నగరానికి ‘జలహారం’

ABN , First Publish Date - 2020-05-31T08:49:32+05:30 IST

ట్రాఫిక్‌ సమస్యలకు చెక్‌ పెట్టేందుకు నిర్మించిన ఔటర్‌ రింగ్‌ రోడ్డు హైదరాబాద్‌ మహానగరానికి మణిహారంలా నిలిచింది. ఈ మణిహారాన్ని సరిహద్దుగా చేసుకుని త్వరలో ఓ జలహారం రాబోతోంది.

నగరానికి ‘జలహారం’

గ్రేటర్‌ చుట్టూ భారీ పైపులైన్‌... 

రూ.4725 కోట్లతో వాటర్‌బోర్డు ప్రతిపాదన

30 ఏళ్ల నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణం

గోదావరి జలాల రాకతో త్వరలో గ్రీన్‌ సిగ్నల్‌


హైదరాబాద్‌ సిటీ, మే30 (ఆంధ్రజ్యోతి): ట్రాఫిక్‌ సమస్యలకు చెక్‌ పెట్టేందుకు నిర్మించిన ఔటర్‌ రింగ్‌ రోడ్డు హైదరాబాద్‌ మహానగరానికి మణిహారంలా నిలిచింది. ఈ మణిహారాన్ని సరిహద్దుగా చేసుకుని త్వరలో ఓ జలహారం రాబోతోంది. రోజురోజుకీ నగర జనాభా భారీగా పెరుగుతుండడంతో నీటి సమస్య ప్రభుత్వానికి పెనుసవాలు విసురుతోంది. దీనికి చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం ఓ భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతోంది. ఔటర్‌ రింగ్‌ రోడ్డు సరిహద్దుగా నగరం చూట్టూ 158 కిలోమీటర్ల మేర ఓ భారీ పైపులైన్‌ను నిర్మించ తలపెట్టింది. దీని  ద్వారా నగరంలో నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి సంకల్పించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మొత్తం 1.20 కోట్ల జనాభా ఉండగా.. 2060 మిలియన్‌ లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే 30 ఏళ్ల తర్వాత నగర జనాభా ఎంతుంటుంది? నీటి అవసరాలు ఎలా ఉంటాయి? అనే అంశంపై వాటర్‌బోర్డు అధికారులు ఇప్పటికే అంచనా వేయించారు. దీని ప్రకారం 2050 నాటికి గ్రేటర్‌ జనాభా 2 కోట్లకు చేరుతుంది. రోజుకు 5వేల మిలియన్‌ లీటర్లకు పైగా నీళ్లు అవసరమవుతాయి. భవిష్యత్తులో జంట జలాశయాల్లోని నీటి వనరులు నగర దాహార్తిని తీర్చేందుకు సరిపోవని భావిస్తున్న తరుణంలో కృష్ణా, గోదావరి జలాలే నగరానికి ప్రధాన జలాధారం కానున్నాయి. అందుకే ప్రభుత్వం నగర శివారులో రెండు భారీ రిజర్వాయర్లను నిర్మించనుంది. కృష్ణా జలాలకు ఓ రిజర్వాయర్‌, గోదావరి జలాలకు మరో రిజర్వాయర్‌ను కేటాయించనుంది. ఆ జలాలను రిజర్వాయర్ల నుంచి నగరానికి అందించేందుకు ప్రభుత్వం ఈ పైప్‌లైన్‌ను నిర్మించ తలపెట్టింది. 


రూ.4,725 కోట్లతో ప్రతిపాదన

ఔటర్‌ రింగ్‌ రోడ్డు వెంబడి 158 కిలోమీటర్ల మేర 3,600 ఎంఎం డయా వ్యాసార్థంతో కూడిన భారీ పైపులైన్‌ను రూ.4,725 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి వాటర్‌బోర్డు డీపీఆర్‌ సమర్పించింది. 12 మాస్టర్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లతో నిర్మించే రింగ్‌ మెయిన్‌ను కృష్ణా, గోదావరి జలాలు అత్యవసర స్థితిలో ఆదుకుంటాయి. ఈ రింగ్‌ మెయిన్‌తో నగరానికి ఎటువైపు నుంచైనా నీటిని తీసుకునే అవకాశం ఉంటుంది. భవిష్యత్‌ నీటి డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని నిర్మిస్తున్న రింగ్‌మెయిన్‌.. 1628 చదరపు కిలోమీటర్ల పరిధిలో (కోర్‌ సిటీ 169 చ.కి.మీ., శివారు ప్రాంతాలు 518.90 చ.కి.మీ., ఓఆర్‌ఆర్‌ గ్రామాల పరిధి 939.80 చ.కి.మీ.) నీటి సమస్యలు లేకుండా చేస్తుంది. గోదావరి జలాలు నగర శివారులోని కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి చేరడంతో ఈ నీటిని పూర్తిస్థాయిలో నగర అవసరాలకు వినియోగించడానికి రింగ్‌ మెయిన్‌ ప్రధాన ఆధారం. దీంతో మహానగరానికి తాగునీటి ఢోకా లేకుండా చేసే ఔటర్‌ రింగ్‌ మెయిన్‌ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఆమోదం తెలుపనుందని అధికారులు చెబుతున్నారు.


కృష్ణా, గోదావరి అనుసంధానం

నగరంలో నీటి సరఫరాకు విద్యుత్తే ప్రధాన ఆధారం. ఒక్కసారి విద్యుత్‌ ఆగిపోతే పైపులైన్లలో వేగంగా ప్రవహించే నీరు ఒక్కసారిగా ఆగిపోతుంది. వెంటనే విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించినా.. వేగం పుంజుకోవాలంటే సమయం పడుతుంది. దీంతో విద్యుత్‌ అధికారులు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఒక్కోసారి నీళ్ల ప్రవాహానికి పైపులైన్లు పగిలిపోతాయి. అలాంటి సందర్భాల్లో వీటి మరమ్మతులు పూర్తయ్యే వరకు నీటి సరఫరా ఆగిపోతుంది. ఇలా ప్రస్తుతం ఉన్న కృష్ణా పేజ్‌-1, ఫేజ్‌-2, ఫేజ్‌-3 పైపులైన్లలో ఏలాంటి ఇబ్బంది వచ్చినా.. ఓ ప్రాంతానికి నీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాగే.. ఎల్లంపల్లి నుంచి వచ్చే గోదావరి జలాల్లో ఏమాత్రం ఇబ్బందులు వచ్చినా పలు ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోతుంది. ఇలాంటి ఇబ్బందులకు ‘జలహారం’తో చెక్‌పెట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఔటర్‌ వెంట భారీ రింగ్‌ మెయిన్‌ ఏర్పాటు చేసి కృష్ణా, గోదావరి జలాలను అనుసంధానం చేయనుంది. దీని ద్వారా ఓ వైపు నుంచి నీటి సరఫరా నిలిచినా.. మరో వైపు నుంచి సరఫరా చేయడం వీలవుతుంది. 

Updated Date - 2020-05-31T08:49:32+05:30 IST