ఫిర్యాదు వెనుక పెద్ద కుట్ర!

ABN , First Publish Date - 2020-06-05T05:58:14+05:30 IST

పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం గోదావరి నదిపై పలు ప్రాజెక్టులు నిర్మిస్తున్నదంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గోదావరి నదీయాజమాన్య బోర్డుకు ఇటీవల ఫిర్యాదు చేసింది...

ఫిర్యాదు వెనుక పెద్ద కుట్ర!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వ్యూహాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం గోదావరిపై చేపట్టిన ప్రాజెక్టుల వివరాలు అడిగి పంజరంలోకి లాగాలని చూస్తున్నది. చిత్తశుద్ధి ఉంటే ముందు ఆంధ్రప్రదేశ్‌ ప్రాజెక్టుల వివరాలు గోదావరి నదీయాజమాన్య బోర్డుకు సమర్పించిన లేఖలోనే ఇవ్వాల్సింది. ఇప్పుడు ఈ గోదావరి వివాదంలోకి లాగి సుమారు 250టీఎంసి వరకు అవసరానికంటే ఎక్కువ నికరజలాలు కేటాయించుకోవాలని చూస్తున్నారు. ఎక్కువ నికరజలాలు ఉంటేనే గోదావరి అవార్డు సెక్షన్‌ 4ప్రకారం ఇతర బేసిన్‌ (కృష్ణాగాని, పెన్నాగాని)కు తరలించుకొనిపోవచ్చు.


పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం గోదావరి నదిపై పలు ప్రాజెక్టులు నిర్మిస్తున్నదంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గోదావరి నదీయాజమాన్య బోర్డుకు ఇటీవల ఫిర్యాదు చేసింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం (225 టీఎంసి), గోదావరి ఎత్తిపోతల పథకం (22టీఎంసి), సీతారామ ఎత్తిపోతల పథకం (70 టీఎంసి), తుపాకుల గూడెం (100 టీఎంసి), త్రాగునీరు ప్రాజెక్టు (23.76 టీఎంసి), లోయర్‌ పెన్‌గంగ ప్రాజెక్టుల్లో భాగమైన రాజుపేట్, చనాకా–కొరట, పింపార్డ్‌, రామప్ప –పాకల డైవర్షెన్‌ (3 టీఎంసి) పథకం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఫిర్యాదులో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు శ్రీరామ్‌ సాగర్‌ కింద, పోలవరం పైన ఎలాంటి సమగ్ర పరిశీలన లేకుండా కట్టడం వలన క్రింది ప్రాజెక్టులపై దుష్ప్రభావం పడుతుందని ఆం.ప్ర. ఆరోపించడం విస్మయానికి గురిచేస్తున్నది.


ఈ సందర్భంలో గోదావరి నదీజలాల ట్రిబ్యునల్‌ గురించి కొంత అవగాహన అవసరం. గోదావరి నది సహాద్రిలో మూడున్నరవేల అడుగుల ఎత్తున మహారాష్ట్ర నుండి సుమారు 1465 కి.మీ. ప్రయాణించి ఆం.ప్ర.లోని ధవళేశ్వరం బరాజ్‌ కింద సముద్రంలో కలుస్తున్న విషయం తెలిసిందే. పరీవాహక ప్రాంతం 1,20,777 చదరపు మైళ్ళలో దాదాపు సగభాగం (59, 104 చ.మై) మహారాష్ట్రలో ఉంది. భారతప్రభుత్వం గోదావరి ట్రిబ్యునల్‌ను వివిధ రాష్ట్రాల మధ్య పంపకం, న్యాయ నిర్ణయం కోసం 1968లో ఏర్పరిచింది. రాష్ట్రాల వాదనలు, ప్రతిపాదనలు, అవసరాలు పరిశీలించిన పిమ్మట ట్రిబ్యునల్‌ 1980లో తుది నిర్ణయాన్ని ప్రకటించింది. కృష్ణా ట్రిబ్యునల్‌ చైర్మన్‌గా ఉన్న బచావతే గోదావరి ట్రిబ్యునల్‌కు కూడా చైర్మన్‌. కృష్ణా ట్రిబ్యునల్‌లో వివిధ రాష్ట్రాల మధ్య తీవ్రమైన వాదోపవాదాల తర్వాత 1976లో తుది తీర్పు వెలువడింది.


అక్కడి వాతావరణం గమనించిన రాష్ట్రాలు (ఇందులో మహారాష్ట్ర, కర్ణాటక, ఆం.ప్ర. రాష్ట్రాలు రెండు ట్రిబ్యునల్స్‌లో భాగస్వాములు) గోదావరిలో పుష్కలమైన నీటి లభ్యత ఉండడం వలన పరస్పర చర్చలు జరుపుకొని ద్వైపాక్షిక, త్రైపాక్షిక ఒప్పందాలు చేసుకొని ట్రిబ్యునల్‌కు సమర్పించాయి. ఎప్పుడైతే రాష్ట్రాలు పరస్పర ఒప్పందాలు చేసుకున్నవో వాటినే ట్రిబ్యునల్‌ ఆమోదించి అవార్డుగా ప్రకటించింది. ఈ ఒప్పందాలలో చాలావరకు రాష్ట్రాలు వారి పరిధిలోని ప్రవాహాన్ని కొంతదూరం మేరకు పూర్తిహక్కులు, తర్వాత ఒప్పంద పరిమితులను దాటడంగా క్రిందికి ప్రవహించేట్టు చేసుకున్నవే. మిగిలిన జలాలన్నీ ఆం.ప్ర. (ఉమ్మడి)కు రావలసిందే. కృష్ణా ట్రిబ్యునల్‌లో బచావత్‌ నీటి పరిమాణాన్ని నిర్ణయించిండు. అదే గోదావరిలో రాష్ట్రాల పరస్పర ఒప్పందాల మూలాన మొత్తం బేసిన్‌ నీటి పరిమాణాన్ని నిర్ణయించలేదని గమనించాలి.


గోదావరి అవార్డు ప్రకటించిన తరువాత నాటి ఆం.ప్ర. ఇంజనీర్లు గోదావరిలో మొత్తం మూడువేల టీఎంసిల నీటి లభ్యత ఉందని, పై రాష్ట్రాల వాడకం తర్వాత 75శాతం విశ్వసనీయతతో 1485టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని అంచనా కట్టారు. ఈ లెక్క కూడా ఇతర రాష్ట్రాలు 1969లో ట్రిబ్యునల్‌ ముందు సమర్పించిన రిపోర్టుల ప్రకారం చేయబడింది. గోదావరి అవార్డు 1980లో ప్రకటించారు. ఈ మధ్యకాలంలో ఇతర రాష్ట్రాలు ఎన్నో ప్రాజెక్టులు చేపట్టినవి, వాటి వివరాలు సంపూర్ణంగా తీసుకోబడలేదని భావిస్తున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ 2004లో వాప్కోస్‌ సంస్థతో గోదావరి జలాల లభ్యతను లెక్కిస్తే, మొత్తం 3215 టీఎంసీల నికరజలాలు ఉన్నవనీ, అందులో ఆం.ప్ర.కు 1435 నికరజలాలు లభిస్తాయని అది అంచనావేసింది. ఇది కూడా ఇతర రాష్ట్రాల వినియోగాలను సంపూర్ణంగా పరిగణించలేదని భావిస్తున్నాను. అలాగే, నేషనల్‌ వాటర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ నదుల అనుసంధానం కోసం నీటి లభ్యతలు లెక్కించినపుడు గోదావరిలో నికరజలాలు 3300 టీఎంసిలు 75శాతం విశ్వసనీయతతో ఉన్నదని నిర్థారించింది.


గోదావరి అవార్డులో ప్రధానంగా సింగూర్‌, నిజాం సాగర్‌, ఇచ్చంపల్లి ప్రాజెక్టుల నీటి పరిమాణాలు పేర్కొన్నారు కానీ, ఏ ఇతర భారీ ప్రాజెక్టుల నీటి పరిమాణం, వినియోగం నిర్దేశింపబడలేదు. జనబాహుళ్యంలో ఉన్న 1480 టీఎంసిలు ఈ అవార్డులో ఎక్కడా పేర్కొనలేదు. కృష్ణా అవార్డు (క్లాజ్‌ 13) ప్రకారం బేసిన్‌ రాష్ట్రాలు ప్రతి సంవత్సరం కృష్ణానదిలో వారివారి వాడక సారాంశాన్ని ఇచ్చిపుచ్చుకోవాల్సి ఉంది. కానీ, గోదావరి అవార్డులో బేసిన్‌ రాష్ట్రాలు రికార్డులు ఇచ్చిపుచ్చుకొనే అంశాన్ని చేర్చలేదు. ఇంతవరకు మనకు మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌, ఒరిస్సా రాష్ట్రాల అసలు వివరాలు తెలువవు. కాబట్టి, మన నీటి లభ్యత అసలు ఎంతో ఆమోదిత నిర్థారణ జరగలేదు. కాబట్టి, తెలంగాణ ప్రభుత్వం గోదావరినదిపై ప్రాజెక్టు వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు.


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వ్యూహాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం గోదావరిపై చేపట్టిన ప్రాజెక్టుల వివరాలు అడిగి ఒక పంజరంలోకి లాగాలని చూస్తున్నది. చిత్తశుద్ధి ఉంటే ముందు ఆంధ్రప్రదేశ్‌ ప్రాజెక్టుల వివరాలు గోదావరి నదీయాజమాన్య బోర్డుకు సమర్పించిన లేఖలోనే ఇవ్వాల్సింది. ఉమ్మడి రాష్ట్రంలోనే 1480 టీఎంసిలలో తెలంగాణకు 954 టీఎంసిలు అని లెక్క కట్టారు. అప్పుడు లెక్కవేసిన ఇంజనీర్లే ఇప్పుడు 776 టీఎంసి సామర్థ్యం గల ప్రాజెక్టులు చేపట్టామని తెలియపర్చడం వెనుక ఒక వ్యూహం పన్నారని అనిపిస్తున్నది. ఇప్పుడు ఈ గోదావరి వివాదంలోకి లాగి సుమారు 250టీఎంసి వరకు అవసరానికంటే ఎక్కువ నికరజలాలు కేటాయించుకోవాలని చూస్తున్నారు. ఎక్కువ నికరజలాలు ఉంటేనే గోదావరి అవార్డు సెక్షన్‌ 4ప్రకారం ఇతర బేసిన్‌ (కృష్ణాగాని, పెన్నాగాని)కు తరలించుకొని పోవచ్చు. పైన చెప్పుకొన్న కృష్ణా అవార్డును దృష్టిలో పెట్టుకొనే ఆంధ్రప్రదేశ్‌ ముందుచూపుతో, ఇప్పుడు గోదావరి జలాల లెక్కకోసమే తెలంగాణ ప్రాజెక్టులపై అభ్యంతరాలు తెలుపుతున్నదని గమనించాలి.

కొండపల్లి వేణుగోపాల్‌ రావు

(రిటైర్డ్‌ చీఫ్‌ ఇంజనీర్‌)

Updated Date - 2020-06-05T05:58:14+05:30 IST