ఏపీలో భారీ ఎన్‌కౌంటర్‌

ABN , First Publish Date - 2021-06-17T08:34:35+05:30 IST

భారీ తుపాకీ మోతలతో ఏపీలోని విశాఖ ఏజెన్సీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

ఏపీలో భారీ ఎన్‌కౌంటర్‌

  • ఆరుగురు మావోయిస్టుల కాల్చివేత..
  • విశాఖ ఏజెన్సీలో హోరాహోరీ కాల్పులు
  • మృతుల్లో కరీంనగర్‌కు చెందిన సందె గంగన్న.. 
  • అగ్ర  నేతలు అరుణ, జగన్‌కు గాయాలు!


చింతపల్లి/కొయ్యూరు/సాలూరురూరల్‌/పెద్దపల్లి/ఓదెల, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): భారీ తుపాకీ మోతలతో ఏపీలోని విశాఖ ఏజెన్సీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కొయ్యూరు అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం 50 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఈస్ట్‌ డివిజన్‌ (విశాఖ)కు చెందిన సీనియర్‌ డీసీఎం, తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గుంపుల గ్రామానికి చెందిన సందె గంగన్న అలియాస్‌ అశోక్‌ (48), ఒడిసా మల్కన్‌గిరి జిల్లా కలిమెల బ్లాక్‌ టేక్‌గుడకు చెందిన ఈస్టు డివిజన్‌ డీసీఎం రణదేవ్‌ అలియాస్‌ అర్జున్‌ (31), కొరాపుట్‌ జిల్లా భాలైపుట్టు గ్రామానికి చెందిన ఏసీఎం సంతు నాచిక (28), ఛత్తీ్‌సగఢ్‌కు చెందిన దళ సభ్యురాలు పైకే (25), గూడెంకొత్తవీధి మండలం పేములగొందికి చెందిన దళ సభ్యురాలు, ఈస్టు డివిజన్‌ కార్యదర్శి అరుణ వ్యక్తిగత గార్డు లలిత (28) మృతిచెందారు. మృతిచెందిన మరో మహిళా సభ్యురాలిని గుర్తించాల్సి ఉంది. 


అరుణ గాయపడి, ఘటనాస్థలినుంచి తప్పించుకొన్నట్లు భావిస్తున్నారు. బుధవారం ఉదయం సుమారు 5:30 గంటల ప్రాంతంలో కొయ్యూరు మండలం యూ.చీడిపాలెం పంచాయతీ తీగలమెట్ట అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ జరుపుతున్న పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. పరస్పరం కాల్పులు, ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టుల వైపు నుంచి కాల్పులు ఆగిన తర్వాత ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. అక్కడ ఆరు మావోయిస్టు మృతదేహాలను గుర్తించారు. ఒక ఏకే 47, మరో ఎస్‌ఎల్‌ఆర్‌, ఒక కార్బన్‌ రైఫిల్‌, మూడు 303 తుపాకులు, ఒక తపంచాను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు నేతల్లో కొందరు గాయపడి తప్పించుకున్నారన్న సమాచారంతో కొయ్యూరు-జీకే వీధి సరిహద్దు అడవులను పోలీసులు జల్లెడపడుతున్నారు. ఈస్టు డివిజన్‌ కార్యదర్శి అరుణ, గాలికొండ ఏరియా కమిటీ కార్యదర్శి జగన్‌ అలియాస్‌ కాకూరి పండన్న కూడా గాయపడినవారిలో ఉన్నారని తెలుస్తోంది.  


పోలీసుల చిత్రహింసలతో సంఘ్‌ నుంచి వార్‌లోకి! 

పెద్దపల్లి/ఓదెల: ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన గంగన్నది మావోయిస్టుగా 22 ఏళ్ల ప్రస్థానం! ఆయన తొలుత హిందుత్వ వాది. గోదావరిఖనిలోని స్టేడియం సమీపంలో ఉన్న శ్రీ సరస్వతి విద్యానికేతన్‌లో (ఎల్‌బీనగర్‌) ఏడో తరగతి దాకా చదివారు. అప్పట్లో ఆర్‌ఎ్‌సఎ్‌సలో పనిచేస్తున్న గంగన్నను నాటి పెద్దపల్లి డీఎస్పీ లక్ష్మీకాంతారావు చిత్రహింసలకు గురిచేశారు. దీంతో గంగన్న తన సోదరుడి వరుస అయ్యే పెద్దపల్లి జిఆ్ల ఓదెల మండలం గూడెం గ్రామస్థుడు, స్పెషల్‌ జోనల్‌ కమిటీ కార్యదర్శి రాజమౌళి అలియాస్‌ ప్రసాదన్న స్ఫూర్తితో పీపుల్స్‌వార్‌ పార్టీతో సంబంధాలు పెట్టుకున్నారు. 1999లో పీపుల్స్‌వార్‌లో పూర్తిస్థాయి సభ్యుడిగా మారారు.


2000లో పెద్దపల్లి ఏరియా దళంలో మొదట సభ్యుడిగా చేరారు. మంథని, హుజూరాబాద్‌ ఏరియాల్లో యాక్షన్‌ కమిటీ సభ్యుడిగా కొనసాగారు. ఛత్తీ్‌సగఢ్‌కు వెళ్ళి అక్కడ డీసీఎంగా కొనసాగుతూ దళాల నిర్మాణంలో కీలకపాత్ర పోషించారు. దంతెవాడ ప్లాటూన్‌ కమాండర్‌గా కొనసాగుతున్న క్రమంలో తీవ్ర అనారోగ్యానికి గురై, విజయవాడలో చికిత్స పొందుతున్న గంగన్నను పట్టుకునేందుకు ఐదువందల మంది పోలీసులు గాలించగా, వారి నుంచి తప్పించుకెళ్ళినట్లు ప్రచారం జరిగింది. ఇప్పటిదాకా 19 ఎన్‌కౌంటర్ల నుంచి తప్పించుకున్న గంగన్న ఎదురు కాల్పుల్లో మృతిచెందాడంటే గ్రామస్థులు నమ్మలేకపోతున్నారు.  

Updated Date - 2021-06-17T08:34:35+05:30 IST