భారత్‌లో కుల వివక్ష

ABN , First Publish Date - 2022-08-19T06:03:02+05:30 IST

భారతదేశంలో బాల కార్మిక వ్యవస్థ, కుల వివక్ష, పేదరికం ఒకదానితో ఒకటి చాలా దగ్గరగా ముడిపడి ఉన్నాయని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది.

భారత్‌లో కుల వివక్ష

బాల కార్మిక వ్యవస్థ, పేదరికమూ దానితో ముడిపడి ఉన్నాయి

పాకిస్థాన్‌లో బలవంతపు పెళ్లిళ్లు ఎక్కువ

ఐరాస మానవ హక్కుల నివేదిక వెల్లడి


ఐరాస, ఆగస్టు 18: భారతదేశంలో బాల కార్మిక వ్యవస్థ, కుల వివక్ష, పేదరికం ఒకదానితో ఒకటి చాలా దగ్గరగా ముడిపడి ఉన్నాయని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. దక్షిణాసియాలో దళిత మహిళలు తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్నారని, అన్ని అంశాల్లోనూ నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను వారికి నిరాకరిస్తున్నారని తెలిపింది. ఐరాస మానవహక్కుల మండలి ప్రతినిధి టొమోయో ఒబొకట రూపొందించిన ఈ నివేదికను బుధవారం ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీకి సమర్పించారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ బాలకార్మిక వ్యవస్థ ఉందని ఆ నివేదికలో పేర్కొన్నారు. ఆసియా, పసిఫిక్‌, మధ్యప్రాఛ్యం, అమెరికా, ఐరోపాలలో 4 నుంచి 6 శాతం పిల్లలు బాలకార్మికులుగా ఉన్నారని, ఆఫ్రికాలో మరీ ఎక్కువగా 21.6 శాతం ఉన్నారని నివేదిక వెల్లడించింది. 


ప్రభుత్వ విధానాలు, బడ్జెట్‌ కేటాయింపుల్లో అణగారిన వర్గాలను నిర్లక్ష్యం చేస్తున్నారని, మానవ హక్కుల ఉల్లంఘన కేసుల్లో వారికి చాలా పరిమితంగానే న్యాయం అందుతోందని తెలిపింది. వృత్తి, సంతతి ఆధారంగా వారి పట్ల వివక్ష కొనసాగుతోందని తెలిపింది.  దక్షిణాసియాలో దళితులు వెట్టి చాకిరీలో మగ్గిపోతున్నారని తెలిపింది. అట్టడుగు వర్గాల్లో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే బలవంతపు పెళ్లిళ్లు పాకిస్థాన్‌లో ఎక్కువగానూ, అఫ్ఘానిస్థాన్‌, బంగ్లాదేశ్‌, భారత్‌, సోమాలియా దేశాల్లో తక్కువగానూ జరుగుతున్నాయని తెలిపింది. కాగా, మైనారిటీలు, వలస కార్మికుల హక్కుల కోసం కార్మిక సంఘాలు ప్రశంసనీయమైన పాత్ర పోషిస్తున్నాయని నివేదిక కొనియాడింది. 

Updated Date - 2022-08-19T06:03:02+05:30 IST