అనూహ్యంగా వచ్చిన వర్షాలతో భారీ నష్టం

ABN , First Publish Date - 2021-11-30T05:40:21+05:30 IST

అనూహ్యరీతిలో వచ్చిన వర్షాలకు జిల్లాకు భారీ నష్టం ఏర్పడిందని, యుద్ధ ప్రాతిపదికన సహాయ, పునరావాస చర్యలు చేపట్టామని కలెక్టర్‌ వి.విజయరామరాజు పేర్కొన్నారు.

అనూహ్యంగా వచ్చిన వర్షాలతో భారీ నష్టం
మీడియాతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ వి.విజయరామరాజు

యుద్ధప్రాతిపదికన సహాయ, పునరావాస చర్యలు

దాతలకు ధన్యవాదాలు

మీడియా సమావేశంలో కలెక్టర్‌ వి.విజయరామరాజు

కడప(కలెక్టరేట్‌), నవంబరు 29 : అనూహ్యరీతిలో వచ్చిన వర్షాలకు జిల్లాకు భారీ నష్టం ఏర్పడిందని, యుద్ధ ప్రాతిపదికన సహాయ, పునరావాస చర్యలు చేపట్టామని కలెక్టర్‌ వి.విజయరామరాజు పేర్కొన్నారు. భారీ వర్షాలు, వరదలు, సహాయక, పునవావాస చర్యలు, జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలపై సోమవారం కలెక్టరేట్‌లోని స్పందన హాలులో జాయింట్‌ కలెక్టర్లు ఎం.గౌతమి, సీఎం సాయికాంత వర్మ, ధ్యానచంద్ర, డీఆర్వో మలోలతో కలసి కలెక్టర్‌ మీడియా సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో నవంబరు మాసంలో సాధారణం కంటే అత్యధికంగా నమోదైందన్నారు. అధిక వర్షపాతం వల్ల చిత్రావతి, గండికోట, మైలవరం, వెలిగల్లు, బుగ్గవంక, అన్నమయ్య సాగర్‌, సోమశిల రిజర్వాయర్లకు అధికంగా ఇనఫ్లో వచ్చిందన్నారు. వరదల వల్ల 29 మంది ప్రాణాలు కోల్పోగా, 13 మంది గల్లంతు అయ్యారన్నారు. మృతులకు పరిహారం చెల్లించామన్నారు. గల్లంతయిన వారికి కూడా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి ఎక్స్‌గ్రేషియా చెల్లించడం జరిగిందన్నారు. ఈ ఖరీఫ్‌, రభీలలో 1,42.949 హెక్టార్లలో వ్యవసాయ పంటలు దెబ్బతినగా దాదాపు రూ.1294 కోట్ల నష్టం ఏర్పడిందన్నారు. ఉద్యాన పంటలు 17,704 హెక్టార్లలో దెబ్బతిని రూ.110.22 కోట్లు నష్టం వాటిల్లిందన్నారు. దాదాపు 3914 పశు నష్టం జరిగిందన్నారు. రాజంపేటలో బాగా దెబ్బతిన్న 12 గ్రామాల్లో విద్యుత వాటర్‌, రహదారులను పునరుద్ధరించామన్నారు. 12 గ్రామల్లో లాంగ్‌ రిలీఫ్‌ కోసం 6 మంది డిప్యూటీ కలెక్టర్లను రెండు నెలల పాటు ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. ప్రతి మంగళ, శనివారాల్లో వారు అక్కడే ఉండి రేషన కార్డులు, తక్షణ సాయం, నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకుంటారన్నారు. జిల్ల్లాలో గుడిసెలు, పక్కాగృహాలు 611 వరకు పూర్తిగా దెబ్బతిన్నాయని, 6 గ్రామ పంచాయతీల్లో 425 గృహాలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. పులపత్తూరు, తోగూరుపేటల్లో జర్మన షెడ్లు వేశామని, మరో 2, 3 నెలల పాటు అలాగే ఉంటాయన్నారు. ఇళ్లల్లో పేరుకున్న బురధను సకాలంలో తొలగించిన ఫైర్‌ సిబ్బందిని కలెక్టర్‌ అభినందించారు. ఆరుగ్రామాల్లో రేషనకార్డులు, పింఛను, జాబ్‌ కార్డులు డూప్లికేట్‌  ప్రింట్‌ చేసి ఇచ్చామన్నారు. స్వచ్ఛంద సంస్థలతో పాటు వరద బాధితులకు సాయం చేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.


ప్రతి వరదబాధితుని సమస్య పరిష్కరించాలి : సీఎం

జవాద్‌ తుఫాను ప్రభావంతో వచ్చిన వరదతో దెబ్బతిన్న ప్రతి ఒక్కరి సమస్యలు పరిష్కరించాలని సీఎం వైఎస్‌ జగనమోహనరెడ్డి ఆదేశించారు. సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాయం నుంచి ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్సు ద్వారా వరద ప్రభావిత ప్రాంతాల్లో అందుతున్న సహాయక చర్యలపై నెల్లూరు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల కలెక్టర్లతో సమీక్షించారు. కడప కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్సలో కలెక్టర్‌ విజయరామరాజుతో పాటు జేసీలు పాల్గొన్నారు. నిత్యవసరాల పంపిణీ, రూ.2 వేల ఆర్థిక సాయం, సహాయ శిబిరాలు, ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు పరిహారం, తదిరత విషయాలపై ముఖ్యమంత్రి సమగ్రంగా చర్చించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వారం రోజుల్లోనే పునరావాస కేంద్రాలు, సహాయక చర్యలు అందించిన కలెక్టర్‌ విజయరామరాజును అభినందించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ వరదల్లో నష్టపోయిన 2580 గృహాలకు సంబంధించి పరిహారం అందించామన్నారు. పూర్తిగా ఇళ్లు కోల్పోయిన 611 కుటుంబాలకు రూ.95,100 పరిహారంతో పాటు రూ..1.8 లక్షలతో పక్కాగృహాలు నిర్మించడానికి 5 ఎకరాల లేఅవుట్‌ గుర్తించామన్నారు. జిల్లాలో 7827 వరద కుటుంబాలకు రూ.2 వేలతో పాటు ఉచితరేషన అందజేశామని, అన్నమయ్య ప్రాజెక్టు పరిధిలోని 6 గ్రామ పంచాయతీలల్లో 405 తాత్కాలిక గృహాలు, జర్మన షెడ్లను నిర్మించామని సీఎంకు వివరించారు.

Updated Date - 2021-11-30T05:40:21+05:30 IST