వాన పోటు.. పిడుగు పాటు

ABN , First Publish Date - 2020-04-10T06:56:58+05:30 IST

కరోనాతో అష్టకష్టాలు పడుతున్న రైతన్నపై అకాల వర్షాల పిడుగు పడింది. ధరలు పతనమై, కోతలూ కోయలేని పరిస్థితిలో ఉన్న అన్నదాతను మరింత కుంగదీసింది. గురువారం కురిసిన అకాల వర్షాలకు భారీగా...

వాన పోటు.. పిడుగు పాటు

  • 14  మంది మృతి
  • వేలాది ఎకరాల్లో వరిపంటకు నష్టం
  • పిడుగుపాటుకు 10 మంది దుర్మరణం 
  • కృష్ణా జిల్లాలో పడవ బోల్తా.. నలుగురు మృతి.. ఇద్దరు గల్లంతు 
  • కల్లాల్లోనే ముద్దయున మిరప.. నేలరాలిన అరటి, మామిడి, నిమ్మ 

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌) : కరోనాతో అష్టకష్టాలు పడుతున్న రైతన్నపై అకాల వర్షాల పిడుగు పడింది. ధరలు పతనమై, కోతలూ కోయలేని పరిస్థితిలో ఉన్న అన్నదాతను మరింత కుంగదీసింది. గురువారం కురిసిన అకాల వర్షాలకు భారీగా ప్రాణ, పంటనష్టం జరిగింది. రాష్ట్రంలో మూడు జిల్లాల్లో పిడుగులు పడి పదిమంది మరణించగా, వర్షంతో పడవ మునిగి కృష్ణాజిల్లాలో ఆరుగురు గల్లంతయ్యారు. ఇప్పటికి నలుగురి మృతదేహాలు లభ్యం కాగా మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. ఇక అరటి, వరితో పాటు వేలాది ఎకరాల్లో వాణిజ్య, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. 

రాష్ట్రవ్యాప్తంగా వరుణుడు భీభత్సం సృష్టించాడు. గురువారం తెల్లవారుజాము నుంచి కురిసిన అకాల వర్షాలు, ఈదురు గాలులకు పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. పంట చేలన్నీ నీట మునిగాయి. నెల్లూరు జిల్లాలో పిడుగుపాటుకు గురై ఏడుగురు మృతి చెందారు. అల్లూరు మండలం పడమర గోగులపల్లెకు చెందిన కె.సుబ్బారావు(54), బోగోలు మండలం భాస్కరగిరివారికండ్రిగకు చెందిన పెంచల్‌రెడ్డి(62), దగదర్తి మండలం చెన్నూరులో సుబ్బరాయుడు(50), వరిగుంటపాడు గొల్లపల్లిలో పి.ఆంజనేయులు(35), శ్యాంసుందరం(40), నాయుడుపేట మండలం పూడేరు గ్రామంలో రైతు గుండాల శ్రీనివాసులు(37) పిడుగుపాటుకు గురై మరణించారు.


ఇదే మండలం గొట్టిబ్రోలు గ్రామానికి చెందిన ఆవుల గురవయ్య పిడుగు శబ్దానికి గుండెపోటుకు గురై మృతిచెందాడు. గుంటూరు జిల్లా నగరం మండలం పెదపల్లిగొల్లపాలెంకు చెందిన రైతు బెల్లంకొండ లక్ష్మయ్య(74), రేపల్లె మండలం గంగపాలెంకు చెందిన మత్స్యకారుడు కన్నా నరేశ్‌(37) పిడుగుపడి మరణించాడు. ప్రకాశంజిల్లా త్రిపురాంతకం మండలం మిట్టపాలెంలో పిడుగుపడి లక్ష్మణరావు(55) అనే రైతు మృతిచెందారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలంలో  పిడుగుపాటుకు ఆవు మృతి చెందింది. పూతలపట్టు మండలంలో ఓ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఫ్యాక్టరీపై పిడుగు పడి రూ.10లక్షల మేర ఆస్తినష్టం సంభవించింది. 


రైతుకు తీరని నష్టం 

నెల్లూరు జిల్లాలో గురువారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి సుమారు 10వేల టన్నుల ధాన్యం తడిసి ముద్దయ్యింది. రైస్‌మిల్లుల వద్ద నిల్వఉంచిన ధాన్యం బస్తాలు, రోడ్లమీద, కల్లాల్లో రైతులు ఆరబెట్టుకున్న ధాన్యం రాశులు అన్నీ తడిసిపోయాయి. కావలి, సర్వేపల్లి, కోవూరు నియోజకవర్గాల పరిధిలో వరి పంటకు తీవ్ర నష్టం సంభవించింది. సంగం, ఇందుకూరుపేట, కోవూరు మండలాల్లో 150ఎకరాల్లో అరటి నేలకూలింది. ప్రకాశం జిల్లాలో పలుచోట్ల కల్లాల్లోని మిర్చి తడిసింది. బొప్పాయి, అరటి, నిమ్మతోటల్లో కాయలు రాలిపోయాయి. పర్చూరు, మార్టూరు, దర్శి, వైపాలెం తదితర వ్యవసాయ సబ్‌డివిజన్ల పరిధిలో కల్లాల్లో ఉన్న మిరపకాయలు తడిసిపోయాయి. పశ్చిమగోదావరి జిల్లాలో పొలాల్లో ఆరబెట్టిన మొక్కజొన్న పూర్తిగా నీటమునగడంతో రైతులు బావురమంటున్నారు. కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దయ్యింది. వరిపనలు నేలకొరిగాయి. అరటి పంటకు అపార నష్టం జరిగింది. మామిడికాయలు నేలరాలాయి. మిరప, నువ్వులు ఎందుకూ కొరగాకుండా పోయాయి.


తూర్పుగోదావరి జిల్లాలో ఏపుగా పెరిగి కోతకు వచ్చిన చేలు అకాల వర్షంతో పూర్తిగా నేలనంటాయి. కర్నూలు జిల్లా పాములపాడు, చాగలమర్రి, కొలిమిగుండ్ల, మద్దికెర, సంజామల, మహానంది, బండి ఆత్మకూరు తదితర మండలాల్లో వరి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. శ్రీశైలంలో మధ్యాహ్నం రెండు గంటల పాటు వర్షం పడింది. కడప జిల్లా రైల్వేకోడూరు, రాజంపేట, పులివెందుల, రాయచోటి, కడప నియోజకవర్గాల్లో 2663.60 హెక్టార్లలో అరటి, మామిడి, తమలపాకు, మునగ పంటలు దెబ్బతినడంతో 3,045మంది రైతులు రూ.39.95 కోట్లు నష్టపోయారని ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ మధుసూదన్‌రెడ్డి వివరించారు. చిత్తూరు జిల్లాలో గాలుల తీవ్రత, వడగండ్ల వానలకు మామిడి పంట దెబ్బతింది. కాయలు, పిందెలు నేలరాలడంతో రైతులకు భారీగా నష్టం వాటిల్లింది. అనంతపురం జిల్లాలో వరితో పాటు ఉద్యాన పంటలు భారీగా దెబ్బతిన్నాయి. జిల్లా వ్యాప్తంగా 250ఎకరాల్లో వరి, అరటి, చీనీ, దానిమ్మ, మామిడి, బొప్పాయి, కళింగర, కర్బూజ పంటలకు రూ.3 కోట్లకుపైగా పంట నష్టం జరిగింది.


Updated Date - 2020-04-10T06:56:58+05:30 IST