Hyderabad లో ఉద్యోగాల పేరిట వల.. ఆగని మానవ అక్రమ రవాణా..

ABN , First Publish Date - 2021-11-27T15:02:14+05:30 IST

చాపకింద నీరులా మానవ అక్రమ రవాణా రోజురోజుకూ పెరిగిపోతోంది...

Hyderabad లో ఉద్యోగాల పేరిట వల.. ఆగని మానవ అక్రమ రవాణా..

  • ఊబిలోకి దింపుతున్న కొందరు
  • ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు 
  • ఏడాదిలో 223 మందిని 
  • కాపాడిన రాచకొండ పోలీసులు 
  • సైబరాబాద్‌లో ప్రత్యేక ఏహెచ్‌టీయూ బృందం

హైదరాబాద్‌ సిటీ : నగరంలో చాపకింద నీరులా మానవ అక్రమ రవాణా రోజురోజుకూ పెరిగిపోతోంది. కొంతమంది నగరాన్ని అడ్డాగా చేసుకుని ఉద్యోగాల పేరుతో మహిళలు, యువతులతోపాటు బాలికలనూ తీసుకొచ్చి బలవంతంగా పడువువృత్తిలో దింపుతున్నారు. రోజుకో చోట వ్యభిచార ముఠా పట్టుపడుతుండటమే ఇందుకు నిదర్శనం. స్పాలు, మసాజ్‌ సెంటర్లు, అపార్ట్‌మెంట్లు ఇలా ఎక్కడ పడితే అక్కడ దందా జోరుగా సాగుతోంది. ఇలాంటి చోట దాడులు చేస్తున్న పోలీసులకు పట్టుబడుతున్న మహిళలు, యువతుల్లో ఎక్కువగా ఇతర రాష్ట్రాల వారే ఉంటున్నారు. ఇందులో చాలా మంది ఉద్యోగం, ఉపాధి పేరిట మోసపోయి.. ఈ రొచ్చులోకి దిగుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడి కావడం గమనార్హం. మరో పక్క పోలీసులు ఎప్పటికప్పుడు ముఠాల ఆటకట్టిస్తున్నా.. ఈ దందాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. 


చదువు చెప్పిస్తామని..

మహిళలను అక్రమ రవాణా చేసి అనైతిక కార్యకలాపాలు కొనసాగిస్తున్న కేటుగాళ్లు.. మరో వైపు ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, జార్ఖండ్‌, రాజస్థాన్‌, పశ్చిమబెంగాల్‌, మహారాష్ట్ర, ఒడిషా, కర్ణాటక, చత్తీ్‌సగఢ్‌, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లోని వెనుకబడిన ప్రాంతాల నుంచి చిన్నారులను అక్రమ రవాణా చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఉచితంగా చదువు చెప్పిస్తామని, చదువుతో పాటు.. చిన్న చిన్న ఉద్యోగాల్లో చేర్చి జీతాలు చెల్లిస్తామని నమ్మించి నగరానికి తరలిస్తున్నారు. అక్కడ తల్లిదండ్రులకు నయానో భయానో చెల్లించి తీసుకొస్తున్నారు. 


ఆ తర్వాత వారిని ఇటుక బట్టీలు, గాజుల కొట్టాల్లో, కంపెనీలు, కార్ఖానాల్లో బాలకార్మికులుగా పనిలో చేర్పిస్తున్నారు. కొంతమంది కేటుగాళ్లు ఎలాంటి దయా దాక్షిణ్యాలు లేకుండా యాచకులుగా మార్చి అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారు. వారిచేత రోజుకు 12-17 గంటలు పనిచేయిస్తూ చిన్నారుల జీవితాలను నాశనం చేస్తున్నారు. ఇలాంటి ముఠాలపై కన్నెర్ర చేసిన రాచకొండ సీపీ ఇప్పటి వరకు వందల కేసులను నమోదు చేసి నేరస్థులను కటకటాల్లోకి నెట్టారు. సుమారు వందమందికి పైగా నేరస్థులపై పీడీయాక్ట్‌ నమోదు చేశారు. చిన్నారులను రక్షించేందుకు ఏటా జనవరిలో ఆపరేషన్‌ స్మైల్‌, జూలైలో ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. బాలకార్మికులుగా మగ్గిపోతున్న చిన్నారులను రక్షిస్తున్నారు. 


ఇళ్ల మధ్యలోనే...

సైబరాబాద్‌లో కమిషనరేట్‌ పరిధి రంగంలోకి దిగిన ప్రత్యేక యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్‌ సిబ్బంది 14 ప్రాంతాలలో అనైతిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించి, వాటిని సీజ్‌ చేశారు. వాటిలో 9 వాణిజ్య ప్రాంతాలు కాగా.. 5 నివాస గృహాలు ఉన్నాయి. ఈ దందాపై ప్రత్యేక దృష్టి సారించిన సీపీ ఉమెన్‌ చైల్డ్‌ సేఫ్టీ వింగ్‌, ఏహెచ్‌టీయూ విభాగంతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనైతిక దందాపై అనుమానాలుంటే డయల్‌-100కు గానీ, కమిషనరేట్‌ వాట్సాప్‌ నంబర్‌ 9490617444లో సమాచారం ఇవ్వాలని సూచించారు.   


రాచకొండలో 179 మందికి బేడీలు

మానవ అక్రమ రవాణాపై రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ మొదటి నుంచీ ఉక్కుపాదం మోపుతున్నారు. 2016 ఇప్పటి వరకు మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న సుమారు 750 మందిని కటకటాల్లోకి నెట్టారు. నిందితుల్లో 350 మంది వరకు మహిళలే ఉండటం గమనార్హం. మొత్తం 400 కేసులు నమోదు చేసిన పోలీసులు సుమారు 800 మందిని రక్షించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 223 మందిని రక్షించి, 179 మందిని కటకటాల్లోకి నెట్టారు.


దేశ విదేశాల నుంచి.. 

సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో దేశ, విదేశాల నుంచి అమ్మాయిలను రప్పించి వ్యభిచార దందా నడిపిస్తున్నారు. ఇటీవల హైటెక్‌ వ్యభిచార ముఠాను అరెస్ట్‌ చేసి, 23 మందిని అరెస్ట్‌ చేశారు. స్పా సెంటర్‌లో దేశ, విదేశాల అమ్మాయిలతో వ్యభిచార దందా నడుస్తున్నట్లు గుర్తించారు. నేపాల్‌, మలేషియా, హరియాణా, నాగాలాండ్‌, సిక్కిం, పంజాబ్‌ ,ఉత్తరప్రదేశ్‌, డిల్లీ, కోల్‌కతా, ఏపీ ప్రాంతాల నుంచి యువతులను నగరానికి తీసుకొచ్చి హైటెక్‌ వ్యభిచారం నిర్వహిస్తున్నారు.


టాన్జానియా దేశస్థుడిపై పీడీ యాక్ట్‌ 

మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న టాన్జానియా దేశస్థుడిపై రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ పీడీ యాక్ట్‌ నమోదు చేశారు. టాన్జానియాకు చెందిన కబంగిలా వర్రెన్‌ అలియాస్‌ వెరేహుమ్‌బిజా అవుసన్‌ గతేడాది స్టూడెంట్‌ వీసాపై వచ్చి, నేరేడ్‌మెట్‌లో ఉంటున్నారు. టాన్జానియా దేశం నుంచి పేద యువతులను చదువు, ఉద్యోగం పేరుతో తీసుకొచ్చి.. వారిని బలవంతంగా పడుపు వృత్తిలో దింపేవాడు. రాచకొండ యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి, అదే దేశానికి చెందిన యువతిని రక్షించారు. సీపీ నిందితుడిపై పీడీ యాక్ట్‌ నమోదు చేశారు. 

Updated Date - 2021-11-27T15:02:14+05:30 IST