Kuwait విమాన టికెట్ల ధరలకు రెక్కలు.. ప్రయాణికులకు చుక్కలు!

ABN , First Publish Date - 2021-09-11T18:16:24+05:30 IST

కువైత్ వెళ్లే ఆలోచనలో ఉంటే.. కొన్ని రోజులు దాన్ని వాయిదా వేసుకోవడం బెటర్.

Kuwait విమాన టికెట్ల ధరలకు రెక్కలు.. ప్రయాణికులకు చుక్కలు!

న్యూఢిల్లీ: కువైత్ వెళ్లే ఆలోచనలో ఉంటే.. కొన్ని రోజులు దాన్ని వాయిదా వేసుకోవడం బెటర్. ఎందుకంటే ప్రస్తుతం కువైత్‌ విమాన టికెట్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సాధారణ రోజులలో కంటే ప్రస్తుతం భారీగా పెరిగిన విమాన టికెట్ల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ నెల 7 నుంచి కువైత్, భారత్‌ మధ్య డైరెక్ట్ విమాన సర్వీసులు ప్రారంభమైన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న ప్రయాణికులకు కువైత్ వెళ్లేందుకు అవకాశం ఉంది. ఇక కరోనా కారణంగా నెలల తరబడి ఇరుదేశాల మధ్య విమాన సర్వీసులు నిలిచిపోవడంతో చాలా మంది ప్రవాసులు స్వదేశంలోనే చిక్కుకుపోయారు. ఇప్పుడు వారంతా ఒకేసారి కువైత్‌ వెళ్లేందుకు సిద్ధం కావడంతో తాజాగా ప్రారంభమైన సర్వీసులకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. 


ఇవి కూడా చదవండి..

అంగరంగ వైభవంగా NRI పెళ్లికి డెకరేషన్.. మధ్యలో షాకిచ్చిన కోర్టు..

Kuwait Cricket కీలక నిర్ణయం.. అక్కడ క్రికెట్ ఆడే Indian Students కు భారీ మేలు


ఇంకేముంది ఇదే లక్కీ ఛాన్స్ అని విమానయాన సంస్థలు టికెట్ ధరలను భారీగా పెంచేశాయి. దీంతో ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. దేశంలోని వివిధ నగరాల నుంచి కువైత్ వెళ్లే విమానాలకు వన్‌వేకే దాదాపు రూ. 1.5లక్షల మేర ధర పెరిగినట్లు సమాచారం. ఈ నగరాల జాబితాలో బెంగళూరు, ఢిల్లీ కూడా ఉన్నాయి. ఈ సెప్టెంబర్ మొత్తం బెంగళూరు నుంచి కువైత్ వెళ్లే విమాన టికెట్ల ధరలు దాదాపు లక్షకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. వివిధ ఎయిర్ లైన్ల వెబ్‌సైట్లు, ట్రావెల్ బుకింగ్ సైట్స్ ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం దేశంలోని వివిధ నగరాల నుంచి కువైత్‌కు వన్‌వే విమాన టికెట్ల ధరలు ఇలా ఉన్నాయి.

ఢిల్లీ టు కువైత్- రూ. 1,06,391 

హైదరాబాద్ టు కువైత్- రూ. 1,01,556 

కొచ్చి టు కువైత్- రూ. 1,04,640

ముంబై టు కువైత్- రూ. 1,02,511 


కాగా, కరోనాకు ముందు భారత్ నుంచి కువైత్‌కు విమాన టికెట్ల ధరలు రూ.17వేల నుంచి రూ.40వేల మధ్య ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే.. ప్రస్తుతం కువైత్ వెళ్లే ప్రయాణికులు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఆమోదించిన కరోనా వ్యాక్సిన్లలో ఏదో ఒకదానిని రెండు డోసులు తీసుకుని ఉండడం తప్పనిసరి. ఇప్పటివరకు డబ్ల్యూహెచ్ఓ ఆమోదం పొందిన కరోనా టీకాలు.. మొడెర్నా(mRNA-1273); ఫైజర్/బయోఎన్‌టెక్( BNT162b2); జాన్సన్ అండ్ జాన్సన్ (Ad26.COV2.S); ఆక్స్‌ఫర్డ్ అస్ట్రాజెనెకా(AZD1222); సినోఫార్మ్(BBIBP-CorV); భారత్‌కు చెందిన కోవిషీల్డ్. ఈ టీకాలలో ఏదో ఒకదానిని తీసుకున్న ప్రయాణికులు కువైత్ వెళ్లొచ్చు. అయితే, కువైత్ పౌరులు, వారి సమీప బంధువులు, వారి గృహా కార్మికులకు దీని నుంచి మినహాయింపు. 



Updated Date - 2021-09-11T18:16:24+05:30 IST