వరద.. వందనం

ABN , First Publish Date - 2020-08-09T06:22:56+05:30 IST

జూరాలకు వరద పోటెత్తుతోంది. ఈ సీజన్‌లో రెండోసారి వరద భారీగా వచ్చి చేరుతోంది. కర్ణాటకలోని..

వరద.. వందనం

  • జూరాలకు భారీగా చేరిన వరద
  • ఎగువ నుంచి 2.10 లక్షల నీరు రాక
  • 28 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల
  • శ్రీశైలానికి పరుగులు తీస్తున్న కృష్ణమ్మ
  •  కనిపించని సందర్శకులు
  •  కరోనా ఎఫ్టెక్ట్‌తో ఇళ్లకే పరిమితమైన ప్రజలు

గద్వాల, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి) : జూరాలకు వరద పోటెత్తుతోంది. ఈ సీజన్‌లో రెండోసారి వరద భారీగా వచ్చి చేరుతోంది. కర్ణాటకలోని ఆల్మట్టి నుంచి 1.90 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయగా, అక్కడి నుంచి నారాయణపూర్‌కు వరద చేరింది. నారాయణపూర్‌ నుంచి 2.10 లక్షల క్యూసెక్కుల నీటీని దిగువకు విడుదల చేశారు. జూరాలకు వరద నీరు వస్తుందని నారాయణపూర్‌ ప్రాజెక్టు నుంచి సమాచారం రావడంతో శుక్రవారం ఎనిమిది గేట్లు ఎత్తి జూరాలలో ఉన్న నీటిని దిగువకు వదిలారు. తొలుత 25,615 క్యూసెక్కులను విడుదల చేయగా, జల విద్యుత్తు ఉ్పత్పత్తి కేంద్రం నుంచి మరో 24 వేల క్యూసెక్కులను విడుదల చేశారు. అర్ధరాత్రి నుంచి వరద పెరుగుతూ రావడంతో శనివారం ఉదయానికి రెండు లక్షల పైచిలుకు ఇన్‌ఫ్లో నమోదైంది. దీంతో ప్రాజెక్టు 25 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. సాయంత్రానికి మరి కొద్దిగా వరద పెరగడంతో మరో మూడు గేట్లు ఎత్తి మొత్తం 28 గేట్ల ద్వారా శ్రీశైలానికి 2.20 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాగా, మరో వారం రోజుల పాటు వరద ప్రవాహం ఇలాగే కొనసాగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అలాగే తొలిసారిగా తుంగభద్ర డ్యామ్‌కు కూడా 1.33 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరింది.


గతేడాదితో పోలిస్తే తక్కువే

ఈ ఏడాది కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుతోంది. అయితే, గతేడాదితో పోలిస్టే కొద్ది మేర తక్కువగా వనద నమోదైంది. కానీ, ఈ ఏడాది ఆల్మట్టికి 155.74 టీఎంసీలు, నారాయణపూర్‌కు 90.23 టీఎంసీలు, జూరాలకు 100.24 టీఎంసీలు, తుంగభద్ర డ్యామ్‌కు 57.57 టీఎంసీలు, శ్రీశైలానికి 120.16 టీఎంసీలు, నాగార్జునసాగర్‌కు 67.91 టీఎంసీల వరద నీరు వచ్చింది.


కనిపించని సందర్శకులు

జూరాలకు భారీగా వరద నీరు రావడం, 28 గేట్లను ఎత్తారు. అయితే సందర్శకుల తాకిడి మాత్రం కనిపించ లేదు. ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో, ఎవరూ ప్రాజెక్టు వద్దకు రావడం లేదు. దీనికితోడు శ్రావణ శనివారం కావడంతో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అలాగే కొవిడ్‌-19 నిబంధనల మేరకు జూరాల ప్రాంతాల్లో చేపల వంటకాలను పోలీసులు నిలిపి వేశారు. 


శ్రీశైలంకు 2,22,406 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయంలోకి వరద భారీగా చేరుతోంది. జూరాల నుంచి 1,99,772 క్యూసెక్కులు, పవర్‌ హౌజ్‌ ద్వారా 22,634 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ప్రాజెక్టుకు నమోదవుతోంది. పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో కలిగి మొత్తం 2,22,406 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్లు అధికారులు శనివారం తెలిపారు. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 849.10 అడుగుల నీటి నిల్వ ఉంది.


మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఎగువన ఉన్న ప్రాజెక్టులకు నుంచి జూరాలకు భారీగా ఇన్‌ఫ్లో నమోదవుతోంది. ఈ నేపథ్యంలో వచ్చిన నీటిని యథాతథంగా దిగువకు విడుదల చేస్తుండటంతో ఇటిక్యాల మండలం బీచుపల్లి వద్ద కృష్ణమ్మ నిండుగా పారుతోంది. దీంతో నదీ తీరం వెంట ఉన్న గ్రామాల ప్రజలను రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేసినట్లు ఆర్‌ఐ అజిత్‌ కుమార్‌ తెలిపారు. బీచుపల్లి పుస్కర ఘాట్‌ వద్ద నదిలోకి ఎవరూ వెళ్లకుండా కట్టుదిట్టం చేసినట్లు చెప్పారు.

Updated Date - 2020-08-09T06:22:56+05:30 IST