Abn logo
Mar 3 2021 @ 16:01PM

మనుషులు, జంతువుల మధ్య ఘర్షణ వాతావరణం తగ్గించేందుకు కమిటీ

హైదరాబాద్‌: ఇటీవల కాలంలో మనుషులకు, జంతువుల మధ్య ఘర్షణవాతావరణం నెలకొన్న నేపధ్యంలో వాటిని తగ్గించడంతో పాటు అవసరమైన సూచనలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటుచేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఛైర్మన్‌గా, అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్‌. శోభ మెంబర్‌కన్వీనర్‌గా పది మందితో కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీలో రాజ్యసభ సభ్యుడు కేఆర్‌ సురేశ్‌రెడ్డి, స్పెషల్‌ సెక్రటరీ శాంతి కుమారి, మాజీ ఎమ్మెల్యే జి. అరవింద్‌రెడ్డి, జాతీయ పులుల సంరక్షణ కేంద్రం, వన్య ప్రాణి సంరక్షణ స్వచ్చంద సంస్థల ప్రతినిఽధులు సభ్యులుగా నియమితులయ్యారు. 


ఇటీవల కాలంలో జనావాసాలకు తరలి వచ్చి మనుషులపై పులులు దాడిచేస్తున్న ఘటనలు చోటుచేసుకున్నవిషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలకు కారణాలను ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. అలాగే మనుషులు, మన్య ప్రాణుల మధ్య ఘర్షణ వాతావరణం, ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు, నష్టపరిహారం తదితర అంశాలను కూడా ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. జంతువుల దాడుల్లో మనుషులు గాయపడడం, చనిపోవడం, పెంపుడు జంతువులు మృతి చెందడం, పంట నష్టం తదితర అంశాలపై కూడా కమిటీ అధ్యయనం చేస్తుందని అధికారులు తెలిపారు. ఆయా సమస్యలపై మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని కూడా కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. 

Advertisement
Advertisement
Advertisement