సెయింట్ లూయిస్ హిందూ దేవాల‌య మ‌హా కుంభాభిషేకానికి భారీ స్పంద‌న.. కోట్ల‌లో విరాళాలు!

ABN , First Publish Date - 2022-03-10T01:44:29+05:30 IST

ఇంటికోపువ్వు.. ఈశ్వ‌రుడికో మాల! అన్న‌చందంగా.. సెయింట్ లూయిస్‌లో నూత‌నంగా నిర్మించిన‌ హిందూ దేవాల‌యానికి నిర్వ‌హించ‌నున్న మ‌హా కుంభాభిషేకానికి స్థానికంగా ఉన్న తెలుగు వారు భారీ ఎత్తున స్పందించారు.

సెయింట్ లూయిస్ హిందూ దేవాల‌య మ‌హా కుంభాభిషేకానికి భారీ స్పంద‌న.. కోట్ల‌లో విరాళాలు!

ఇంటికోపువ్వు.. ఈశ్వ‌రుడికో మాల! అన్న‌చందంగా.. సెయింట్ లూయిస్‌లో నూత‌నంగా నిర్మించిన‌ హిందూ దేవాల‌యానికి నిర్వ‌హించ‌నున్న మ‌హా కుంభాభిషేకానికి స్థానికంగా ఉన్న తెలుగు వారు భారీ ఎత్తున స్పందించారు. మ‌హా కుంభాభిషేక క్ర‌తువులో త‌మ వంతు పాత్ర పోషించేందుకు ముందుకు క‌దిలారు. ప్ర‌తి ఒక్క‌రూ ఇతోథికంగా.. త‌మ వంతు విరాళం ప్ర‌క‌టించారు. ఆగ‌మ‌శాస్త్ర సంప్ర‌దాయంలో నిర్మాణం జ‌రిగిన ఈ ఆల‌యానికి ఈ ఏడాది మే 11వ తేదీ నుంచి 15వ తేదీ మ‌ధ్య మ‌హా కుంభాభిషేకం నిర్వ‌హించ‌నున్నారు. దీనికి సంబంధించి ఆల‌య నిర్వాహ‌కులు ఏర్పాట్లు చేస్తున్నారు. 


అయితే.. మ‌హా కుంభాభిషేకం అనేది అతి పెద్ద క్ర‌తువు కావ‌డంతో దీనిలో ప్ర‌తి ఒక్క‌రినీ భాగ‌స్వాముల‌ను చేయాల‌ని నిర్వాహ‌కులు భావించారు. ఈ క్ర‌మంలోనే విరాళాల సేక‌ర‌ణ‌కు శ్రీకారం చుట్టారు. మహా కుంభాభిషేక నిర్వహణకు ఆదివారం నాడు నిధుల సమీకరణ కార్యక్రమాన్ని స్థానిక ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. 700 మందికి పైగా స్థానిక ప్రవాసులు, భక్తులు విరాళాలు ఇచ్చి త‌మ భ‌క్తి ప్ర‌ప‌త్తుల‌ను చాటుకున్నారు. ఈ క్ర‌మంలో సుమారు మిలియన్ డాలర్లు (₹7.5కోట్లు) విరాళాలుగా అందినట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ గంగవరపు శ్రీనివాస రజనీకాంత్, అధ్యక్షురాలు డా.రాజ్యలక్ష్మి నాయుడులు తెలిపారు. మే 11-15 తేదీల్లో నిర్వహించే ఈ కుంభాభిషేకాన్ని విజయవంతం చేయాలని నిధుల సమీకరణ కమిటీ అధ్యక్షుడు షారద్ పారిఖ్ కోరారు. 


దీనికి సంబంధించిన నిధుల స‌మీక‌ర‌ణ‌కు అశోక్ కుమార్, ప్రసన్న అయ్యర్, పుట్టగుంట మురళీకృష్ణ, సాక్షి విజయ్, ఇంటూరి శేషు, యార్లగడ్డ కిషోర్, పర్వతనేని శ్రీనివాస్, ఎర్రపోతిన శ్రీనివాస్, రామ్మోహ‌న్‌రెడ్డి పాడూరు, ర‌వికాంత్ తదితరులు సహాయసహకారాలు అందించినట్లు మీడియా సమన్వయకర్త రాజా సూరపనేని తెలిపారు. కాగా, నిధుల స‌మీక‌ర‌ణ కార్య‌క్ర‌మంలో ప్రవాస భార‌తీయ‌ యువతీ యువకుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.





Updated Date - 2022-03-10T01:44:29+05:30 IST