గంగూలీ బయోపిక్‌.. సౌరవ్ పాత్రలో హృతిక్ రోషన్!

ABN , First Publish Date - 2020-09-18T00:18:31+05:30 IST

సౌరవ్ గంగూలీ.. టీమిండియా విజయవంతమైన కెప్టెన్లలో ఒకడు. 2003లో పలు అంచనాల మధ్య ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన భారత

గంగూలీ బయోపిక్‌.. సౌరవ్ పాత్రలో హృతిక్ రోషన్!

ముంబై: సౌరవ్ గంగూలీ.. టీమిండియా విజయవంతమైన కెప్టెన్లలో ఒకడు. 2003లో పలు అంచనాల మధ్య ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన భారత జట్టును ఫైనల్‌కు నడిపించడంలో గంగూలీ కీలక పాత్ర పోషించాడు. జట్టుకు దూకుడు నేర్పి విజయాల బాట పట్టించాడు.


విదేశీ గడ్డపైనా చారిత్రాత్మక విజయాలు అందించాడు. గంగూలీ కెప్టెన్సీలో ఆడిన ధోనీ కూడా విజయవంతమైన టీమిండియా సారథిగా ఎదిగాడు. ఇప్పటికే అతడి బయోపిక్ తెరకెక్కింది. ప్రస్తుతం బీసీసీఐ చీఫ్‌గా ఉన్న గంగూలీ బయోపిక్‌ కూడా తెరకెక్కబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.


గంగూలీ బయోపిక్‌లో బాలీవుడ్ ప్రముఖ నటుడు హృతిక్ రోషన్ లీడ్ రోల్ పోషించబోతున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంలో పూర్తిగా స్పష్టత లేకున్నప్పటికీ ఇంటర్నెట్‌లో మాత్రం ఊహాగానాలకు తెరపడడం లేదు. తాజాగా నటి నేహా ధూపియాతో జరిగిన చాట్ షోలో గంగూలీ తన బయోపిక్‌పై వస్తున్న వార్తలపై స్పష్టత ఇచ్చాడు. 


తన బయోపిక్‌లో హృతిక్ నటిస్తే బాగానే ఉంటుందన్న గంగూలీ.. అయితే, ఇందుకోసం హృతిక్ తన శరీర సౌష్టవాన్ని తనలా మార్చుకోవాల్సి ఉంటుందన్నాడు. తొలుత ఈ షోలో గంగూలీ మాట్లాడుతూ తన పాత్రను పోషించేవారు ఉన్నారని తాను అనుకోవడం లేదన్నాడు.


అప్పుడు నేహా ధూపియా కల్పించుకుని హృతిక్ రోషన్ ఇంచుమించు మీలానే ఉంటారని చెప్పింది. దీనికి సౌరవ్ స్పందిస్తూ హృతిక్ శరీర సౌష్టవం చాలా బాగా ఉంటుందని, ఎవరైనా అతడిలా కండలు పెంచాలని కోరుకుంటారని పేర్కొన్నాడు. అతడు తన పాత్రను పోషించాలంటే తొలుత తనలా మారాల్సి ఉంటుందన్నాడు. అయితే, బయోపిక్ వస్తుందన్న విషయాన్ని గంగూలీ నిర్ధారించనప్పటికీ, ఉన్నట్టు మాత్రం కొంత హింట్ ఇచ్చాడు.  


 

Updated Date - 2020-09-18T00:18:31+05:30 IST