకులు మానవాళి భవిష్యత్తు గురించి 1972లో వేసిన అంచనా ఇది. కేవలం ఆర్థిక వృద్ధిపైనే దృష్టి సారించి పర్యావరణ, సామాజిక మార్పులను పట్టించుకోకుండా ముందుకు సాగితే 21వ శతాబ్దంలో మానవ సమాజం పతనమైపోతుందని వారు హెచ్చరించారు. ‘లిమిట్స్‌ టు గ్రోత్‌’ పేరుతో వారు రాసిన పుస్తకం అప్పట్లో బెస్ట్‌ సెల్లర్‌గా కూడా నిలిచింది. ‘ఆ.. ఇదంతా మరీ అతిశయోక్తి’ అని చాలా మంది కొట్టిపారేశారు కూడా. కానీ.. వారి అంచనాలను ప్రస్తుత పరిస్థితులతో పోలిస్తే అవి నిజమయ్యే దిశగా పరిణామాలు సంభవిస్తున్నాయని ప్రముఖ వృత్తి సేవల సంస్థ కేపీఎంజీ ఇంటర్నేషనల్‌కు చెందిన గయా హెర్రింగ్టన్‌ అనే పరిశోధకురాలు అభిప్రాయపడ్డారు. మానవుల తీరు ఇలాగే కొనసాగితే దశాబ్దకాలంలో ఆర్థికాభివృద్ధి.. 2040 నాటికి మానవ సమాజం.. పూర్తిగా పతనమైపోతాయని హెచ్చరించారు. 


ఎంఐటీ పరిశోధకులు 1972లో ఈ అధ్యయనం చేసినప్పుడు ప్రపంచ జనాభా, జనన, మరణాల రేటు, పారిశ్రామికోత్పత్తి, ఆహార ఉత్పత్తి, వైద్య, విద్యా సేవలు, పునరుత్పాదక ఇంధనాల వినియోగం, కాలుష్యం వంటివాటి ఆధారంగా 1900వ సంవత్సరం నుంచి 2060 దాకా మానవ సమాజ వికాసం గురించి అంచనా వేశారు. ఇందుకోసం ‘వరల్డ్‌ 1’ అనే కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌ను వినియోగించారు. ఆ ప్రోగ్రామ్‌ను రాసింది ఎంఐటీకి చెందిన జెర్రీ ఫాస్టర్‌. 1900 నుంచి జనాభా ఎలా పెరుగుతూ వచ్చింది.. జీవన నాణ్యత 1900 నుంచి 1940 దాకా ఎలా పెరిగిందీ, అక్కడి నుంచి పెరుగుదల వేగం తగ్గి 2020కి పతాకస్థాయికి చేరి ఆ తర్వాత ఎలా పతనమయ్యేది ఆ ప్రోగ్రామ్‌ ద్వారా గ్రాఫ్‌ల రూపంలో చూపారాయన. 1972 తర్వాత జీవన నాణ్యత ఎలా పడిపోబోయేది కూడా ఆ ప్రోగ్రామ్‌ సరిగ్గానే ఊహించగలిగింది. 2020ని మానవ నాగరికతకు శిఖరస్థాయిగా ఆ ప్రోగ్రామ్‌ ఊహించింది. ‘‘2020 నాటికి ప్రపంచం పరిస్థితి విషమంగా మారుతుంది. దాన్ని నివారించడానికి ఏమీ చేయకపోతే జీవననాణ్యత సున్నాకు పడిపోతుంది’’ అని 1973లో ఫాస్టర్‌ హెచ్చరించారు. 


‘‘కాలుష్యం మనుషుల ప్రాణాలు తీయడం మొదలుపెట్టే స్థాయికి చేరుకుంటుంది. దానివల్ల జనాభా తగ్గిపోవడం మొదలై.. 2040-2050 నాటికి ప్రపంచ జనాభా 1900 కన్నా తక్కువకు పడిపోతుంది. నాగరిక జీవనం మనుగడ కోల్పోతుంది.’’ అని ఆయన 1973లో హెచ్చరించారు. అప్పట్లో ఫాస్టర్‌ బృందం ఈ అంచనాలకు వినియోగించిన నమూనానే హెర్రింగ్టన్‌ కూడా వాడారు. అయితే వరల్డ్‌1 ప్రోగ్రామ్‌కు బదులు.. దాని మూడో తరం వెర్షన్‌ ‘వరల్డ్‌ 3’ ప్రోగ్రామ్‌ను వినియోగించారు. అప్పట్లో వారు ప్రధానంగా తీసుకున్న జనాభా, జనన, మరణాల రేటు వంటి అంశాలకు అదనంగా ఎకలాజికల్‌ ఫుట్‌ప్రింట్‌ (అంటే మనిషి పర్యావరణాన్ని ఎంత విచ్చలవిడిగా వాడేశాడు) అనే అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు. మానవుల తీరులో ఎలాంటి మార్పులూ లేకుండా ఇదే రీతిలో కొనసాగితే పదేళ్లలోనే ఆర్థికాభివృద్ధి మందగించిపోతుందని.. 2040 నాటికి మానవ సమాజం పూర్తిగా పతనమయ్యే ముప్పు పొంచి ఉందని గయా హెర్రింగ్టన్‌ హెచ్చరించారు. అయితే.. సాంకేతికంగా మరింత పురోగతి సాధించి, ప్రజాసేవలపై మరింత ఎక్కువ పెట్టబడి పెట్టగలిగితే మాత్రం ఈ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ అధ్యయన ఫలితం యేల్‌ జర్నల్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ ఎకాలజీలో ప్రచురితమైంది.

Updated Date - 2021-07-28T08:19:40+05:30 IST