అనంత వ్యవసాయ మార్కెట్‌కు భారీ ఆదాయం

ABN , First Publish Date - 2022-06-30T05:57:14+05:30 IST

అనంతపురం వ్యవసాయ మార్కెట్‌కు చీనీ కాయలు రావడం రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మార్కెట్‌ కమిటీకి ఆదాయం భారీగా పెరుగుతోంది.

అనంత వ్యవసాయ మార్కెట్‌కు భారీ ఆదాయం
చీనీ మార్కెట్‌కు వచ్చిన చీనీ ఉత్పత్తులు

  చీనీ మార్కెట్‌తో ఏటా పెరుగుతున్న సంపద

మూడు నెలల్లో కోటి దాటిన వైనం


అనంతపురంరూరల్‌,జూన27: అనంతపురం వ్యవసాయ మార్కెట్‌కు చీనీ కాయలు రావడం రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మార్కెట్‌ కమిటీకి ఆదాయం భారీగా పెరుగుతోంది. మార్కెట్‌కు యూజర్‌ చార్జీలు రూపంలో వస్తున్న ఆదాయం బాగా పెరిగింది. ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన మూడు నెలల్లోనే చీనీ మార్కెట్‌ ద్వారా అనంత మార్కెట్‌ కమిటీ ఆదాయం రూ.కోటి దాటింది. ప్రస్తుతం జిల్లాలో ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఈ ఏడాది చీనీ మార్కెట్‌ ఆదాయమే కోటిన్నరకు పైగా వస్తుందని సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు. 


ఏటా మార్కెట్‌కు పెరుగుతున్న చీనీ కాయల రాక

జిల్లాలో దాదాపు 45వేల హెక్టార్లలో చీనీ పంట సాగులో ఉంది. ఈ నేపథ్యంలోనే చీనీ దిగుబడులు పెద్దగానే ఉంటున్నాయి. ఈక్రమంలో మార్కెట్‌కు చీనీ కాయలు రావడం ఏటా పెరుగుతోంది. సాధారణంగా అయితే ప్రతి ఏటా నవంబరు నుంచి ఆగస్టు వరకు చీనీ కాయల సీజన ఉంటుంది. దాదాపు ఏడాదిలో పది నెలలు చీనీ కాయలు మార్కెట్‌కు వస్తుంటాయి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి 7963 లాట్ల రూపంలో మార్కెట్‌కు 3.94లక్షల టన్నులు వచ్చాయి. ఈక్రమంలోనే మార్కెట్‌ అధికారులు యూజర్‌ చార్జీల రూపంలో రూ.వందకు ఒక శాతం వసూలు చేస్తున్నారు. దీంతో ఈ ఆర్థిక సంత్సరం నుంచి ఇప్పటి వరకు రూ.1.02కోట్ల ఆదాయం సమకూరింది. 


 రైతులకు కలిసోస్తున్న గ్రేడింగ్‌ లేకపోవడం

అనంత మార్కెట్‌లో చీనీ కాయలు గ్రేడింగ్‌ చేసే పరిస్థితి లేకపోడవం రైతులకు కలిసోస్తోంది. మార్కెట్‌ యార్డులో  చీనీకాయలు లోనికి వచ్చినప్పుడు వేబ్రిడ్జి ద్వారా తూకం వేసి అదే తూకం కోనుగోలు విలువ చెల్లింపులు చేస్తున్నారు. కమీషన మినహాయిస్తే ఎలాంటి సూట్‌ కూడా ఉండదు. రైతులు, అమ్మకపుదారులు గ్రేడింగు చేయకుండా తీసువచ్చిన సరుకును అవి ఏ మార్కెట్‌లో విక్రయించబడుతున్నాయో ఆ మార్కెట్‌కు పంపుతున్నారు. ఒక క్వింటా మార్కెట్‌కు తీసుకువచ్చినా కొనుగోలు చేసే వీలు ఇక్కడ కల్పించారు. ఈక్రమంలోనే మార్కెట్‌కు ఎక్కువగా కాయలు వస్తున్నాయి. 


మార్కెట్‌ను మరింత విస్తరించేందుకు చర్యలు: రామోహనరెడ్డి, ఎంపికశ్రేణి కార్యదర్శి, అనంతపురం వ్యవసాయ మార్కెట్‌. 

చీనీ మార్కెట్‌కు ఏటా కాయలు పెరుగుతున్నాయి. ఆశించిన స్థాయి కంటే అధికంగా వస్తున్నాయి. ఈక్రమంలో మార్కెట్‌కు యూజర్‌ చార్జీల రూపంలో ఆదాయం సమకూరుతోంది. దీనికితోడు మార్కెట్‌కు వచ్చిన రైతులకు, వ్యాపారులకు కాయలు విక్రయించిన వెంటనే డబ్బులు చెల్లించేవిధంగా చూస్తున్నాం. ఇటీవల కాలంలో డబ్బు చెల్లింపు సమస్యలు రాలేదు. జిల్లాతోపాటు, పక్క జిల్లాల నుంచి కాయలు మార్కెట్‌కు వస్తున్నాయి. రానున్న రోజుల్లో మార్కెట్‌ను మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. 


Updated Date - 2022-06-30T05:57:14+05:30 IST