మానవత్వంతో చికిత్స అందించాలి

ABN , First Publish Date - 2022-09-28T06:06:34+05:30 IST

ప్రజలు చెల్లించే పన్నుల నుంచి జీతం తీసుకుంటున్నందున మానవత్వంతో రోగులకు చికిత్సలు అందించాలని వైద్యాధికారులను, సిబ్బందిని కలెక్టర్‌ కె.విజయకృష్ణన్‌ ఆదేశించారు.

మానవత్వంతో చికిత్స అందించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టక్‌ కె.విజయకృష్ణన్‌

ప్రభుత్వాస్పత్రులపై నమ్మకం కల్పించాలి

వైద్యాధికారులకు కలెక్టర్‌ కె.విజయకృష్ణన్‌ ఆదేశం 

బాపట్ల, సెప్టెంబరు 27: ప్రజలు చెల్లించే పన్నుల నుంచి జీతం తీసుకుంటున్నందున మానవత్వంతో రోగులకు చికిత్సలు అందించాలని వైద్యాధికారులను, సిబ్బందిని కలెక్టర్‌ కె.విజయకృష్ణన్‌ ఆదేశించారు. వైద్యాధికారులు, మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులతో మంగళవారం కలెక్టరేట్‌లోని స్పందన హాలులో జరిగిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. గర్భిణులను అక్కాచెల్లెళ్లుగా భావించి మెరుగైన వైద్యంతో సుఖవంతంగా కాన్పులు జరిగేలా చూడాలన్నారు. వైద్యాధికారులు ఆశించిన స్థాయిలో పనిచేయకపోవటం వల్లే మాతృ, శిశు మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు. వైద్యులపై నమ్మకం లేకపోవటంతోనే దగ్గర్లోని పీహెచ్‌సీలకు కాకుండా దూరంగా ఉండే  ప్రైవేట్‌ ఆస్పత్రులను గర్భిణులు ఆశ్రయిస్తుండటం సిగ్గు చేటుగా భావించాలన్నారు. ప్రతి గర్భిణీ ఇంటికి వైద్యసేవలు అందాలని కలెక్టర్‌ ఆదేశించారు. వైద్యశాలలపై ప్రజలకు నమ్మకం కల్పించాలన్నారు. జె.పంగులూరు మండలంలో 261 మంది గర్భిణీలు ఉంటే ప్రభుత్వ వైద్యశాలలో ఒక్క కాన్పు కూడా జరగకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. అమర్తలూరు, సంతరావూరు, యద్దనపూడి పీహెచ్‌సీలో నివేదికలు సక్రమంగా లేవన్నారు. క్షేత్రస్థాయిలో సమీక్షలు, నివేదికలు లేకుండా సమావేశానికి ఎలా హాజరవుతారని ప్రశ్నించారు. గైర్హజరైన వేటపాలెం వైద్యాధికారికి షోకాజ్‌ నోటీసు జారీ చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ టి.వెంకటేశ్వర్లు, ఐసీడీఎస్‌ పీడీ బి.శైలజ, డీసీహెచ్‌ఎస్‌ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-28T06:06:34+05:30 IST