ఇంజనీరింగ్‌ సీట్లలో భారీగా మిగులు

ABN , First Publish Date - 2021-12-04T07:31:00+05:30 IST

రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ సీట్లు భారీగా మిగిలాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో భర్తీ చేసే కన్వీనర్‌ కోటా సీట్లల్లో సుమారు 20 శాతం మిగిలినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇంజనీరింగ్‌ సీట్లలో భారీగా మిగులు

హైదరాబాద్‌, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ సీట్లు భారీగా మిగిలాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో భర్తీ చేసే కన్వీనర్‌ కోటా సీట్లల్లో సుమారు 20 శాతం మిగిలినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం స్పాట్‌ అడ్మిషన్ల తర్వాత కూడా పెద్దఎత్తున ఇంజనీరింగ్‌ సీట్లు మిగిలినట్లు సమాచారం. రాష్ట్రంలో మొత్తం 175 ఇంజనీరింగ్‌ కాలేజీలు ఉన్నాయి. వాటిలో 15 యూనివర్సిటీలు, 2 ప్రైవేట్‌ యూనివర్సిటీలు ఉండగా, మరో 158 ప్రైవేట్‌ కాలేజీలు ఉన్నాయి. వీటిలో కన్వీనర్‌ కోటా పరిధిలో సుమారు 79,856 సీట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు వివిధ దశల్లో నిర్వహించిన ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో 57,177 సీట్లను విద్యార్థులకు కేటాయించారు. మరో 22,679 సీట్లు మిగిలాయి. అంటే మొత్తం సీట్లల్లో 71.60 శాతం మాత్రమే భర్తీ అయ్యాయి. సీట్లు పెద్ద సంఖ్యలో మిగలడంతో స్పాట్‌ అడ్మిషన్లకు అవకాశం కల్పించారు. స్పాట్‌ అడ్మిషన్‌ తర్వాత కూడా కన్వీనర్‌ కోటాలో సుమారు 20 శాతం సీట్లు మిగిలినట్లు సమాచారం.  ఈనెల 1వ తేదీ నుంచి తరగతులను కూడా ప్రారంభించిన విష యం తెలిసిందే.


ప్రస్తుతం మిగిలిన సీట్లను భర్తీ చేయాలంటే వాటిని ‘బీ’ కేటగిరిలోకి మార్చాల్సి ఉంటుంది. ఆయా కాలేజీలు మిగిలిన సీట్లకు రాటిఫికేసన్‌ కోసం అభ్యర్థించాల్సి ఉంటుంది. ప్రభుత్వం అంగీకరిస్తే ‘బీ’ కేటగిరిలోకి భర్తీ చేసుకోవడానికి కాలేజీలకు అవకాశం ఉంటుంది. కన్వీనర్‌ కోటా లో ఉన్నప్పుడే ఈ సీట్లు భర్తీ కానీ పరిస్థితి ఉంటే ‘బీ’ కేటగిరిలోకి మార్చిన తర్వాత భర్తీ చేయడం సాధ్యం కాదని అంచ నా చేస్తున్నారు. కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో సీట్లు బాగానే భర్తీ అయినప్పటికీ, ఎలక్ర్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ర్టానిట్స్‌ ఇంజనీరింగ్‌, సివిల్‌, మెకానికల్‌ వంటి విభాగంలో సీట్లు భారీగా మిగిలిపోయాయి. ముఖ్యంగా సివిల్‌, మెకానికల్‌ విభాగాల్లోని సీట్లు 40 శాతం కూడా నిండకపోవడం విశేషం.

Updated Date - 2021-12-04T07:31:00+05:30 IST