భారీ బందోబస్తు

ABN , First Publish Date - 2022-08-15T05:27:26+05:30 IST

భారీ బందోబస్తు

భారీ బందోబస్తు
మావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి, పక్కన ఏఎస్పీ రషీద్‌

  •  సీఎం పర్యటనకు 1600 మంది పోలీసు సిబ్బంది 
  •   సభను అడ్డుకుంటే చర్యలు  : ఎస్పీ కోటిరెడ్డి

వికారాబాద్‌, ఆగస్టు14 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నూతన కలెక్టరేట్‌, టీఆర్‌ఎస్‌ భవన్‌ ప్రారంభోత్సవం, ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణానికి శంకుస్థాపనకు  సీఎం కేసీఆర్‌ ఈనెల 16న వికారాబాద్‌లో పర్యటించనున్న నేపథ్యంలో  పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన బందోబస్తుకు చర్యలు తీసుకుంటోంది. నలుగురు ఎస్పీలు, ఆరుగురు ఏఎస్పీలు, 14 మంది డీఎస్పీలు, 63మంది సీఐలు, 146 మంది ఎస్‌ఐలతో పాటు 1600 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లా పోలీసు  కార్యాలయం కాన్ఫరెన్స్‌ హాల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఏఎస్పీ రషీద్‌తో కలిసి మాట్లాడారు. సీఎం పర్యటన సందర్బంగా అడుగడుగునా పోలీసు నిఘా ఉంటుందని, రూట్‌ ఆఫ్‌లు ఏర్పాటు చేశామని, డ్రోన్‌, సీసీ కెమెరాలతో నిఘా ఉంచడమే కాకుండా ఇంటిలిజెన్స్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ నిఘా ఉంటుందని తెలిపారు. సీఎం పర్యటనను అడ్డుకుంటామని కొందరు ప్రకటనలు ఇచ్చారని, ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తే మాత్రం కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాని ఎస్పీ హెచ్చరించారు. సీఎం బందోబస్తులో స్పెషల్‌పార్టీ, రోప్‌పార్టీలు కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 

 ట్రాఫిక్‌ దారి మళ్లింపు..

సీఎం సభకు ఐదు నియోజకవర్గాల నుంచి ప్రజలు తరలి రానున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ సమస్య ఉత్పన్నం కాకుండా దారి మళ్లింపు, ట్రాఫిక్‌ నియంత్రణ చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు సహకరించాలని ఎస్పీ కోటిరెడ్డి కోరారు. తాండూరు, వికారాబాద్‌ నియోజకవర్గాల నుంచి వచ్చే వాహనాలను ఎన్టీఆర్‌, ఎన్నేపల్లి చౌరస్తాల మీదుగా భృంగీస్కూల్‌, చెన్నమ్మ తోటలో పార్కింగ్‌ చేసుకోవాలని సూచించారు. కొడంగల్‌, పరిగి నియోజకవర్గాల నుంచి నస్కల్‌ మీదుగా వచ్చే వారు తమ వాహనాలను డీ పీటీసీ, జడ్పీ న్యూబిల్డింగ్‌, ఓల్డ్‌ హెలీప్యాడ్‌ స్థలాల్లో పార్కింగ్‌ చేసుకోవాలని తెలిపారు. చేవెళ్ల నియోజకవర్గంతో పాటు పూడూరు మండలం నుంచి వచ్చే వాహనాలను మహావీర్‌ హాస్పిటల్‌ మీదుగా సూర్యప్రకా్‌షనగర్‌లో పార్కింగ్‌ చేసుకోవాలని సూచించారు. ఏ నియోజకవర్గం వారు ఎక్కడి పార్కింగ్‌ చేసుకోవాలనే విషయమై ప్రత్యేకంగా సైన్‌బోర్డులు ఏర్పాటు చేశామన్నారు. వీఐపీలు ఎంపీపీలు, జడ్పీటీసీలు, మునిసిపల్‌ చైర్మెన్లు, సొసైటీ చైర్మన్లకు డీఆర్‌వో పాస్‌లు జారీ చేస్తారన్నారు. తమ వాహనాలను కలెక్టరేట్‌ ఎదురుగా టీచర్స్‌ కాలనీలో పార్కింగ్‌ చేసుకోవాలని సూచించారు. కలెక్టరేట్‌ భవనంలో సీఎంతో జరిగే సమీక్షకుజిల్లా అధికారులకు మాత్రమే అనుమతి ఉంటుందని, మీడియాకు సభవద్ద ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేస్తామన్నారు. సభకు హాజరయ్యే వారు పాసులను తప్పకుండా ధరించాలని ఎస్పీ సూచించారు. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం వికారాబాద్‌ పర్యటన ప్రారంభమయ్యే ముందు పరిగి నుంచి వికారాబాద్‌ మార్గాన్ని మూసివేసి మన్నేగూడ మీదుగా దారి మళ్లిస్తామని చెప్పారు. హైదరాబాద్‌ నుంచి తాండూరు వైపు వచ్చే వాహనాలను మన్నేగూడ, పరిగి, కొడంగల్‌ మీదుగా మళ్లించనున్నట్లు తెలిపారు. 

సీఎం పర్యటన వివరాలు

ఎస్పీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌లో ల్యాండ్‌ అయిన తరువాత సీఎం కేసీఆర్‌ నేరుగా టీఆర్‌ఎస్‌ భవన్‌కు వెళ్లి ప్రారంభోత్సవం చేస్తారని,. అక్కడి నుంచి ఎన్‌టీఆర్‌ చౌరస్తా మీదుగా ఎమ్మెల్యే ఆనంద్‌ నివాసానికి వెళతారని, అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని ఎస్పీ చెప్పారు. అక్కడి నుంచి ఎన్నేపల్లిలో నిర్మించిన ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ను ప్రారంభించి, సీఎం అధికారులతో సమీక్ష నిర్వహిస్తారన్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగించనున్నట్లు చెప్పారు. సభ ముగిసిన తరువాత అక్కడి నుంచి నేరుగా హెలీప్యాడ్‌ వద్దకు వచ్చి హైదరాబాద్‌కు బయలుదేరి వెళతారన్నారు. ఒకవేళ ఆలస్యమైతే ఎన్నేపల్లి మీదుగా రోడ్డు మార్గంలో హైదరాబాద్‌ వెళతారని తెలిపారు.  కాగా 75వ స్వాతంత్య్ర వేడుకలను సోమవారం పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌ నిర్వహించడం జరుగుతుందని ఎస్పీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి ఒక్కరూ తమతమ ఇళ్లపై జాతీయ జెండాలను  ఎగురవేయాలన్నారు. 

సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన

వికారాబాద్‌ : ఈనెల 16న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ వికారాబాద్‌లో పర్యటిస్తున్న తరుణంలో చేవెళ్ల ఎంపీరంజిత్‌రెడ్డి వికారాబాద్‌లో ఆదివారం పర్యటించారు. కలెక్టర్‌ నిఖిల, ఎమ్మెల్యే మెతుకుఆనంద్‌, ఎస్పీ కోటిరెడ్డితో కలిసి ముఖ్యమంత్రి పర్యటించే ప్రదేశాలను పరిశీలించి ఏర్పాట్లకు సంబంధించి అధికారులతో మాట్లాడారు. పరేడ్‌ గ్రౌండ్‌తో పాటు టీఆర్‌ఎస్‌ భవన్‌, కలెక్టరేట్‌ ఆవరణను పరిశీలించారు. బహిరంగ సభ నిర్వహించే ప్రాంతాన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు. 

 మేడ్చల్‌లో సీఎం సభను విజయవంతం చేయాలి

మేడ్చల్‌,(ఆంధ్రజ్యోతిప్రతినిధి): ఈనెల17న మేడ్చల్‌ జిల్లాలో జరిగే ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నూతన కలెక్టరేట్‌ భవన  ఆవరణ, సభావేదిక వద్ద చేపట్టిన పనులను ఎమ్మెల్యేలు మైనంపల్లి, వివేకానంద, గాంధీ, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజులతో కలిసి పరిశీలించారు.  కలెక్టరేట్‌ ప్రారంభోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున బైక్‌ ర్యాలీతో పాటు దాదాపు 12 వేల మంది సమావేశానికి హాజరుకానున్నట్లు మంత్రి తెలిపారు.  నూతన కలెక్టరేట్‌కు చేరుకునే దారి పొడవునా స్వాగత ఏర్పాట్లపై చర్చించారు. 



Updated Date - 2022-08-15T05:27:26+05:30 IST