రాష్ట్రపతి భవన్‌ మనదే

ABN , First Publish Date - 2020-09-20T08:56:50+05:30 IST

వంచనకు నమ్మకమే పునాది. మరింత దోపిడీ చేయాలంటే మతాన్ని అడ్డుపెట్టుకోవాలి. మత విశ్వాసాన్ని ఆసరాగా చేసుకొని ఓ ముఠా రూ.వందల కోట్లు మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌తో దోచేసిన భారీ కుంభకోణం ఒకటి వెలుగు చూసింది.

రాష్ట్రపతి భవన్‌ మనదే

త్వరలో వేల కోట్లు వస్తాయి.. క్రైస్తవ సమాజం అభివృద్ధికే 

మతం ముసుగులో మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌

తియ్యని మాటలతో విశ్వాసులకు ఉచ్చు

రూ.37,500 చెల్లిస్తే రూ.కోటి ఇప్పిస్తాం 

కమీషన్‌ ఇస్తే సీఎస్‌ఆర్‌ ఫండ్స్‌ తెచ్చిస్తాం

లక్షల్లో పెద్దఎత్తున చెల్లించిన పాస్టర్లు

ఏపీ సహా పలు రాష్ట్రాల్లో వేలాది బాధితులు

దేశవ్యాప్తంగా వంద కోట్లు హాంఫట్‌?


సూత్రధారి కాకినాడలో ఇటీవలే మృతి

కాకినాడకు చెందిన స్కీమ్‌ సూత్రధారి 15 రోజుల క్రితం కొవిడ్‌-19తో మృతి చెందినట్లు వాట్సా్‌పలో సమాచారం అందడంతో డబ్బులు చెల్లించిన వారంతా షాక్‌లోకి వెళ్లారు. 15 రోజుల తర్వాత క్రైస్తవ పెద్దలు ఒక బృందంగా ఏర్పడి కాకినాడకు వెళ్లారు. కుటుంబ సభ్యుల వద్ద డబ్బుల విషయాన్ని వివరించారు. కుటుంబ సభ్యులు సైతం తెల్ల మొహం వేసి, ఇలాంటి విషయాలు తమకు ఏ మాత్రం తెలియవని చెప్పారు.


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

వంచనకు నమ్మకమే పునాది. మరింత దోపిడీ చేయాలంటే మతాన్ని అడ్డుపెట్టుకోవాలి. మత విశ్వాసాన్ని ఆసరాగా చేసుకొని ఓ ముఠా రూ.వందల కోట్లు మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌తో దోచేసిన భారీ కుంభకోణం ఒకటి వెలుగు చూసింది. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ కేంద్రంగా ఉన్న ఓ ముఠా దేశవ్యాప్తంగా వందల కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ‘‘క్రైస్తవ సమాజం ప్రస్తుతం చాలా సంక్షోభంలో ఉంది. దీన్ని అధిగమించాలంటే ప్రత్యేక కౌన్సిల్‌ ఏర్పాటు చేయాల్సి ఉంది. భారత ప్రభుత్వం క్రైస్తవ సంఘాలకు నిధుల విడుదలను అడ్డుకుంటోంది. అందుకే దేవుడి ఆదేశాల మేరకు రంగంలోకి దిగాం. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా క్రైస్తవ సమాజ ఉద్ధరణకు నడుం కట్టాం’’ అంటూ నమ్మబలికారు. గతంలో హిమ్‌ సంస్థ అనుసరించిన పద్ధతుల్లోనే  క్రైస్తవులకు వల వేశారు.  ఇది నమ్మిన పాస్టర్లు,  క్రైస్తవ సంఘాల పెద్దలు పెద్ద ఎత్తున డబ్బులు చెల్లించడమే కాకుండా, ఇతరులతోనూ కట్టించారు. ఇటీవల ఈ మార్కెటింగ్‌ నెట్‌వర్క్‌ సూత్రధారి కొవిడ్‌తో చనిపోయాడని తెలుసుకుని సభ్యులు ఆందోళనలో మునిగిపోయారు. 


మాయ మాటలతో వల...

‘‘రాష్ట్రపతి భవన్‌ మనదే. అదీ బ్రిటీష్‌ ఇండియాలోని క్రైస్తవులే కట్టించారు. త్వరలో అది మనకే సొంతమవుతుంది. తద్వారా వేల కోట్ల రూపాయలు మనకు వస్తాయి. ఫలితంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్న క్రైస్తవ సమాజం అభివృద్ధి చెందే అవకాశం ఉంది’’... ఈ మాటలు క్రైస్తవులను మోసం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆ ముఠా నాయకుడివి. తన మాటలు వినడానికి వచ్చిన వారితో అనేక విషయాలు మాట్లాడతాడు. హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ వద్ద పీఏగా పని చేశానంటూ ఫొటోలు చూపిస్తాడు. అత్యున్నత హోదాలను సైతం త్యజించానని అంటాడు. మొత్తం మీద క్రైస్తవ సమాజ ఉద్ధరణకు దేవుడు తమను పంపించాడని లక్షల మందిని నమ్మించాడు. తాను నిజానికి కైస్తవుడిని కాదని, ఇటీవలే క్రైస్తవ మతం స్వీకరించానని కూడా చెబుతాడు. ఈ పేద క్రైస్తవ బిడ్డలను కాపాడే అవకాశం కల్పించు ప్రభువా! అని.. బోరు బోరునా విలపించే వాడట. ఇది చూసిన వారంతా ఆయన మాయలో పడిపోయి, డబ్బులు సమర్పించుకున్నారు.  


ఇదీ వంచన తీరు.. మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ ముఠా తమను క్రైస్తవ సమాజం నమ్మే అవకాశం లేనందున హైదరాబాద్‌కు చెందిన ఒక బిష్‌పను రంగంలోకి దించింది. పాస్టర్‌లను నమ్మించేందుకు పావులాగా వాడుకుంది. ముఠా నేత రెండు రకాల స్కీంలను ప్రకటించాడు. 1) కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎ్‌సఆర్‌) కింద డబ్బులు ఇప్పిస్తాం... ముందే కమీషన్‌ చెల్లించాలి అంటాడు. 2) సివిల్‌ సొసైటీ ఆర్గనైజేషన్‌(సీఎ్‌సవో). మొదటి స్కీమ్‌ కింద కోట్లు వస్తాయి కనుక రెండు శాతం, మూడు శాతం కమీషన్‌ చెల్లించాలంటూ ఐదు లక్షల నుంచి పది లక్షలు వసూలు చేస్తాడు. స్వచ్ఛంద సంస్థల ద్వారా సేవలు చేస్తున్న వారిని ఇందులో చేరుస్తాడు. వరంగల్‌ జిల్లా నుంచే పది మంది ఇలా చెల్లించారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి బాధితులు ఉన్నారు. హైదరాబాద్‌లో వంద మంది చెల్లించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో బాధితులు పెద్దఎత్తున ఉన్నారు. ఏపీలో అధికార పార్టీ ఎంపీల ఫొటోలు కూడా ప్రచారానికి వాడుకున్నారు. దీంతో స్కీమ్‌ను నమ్మిన క్రైస్తవులు పెద్ద సంఖ్యలో డబ్బులు చెల్లించారు. 

Updated Date - 2020-09-20T08:56:50+05:30 IST