విభేదాలకు Shinde-Uddav Thackeray స్వస్తి..? Bjp మధ్యవర్తిత్వం..??

ABN , First Publish Date - 2022-07-17T20:03:03+05:30 IST

శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray), ఆ పార్టీ తిరుగుబాటు వర్గం నేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) మధ్య నెలకొన్న

విభేదాలకు Shinde-Uddav Thackeray స్వస్తి..? Bjp మధ్యవర్తిత్వం..??

ముంబై: శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray), ఆ పార్టీ తిరుగుబాటు వర్గం నేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) మధ్య నెలకొన్న విభేదాల పరిష్కారం కోసం త్వరలోనే ఉభయులు సమావేశం కానున్నారా? అవుననే చెబుతున్నారు శివసేన నేత దీపాలి సయ్యద్. రాబోయే రెండు రోజుల్లో వారిరువురూ చర్చల కోసం సమావేశం కానున్నారని, ఇద్దరు నేతల మధ్య సయోధ్యకు బీజేపీ తనవంతు కృషి చేయనుందని ఆమె ఓ ట్వీట్‌లో తెలిపారు.


''శివసైనికుల మనోభావాలను గౌరవిస్తూ రోబోయే రెండు రోజుల్లో ఉద్ధవ్ థాకరే, ఏక్‌నాథ్ షిండేలు కలిసి తొలిసారి సమావేశం కానున్నారని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది'' అని ఆ ట్వీట్‌లో దీపాలి సయ్యద్ తెలిపారు. శివసైనికుల మనోభావాలను షిండే అర్ధం చేసుకున్నారని, పార్టీ అధిపతిగా ఉద్ధవ్ పెద్దమనసుతో ఉన్నారని అన్నారు. మధ్యవర్తిత్వం నెరపుతున్నందుకు బీజేపీకి కృతజ్ఞతలు తెలిపారు. థాకరే, షిండేల మధ్య సమావేశం ఎప్పుడు, ఎక్కడ జరగనుందనే విషయాన్ని మాత్రం ఆమె స్పష్టం చేయలేదు.


దీనికి ముందు, శివసేన పార్లమెంటు సభ్యులు సైతం ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు సేన వర్గంతోనూ, మాజీ భాగస్వామి బీజేపీతోనూ సంబంధాలు పునరుద్ధరించాలని ఉద్ధవ్ థాకరేకు విజ్ఞప్తి చేశారు. మహావికాస్ అఘాడి అసహజ కూటమి అని, శివసేనకు బీజేపీ సహజ భాగస్వామి అని సేన ఎంపీ హేమంత్ గాడ్సే అన్నారు. ముంబైలో ఉద్ధవ్ నివాసంలో ఎంపీలు కలిసినప్పుడు కూడా ఈ విషయాన్ని ఆయన ముందు ప్రస్తావించారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే తరఫున పోటీలో ఉన్న ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని వారు థాకరేకు విజ్ఞప్తి చేశారు. అనంతరం క్రమంలో ద్రౌపది ముర్ముకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని ఉద్ధవ్ ప్రకటించారు. ఇదే సమయంలో ద్రౌపది ముర్ముకు మద్దతివ్వడమంటే బీజేపీకి సపోర్ట్ ఇవ్వడం కాదన్నారు.

Updated Date - 2022-07-17T20:03:03+05:30 IST