మహమ్మారితో మానవ మనుగడ

ABN , First Publish Date - 2021-04-02T09:55:21+05:30 IST

ఒకఏడాది క్రితం భారత ప్రభుత్వం కరోనా మహమ్మారిపై పోరుకు దేశవ్యాప్త లాక్‌డౌన్ ప్రకటించింది. ఇదొక ఆకస్మిక, అనివార్య చర్య. ఒక్కసారిగా సమస్త కార్యకలాపాలు...

మహమ్మారితో మానవ మనుగడ

మట్టివాసన :

ఒకఏడాది క్రితం భారత ప్రభుత్వం కరోనా మహమ్మారిపై పోరుకు దేశవ్యాప్త లాక్‌డౌన్ ప్రకటించింది. ఇదొక ఆకస్మిక, అనివార్య చర్య. ఒక్కసారిగా సమస్త కార్యకలాపాలు నిలిచిపోయాయి. వీథులన్నీ నిర్మానుష్యమైపోయాయి. వాహనాల సంచారమూ పూర్తిగా ఆగిపోయింది. ప్రపంచాన్ని ఒక ప్రశాంతత ఆవరించింది. మన నగరాలలో అసంఖ్యాక ఆటోమోబైల్స్, అశేష జనవాళి నిత్యం సృష్టించే శబ్దారావాల మధ్య నివశించని వారికి ఆ ప్రశాంతత ఏమిటో అర్థమవుతుందా? అర్థమవుతుందని నేను భావించడం లేదు. అదొక మహా నిశ్శబ్దం.


అలా ఒక ఏడాది గడిచిపోయిందో లేదో ఆ కోలాహలం తిరిగి విన్పించసాగింది. కోట్లాది ప్రజల జీవనాధారాలు కూలిపోయిన ఆపత్సమయంలో మానవ సహజ జీవనోత్సాహం మళ్ళీ విప్పారసాగింది. దానితోపాటే కొవిడ్ విపత్తు మళ్ళీ విజృంభించడం మొదలయింది. అనేక దేశాల్లో మళ్ళీ లాక్‌డౌన్ అమలుపరుస్తున్నారు. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. ఊపిరి పీల్చుకునే పరిస్థితి నెలకొన్నా ప్రపంచం మరింత వ్యాకులతకు గురవుతోంది. 


ఈ నేపథ్యంలో అనివార్యంగా వేసుకోవలసిన కొన్ని ప్రశ్నలు: మానవాళి జీవన గమనానికి కరోనా మహమ్మారితో ఏర్పడిన విఘాతం లేదా అంతరాయం మనకు ఏం నేర్పింది? జనసమూహాలలో సమాజీకరణం (సోషియలైజేషన్) కొరవడడం మనలను మరింత మంచి మనుషులుగా చేసిందా? లేక మనలోని చెడ్డగుణాలను పురిగొల్పిందా? భవిష్యత్తులో ఇటువంటి ఆపదలు, అంతరాయాలు మరిన్ని నెలకొన్నప్పుడు మన భవిష్యత్తు ఎలా ఉంటుంది? తదుపరి విశ్వవిపత్తును సమర్థంగా ఎదుర్కోగల పరిస్థితిలో మనం ఉన్నామా? నేను వీటి గురించి శంకిస్తున్నాను. గత ఏడాది కాలంగా జరిగిన పరిణామాల నుంచి ఒక సమాజంగా మనం ఏమీ నేర్చుకోలేదని, మనం గర్వించదగింది కూడా ఏమీ లేదని నేను సూచిస్తున్నట్టు మీరు పొరపడవద్దు. నిజంగా మనం ఎంతో నేర్చుకున్నాం, మనం గర్వించదగిందీ ఎంతో ఉంది. ఇది నా నిశ్చితాభిప్రాయం. 


కరోనా విషక్రిమి వ్యాప్తిని అరికట్టడంలో డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు, మునిసిపల్ ఉద్యోగులు, లెబొరేటరీ టెక్నీషియన్ల నిస్వార్థ, అకుంఠిత కృషి నిజంగా ఆశ్చర్యం గొలుపుతుంది. దావానలం లాంటి మహమ్మారి దాడిని భరించింది వారే. తమ ప్రాణాలను పణంగా పెట్టి వారు తమ విధ్యుక్తధర్మాన్ని నిర్వహించారు. మనం వారికి చాలా రుణపడిఉన్నాం. వ్యాక్సిన్లను అభివృద్ధిపరచడంలో శాస్త్రవేత్తల మహత్తర కృషిని కూడా మనం గుర్తించాలి. అతి స్వల్ప కాలంలో వారు పలు సంజీవనులను మనకు అందించారు. మానవ ప్రతిభ విశిష్టతకు వారి కృషి ఒక నిండు తార్కాణం. 


వలస కార్మికుల దుస్థితిని మనం మరువగలమా? జీవితాలను నిర్మించుకుంటున్న నగరాల నుంచి సుదూర స్వస్థలాలకు వారు వెళ్ళ వలసిరావడం ఎంత విషాదం! వారి బాధను మనం సంవేదించాం. కట్టు బట్టలతో కాలినడకన తమ గమ్యాలకు వారి ప్రస్థానం మన మనస్సులలో చెరగని ముద్ర వేసింది. మానవతతో స్పందించిన పలువురు వ్యక్తిగతంగానూ, సంఘటితంగానూ ఆ విపత్కర వేళ వారిని ఆదుకున్నారు. మానవులను మానవులుగా ఉంచే సహానుభూతి, కరుణ అనే గుణాలను మనం ఇంకా మరచిపోలేదనే మానవీయ సత్యాన్ని వలస కార్మికులకు అందించిన సహాయ సహకారాలు మనకు ఎరుకపరిచాయి. 


కరోనా మహమ్మారి వల్ల అమితంగా నష్టపోయింది బాలలే. మంచి ఆదాయం ఉన్న కుటుంబాలకు చెందిన పిల్లలు ఒక సంవత్సర కాలం సమాజీకరణం అనుభవాలను కోల్పోయారు. సహచర పిల్లలతో వారికి ఒక ఏడాదిపాటు అన్యోన్య/పరస్పర సంబంధాలు లేకుండాపోయాయి.ఆర్థిక శక్తి అంతగా లేని కుటుంబాల పిల్లలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన సదుపాయాన్ని కోల్పోయారు. ఉద్యోగాలు కోల్పోయిన తల్లిదండ్రుల పిల్లలయితే సమస్తమూ కోల్పోయారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక మిగతా వారికి కొవిడ్ ఆపత్కాలం ఎన్ని చేదు అనుభవాలను మిగిల్చిందో అన్ని మధుర జ్ఞాపకాలనూ పోగు చేసిందని చెప్పవచ్చు. 


అయితే గత ఏడాది కాలంలో సంభవించిన పరిణామాలలో గొప్ప ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే కొవిడ్ మహమ్మారి ప్రభావం సంపన్న సమాజాలపైనే అత్యధికంగా ఉండడం. నేను ఈ వ్యాసాన్ని రాస్తున్న సమయంలో ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసుల సంఖ్య 12కోట్ల 40 లక్షలకు పైగా పెరిగింది. వీటిలో నాలుగోవంతు ఒక్క అమెరికాలోనే నమోదయ్యాయి. కారణమేమిటి? దీనిపై ఎవరూ ఇంకా ఒక అంతిమ నిర్ధారణకు రాలేదు. తప్పుడు భావనే కావచ్చు గానీ, కరోనా వ్యాధి ‘సంపన్నుల’ వ్యాధి అని మన దేశంలో చాలా మంది గట్టిగా విశ్వసిస్తున్నారు.


కరోనా విషక్రిమితో చాలా దేశాలు సతమతమవుతుండగా మన దేశం ఆ విపత్తును సమర్థంగా ఎదుర్కొంటోంది. ఇది ఎవరూ కాదనలేని సత్యం. లాక్‌డౌన్ ఎంత నిర్దాక్షిణ్యమైన చర్య అయినప్పటికీ కొవిడ్ బాధితుల సంఖ్యను గణనీయంగా తగ్గించింది. దేశవ్యాప్తంగా మారు మూల ప్రాంతాలలో సైతం వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఇంతవరకు ఐదు కోట్ల డోసులను ఇవ్వడం జరిగింది. ఆస్పత్రికి అలా వెళ్ళి కొవిడ్ టీకా వేయించుకునే సౌలభ్యం మనకు ఉంది. తమ ప్రజలకు ఇటువంటి సదుపాయాన్ని కల్పించడంలో సంపన్నదేశాలు ఇప్పటికీ ఆపసోపాలు పడుతున్నాయి! 


మన ప్రజలకు ఇంకా ఎంతో చేయవలసిఉంది. పేదలకు జీవనాధారాల భద్రత కల్పించడం చాలా ముఖ్యం. మన నాయకులు కొవిడ్–19 కోడ్‌ను ఉల్లంఘించకుండా జాగ్రత్త వహించడం కూడా చాలా ముఖ్యం. చాలామంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే అందుకు కారణం ఎన్నికల ర్యాలీలు, ఇతర సమావేశాలకు వారు పెద్దసంఖ్యలో వచ్చేలా నాయకులు ప్రోత్సహించడం వల్లే కాదూ? గత సంవత్సరకాలం మనలను ఎంతగా యాతనకు గురిచేసినప్పటికీ అది మనలో ఒక నిండు ఆశాభావాన్ని కూడా నింపింది. ఎంతటి విపత్సమయంలోనూ భవిష్యత్తుపై సంపూర్ణ ఆశాభావంతో ఉండడం మానవ జీవిత ప్రధాన లక్షణాలలో ఒకటి. ఆ విశిష్ట గుణాన్ని మనం ఇంకా కోల్పోలేదు. ఎప్పటికీ కోల్పోము కూడా.


సునీతా నారాయణ్

‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’

డైరెక్టర్‌ జనరల్‌, ‘డౌన్‌ టు ఎర్త్‌’ సంపాదకురాలు

Updated Date - 2021-04-02T09:55:21+05:30 IST