హ్యూమన్‌ సిండ్రోమ్‌

ABN , First Publish Date - 2022-01-17T05:58:52+05:30 IST

మీరెప్పుడైనా, భూమ్మీద నడిచి తిరుగుతున్న నరకాన్ని చూసారా రూపం సగటు మానవీయమే కానీ అంతరంగంలో చల్లార్చుకోలేని...

హ్యూమన్‌ సిండ్రోమ్‌

మీరెప్పుడైనా, భూమ్మీద

నడిచి తిరుగుతున్న నరకాన్ని చూసారా

రూపం సగటు మానవీయమే కానీ 

అంతరంగంలో చల్లార్చుకోలేని

హాలాహలాల్ని మోస్తూ 

విస్తరించుకుంటున్న మరుభూమి అది 

ఏ అజ్ఞానపుటంధ క్షణంలోనో 

నరక మాతృక మహా నిశ్శబ్దంగా 

ఒంటి తటాకంలోకి దూకి 

నిరంతరం కలుషిత కాసారంగా 

కుమ్మేస్తూ ఉంటది

దాని అరికాళ్ళకింది

మంటలెవరికీ కనిపించవు 

నడినెత్తిమీద నిప్పుల వాననెవరూ చూడలేరు 

చెమ్మ ఉన్న హృదయమేదైనా 

సేఫ్‌ డిస్టెన్స్‌లో నిలబెట్టి 

ఆరిపోయే దీపం ఒత్తికి

అరకొర తైలమైనా అందిస్తుందని 

స్నేహదారుల ఆచూకీకై

మనసంతా కళ్ళు చేసుకొని వెతుకుతుందా...

పరిచిత లోకమంతా 

దూరం దూరం జరిగిపోతుంది

కన్న ఊరూ కొన్న ఊరూ

మెల్ల మెల్లగా ఉపసంహరించుకుంటాయి 

మందులన్నింటితోనూ సిండ్రోమ్‌ 

అక్రమ దోస్తానానికి అలవాటుపడి 

ఏ.ఆర్‌.టి సంజీవని కూడా 

క్రమంగా బలహీన పడుతుంటే 

సకలాంగాల సైలెంట్‌ విత్‌డ్రాయల్‌

నరకం మీద నమోదవుతూ ఉంటది

ఆపైనో

ముందుగానేనో

మనోదర్పణం మీద 

నాన్‌ వర్చల్‌ ఈటెల దాడి 

అక్వయిర్డ్‌ ఇమ్యూనిటీని 

శరీరం కన్నాముందు

లోకమే హరిస్తుంది 

ఇక్కడ 

దినం దినం అగ్నిపర్వతాలు 

బద్దలవుతూనే ఉంటాయి 

ఈ హాలాహలం 

తాగనూలేక విడిచిపెట్టనూ వీలుగాక 

పిక్కటిల్లే అరణ్యరోదనను 

పంటిబిగువున అణచిపెట్టుకుంటూ ఉంటది

ఒక వైపు ఆకలి 

ఒక వైపు నరక తాకిడి 

కలిసి చేసే యుద్ధక్షేత్రమిది

ఈ విలయ వలయంతో 

ముడివడ్డ చేతులన్నీ

ఒక్కటొక్కటిగా ఒక్కటొక్కటిగా

తమను తాము ఒదిలించుకుంటూ

నిజనరకానికి దారులు పరుస్తూ ఉంటాయి 

పత్తిగింజ ఫట్‌మన్నదాకా

ఈ భగభగమనే కాగడా 

ముందుకూ వెనుకకూ నడుస్తూ నడుస్తూ

ఏనుగు నరసింహా రెడ్డి

89788 69183


Updated Date - 2022-01-17T05:58:52+05:30 IST