బడ్జెట్‌కు భారీ కోత!

ABN , First Publish Date - 2020-03-27T09:21:34+05:30 IST

రాష్ట్ర బడ్జెట్‌ భారీగా తగ్గింది. ఏటా బడ్జెట్‌ ప్రతిపాదనలు పెంచి చట్టసభల్లో ప్రవేశపెట్టడం రివాజుగా ఉంటుంది. కానీ ఈ సారి అందుకు భిన్నమైన పరిస్థితి...

బడ్జెట్‌కు భారీ కోత!

  • ప్రస్తుత బడ్జెట్‌ ప్రతిపాదనల కంటే వచ్చే ఏడాదికి రూ.40వేల కోట్ల తగ్గింపు
  • వాస్తవిక అంచనాలతో రూపొందించనున్న ప్రభుత్వం


అమరావతి, మార్చి 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర బడ్జెట్‌ భారీగా తగ్గింది. ఏటా బడ్జెట్‌ ప్రతిపాదనలు పెంచి చట్టసభల్లో ప్రవేశపెట్టడం రివాజుగా ఉంటుంది. కానీ ఈ సారి అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. ప్రస్తుత (2019-20) ఆర్థిక సంవత్సరానికి అట్టహాసంగా రూ.2,27,975 కోట్ల జంబో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇందులో దాదాపు రూ.38,000 కోట్ల నుంచి రూ.40,000 కోట్ల వరకూ కోత విధించి వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21) బడ్జెట్‌ ప్రతిపాదించనున్నట్లు సమాచారం. జంబో బడ్జెట్లను రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ భరించలేదనే విషయం బోధపడిన తర్వాత వచ్చే ఆర్థిక సంవత్సరానికైనా వాస్తవిక అంచనాలతో బడ్జెట్‌ రూపొందించాలని భావించిన ప్రభుత్వం ఆ మేరకు చర్యలు తీసుకుంటోంది. ఆ బడ్జెట్‌ రూ.1.88 లక్షల కోట్ల నుంచి రూ.1.90 లక్షల కోట్ల వరకూ ఉండే అవకాశాలున్నాయి. ఈ బడ్జెట్‌ను 4 భాగాలుగా విభజించి మొదటి 3 నెలలకు అవసరమైన బడ్జెట్‌ను ఆర్డినెన్సు రూపంలో తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఆర్డినెన్స్‌ ద్వారా ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకూ బడ్జెట్‌కు అనుమతి వస్తుంది. ఆ తర్వాత రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గిపోతే జూలైలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. 


జీఎస్టీ దెబ్బ భారీగానే..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏపీ బడ్జెట్‌ అంచనాలు తలకిందులయ్యాయి. వాస్తవిక అంచనాలు తెలిసి కూడా ఇచ్చిన హామీల నుంచి వెనక్కువెళ్లలేక, కేంద్రం సాయం చేస్తుందన్న ఆశతో జంబో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. కానీ, బడ్జెట్‌ అంచనాలకు, వాస్తవిక గణాంకాలకు దాదాపు రూ.90వేల కోట్ల వరకూ తేడా వచ్చింది. చివరి త్రైమాసికంలో కేంద్రం కనికరించి దాదాపు రూ.13వేల కోట్ల మేర అప్పులు తెచ్చుకునేందుకు అనుమతివ్వడంతో ఏపీకి గండం తప్పింది! లేదంటే వేతనాలు, పెన్షన్లకు కూడా కటకటలాడాల్సిన పరిస్థితి వచ్చేది. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.60వేల కోట్ల అప్పులు చేసింది. కానీ, బడ్జెట్‌ అంచనాల్లో అప్పులను కేవలం రూ.35వేల కోట్లుగానే చూపించింది. ఈ ఎదురుదెబ్బలన్నీ గుర్తుంచుకున్న ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్‌కు భారీగా కోత విధించింది. అయినప్పటికీ ఆ అంచనాలు కూడా తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయని ఆర్థికశాఖ అధికారులు చెప్తున్నారు.  కేంద్రం రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీని కరోనా కోసం ప్రకటించింది. దీంతో కేంద్రం వద్ద ఉన్న నిధులు కరోనా కట్టడికి ఉపయోగించడం, పైగా లాక్‌డౌన్‌ కారణంగా జీఎస్టీ నిధులూ నిలిచిపోవడం వల్ల రాష్ట్రాలకు కేంద్రం నిధులిచ్చే పరిస్థితులు ఉండవని భావిస్తున్నారు. ఏపీ బడ్జెట్‌ ప్రధానంగా జీఎస్టీ ఆధారంగా నడిచే బడ్జెట్‌ కాబట్టి కేంద్రం నుంచి జీఎస్టీ ఆదాయాలు నిలిచిపోతే మరోసారి ఏపీలో నిధులకు ఇబ్బంది ఏర్పడుతుందని ఆర్థికశాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు. 


Updated Date - 2020-03-27T09:21:34+05:30 IST