నల్లగొండ జిల్లాలో నరబలి..? మహంకాళి విగ్రహం పాదాల వద్ద యువకుడి తల!

ABN , First Publish Date - 2022-01-11T08:22:34+05:30 IST

నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలోని హైదరాబాద్‌-నాగార్జునసాగర్‌ రాష్ట్ర రహదారిపై విరాట్‌నగర్‌లో శ్రీమెట్టు మహంకాళి దేవాలయం..

నల్లగొండ జిల్లాలో నరబలి..? మహంకాళి విగ్రహం పాదాల వద్ద యువకుడి తల!

  • హైదరాబాద్‌-సాగర్‌ రహదారిలోని విరాట్‌నగర్‌లో ఘటన
  • హతుడు సూర్యాపేట జిల్లా శూన్యపహాడ్‌ వాసిగా గుర్తింపు
  • మతిస్థిమితం లేక  ఇంటినుంచి పరారైన జయేందర్‌
  • ఎక్కడో హత్య చేసి తల తీసుకొచ్చినట్లు నుమానం

చింతపల్లి/పాలకవీడు, జనవరి 10: నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలోని హైదరాబాద్‌-నాగార్జునసాగర్‌ రాష్ట్ర రహదారిపై విరాట్‌నగర్‌లో శ్రీమెట్టు మహంకాళి దేవాలయం.. ఎప్పటిలాగానే పూజారి సోమవారం ఉదయం గుడి వద్దకు వచ్చారు. అమ్మవారికి పూజ చేసేందుకు సిద్ధమవుతుండగా.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం కనిపించింది. అమ్మవారి విగ్రహం పాదాల వద్ద ఓ మనిషి తల! ఒక్కసారిగా పూజారి దిగ్ర్భాంతికి గురయ్యారు. స్థానికులు, పోలీసులకు సమాచారం ఇచ్చా రు. శరీరం నుంచి వేరు చేసిన తలను ఉంచడంతో ఇది నరబలేనని స్థానికులు అనుమానిస్తున్నారు. నాగార్జునసాగర్‌-హైదరాబాద్‌ రాష్ట్ర రహదారిపై ఉన్న ఈ ఆలయం మీదుగా వెళ్లే భక్తులు మహంకాళి దేవతను దర్శించుకుని అగర్‌బత్తీలు వెలిగించి వెళతారు. పూజారి వచ్చిన సమయంలో విగ్రహం పాదాల వద్ద తల ఉండడం, అగర్‌బత్తీలు కూడా వెలిగించి వెళ్లడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు.. ఆలయానికి చేరుకుని మొండెం లేని తలను పరిశీలించి విచారణ ప్రారంభించారు. క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌ వచ్చి పరిశీలించాయు. పోలీసు శునకాలు మొండెం లేని తల ఉన్న స్థలం నుంచి హైదరాబాద్‌, కొండమల్లేపల్లి, విరాట్‌నగర్‌ దారుల వైపు పరుగెత్తి, తర్వాత ఘటనా స్థలానికి చేరుకున్నాయి. 


సామాజిక మాధ్యమాల్లో ఫొటోలతో గుర్తింపు..

మొండెం లేని తలను సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం శూన్యపహాడ్‌కు చెందిన రమావత్‌ జయేందర్‌ (30) దిగా పోలీసులు గుర్తించారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఫొటోలు చూసిన తల్లిదండ్రులు, గ్రామస్థులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చి చింతపల్లికి వెళ్లారు. శూన్యపహాడ్‌ గ్రామానికి చెందిన రమావత్‌ శంకర్‌, సూరమ్మల కుమారుడైన జయేందర్‌ డిగ్రీచదివి గ్రామంలోనే ఉంటున్నాడు. రెండేళ్లక్రితం మతిస్థిమితం కోల్పోవడంతో తల్లిదండ్రులు ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో చేర్పించారు. అక్కడ ఉండకపోవటంతో ఏడాది క్రితం గ్రామానికి తీసుకువచ్చారు. గ్రామంలో తరచూ పలువురిని గాయపర్చడం, కుటుంబ సభ్యులపై దాడులు చేస్తుండడంతో ఇబ్బందులు పడలేక తల్లిదండ్రులు అతని గురించి పట్టించుకోవడం మానేశారు. దీంతో ఆరు నెలల క్రితం అతడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మూడు నెలల క్రితం రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్‌ వద్ద భిక్షాటన చేస్తున్నాడని తెలియడంతో తల్లిదండ్రులు అక్కడికి వెళ్లి చూసి వచ్చారు. అప్పటినుంచి జయేందర్‌ కనిపించలేదు. సోమవారం విరాట్‌నగర్‌లో మహంకాళి పాదాల వద్ద అతని తల కనిపించడంతో క్షుద్ర పూజల కోసమే మతిస్థిమితం లేని జయేందర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు బలి ఇచ్చినట్లు శూన్యపహాడ్‌ గ్రామంలో చర్చ జరుగుతోంది. హైదరాబాద్‌-నాగార్జునసాగర్‌ రాష్ట్ర రహదారిపై తెల్లవారుజామున వాహనాల రాకపోకలు తక్కువగా ఉంటాయని, ఆ సమయంలో ఈ ఘటన జరిగి ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు.  ఎక్కడో హత్య చేసి తలను నరికి తీసుకొచ్చి ఇక్కడ ఉంచారని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసును ఛేదించేందుకు ఎనిమిది ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు దేవరకొండ డీఎస్పీ ఆనంద్‌రెడ్డి తెలిపారు. 

Updated Date - 2022-01-11T08:22:34+05:30 IST