ప్రజల వద్దకే మానవ హక్కుల కమిషన్‌

ABN , First Publish Date - 2022-06-30T06:22:01+05:30 IST

ప్రజల వద్దకే వచ్చి సమస్యలను వారి కోణం నుంచి విని పరిష్కారం చేసేందుకు జిల్లా పర్యటనలు చేస్తున్నట్టు మానవ హక్కుల కమిషన్‌ చైౖర్మన్‌ జస్టిస్‌ మాంధాత సీతారామమూర్తి చెప్పారు.

ప్రజల వద్దకే మానవ హక్కుల కమిషన్‌
మాట్లాడుతున్న సీతారామమూర్తి

చైర్మన్‌ సీతారామమూర్తి
రాజమహేంద్రవరం అర్బన్‌, జూన్‌ 29 : ప్రజల వద్దకే వచ్చి సమస్యలను వారి కోణం నుంచి విని పరిష్కారం చేసేందుకు జిల్లా పర్యటనలు చేస్తున్నట్టు మానవ హక్కుల కమిషన్‌ చైౖర్మన్‌ జస్టిస్‌ మాంధాత సీతారామమూర్తి చెప్పారు. రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో బుధవారం క్యాంపు కోర్టు నిర్వహించారు. అనంతరం రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ జిల్లా అధికారులు, మానవ హక్కుల కార్యకర్తలకు మానవ హక్కుల పరిరక్షణ అంశాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్‌ మాంధాత సీతారామమూర్తి, సభ్యులు గోచిపాత శ్రీనివాసరావు, సెక్రటరీ అండ్‌ సీఈవో సంపర వెంకటరమణ మూర్తి పాల్గొని వివిధ అంశాలపై విశదీకరించారు. ఈ సందర్భంగా కమిషన్‌ ఛైర్మన్‌ సీతారామమూర్తి మాట్లాడుతూ సావధాన చిత్తంతో, సహృదయంతో ప్రజల సమస్యలను వారి కోణంలో ఆలకించి పరిష్కరించాలన్నారు. రాజ్యాంగ పరమైన, చట్టపరమైన, రాజకీయపరమైన అన్ని హక్కులు మానవీయకోణం ఉన్న అన్ని అంశాలు మానవ హక్కుల కిందకే వస్తాయని అన్నారు. ప్రజలకు రాజ్యాంగం ద్వారా కలిగిన హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వ అధికారులు అంకితభావంతో పనిచేయాలని కోరారు. ప్రభుత్వ వ్యవస్థలన్నీ ఒత్తిడితో పనిచేస్తున్నాయని, నిజానికి కార్యాలయాల్లో సిబ్బంది కొరత ఉందని, ప్రజలకు సేవలు అందజేయడానికి అధికారులు కొద్ది గంటలు అదనంగా పనిచేస్తే దీన్ని అధిగమించవచ్చని అన్నారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తున్న సంస్థలు జాతీయ, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ పేర్లు స్ఫురించేలా తమ సంస్థ పేర్లను పెట్టుకోకూడదని ఆయన తెలిపారు. కాగా, రాజమహేంద్రవరంలో బుధవారం రెవెన్యూ, పోలీస్‌, పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ తదితర శాఖలకు చెందిన మొత్తం కేసులకు సంబంధించి ఆయా శాఖల అధికారులు, ఫిర్యాదుదారులతో హియిరింగ్‌ నిర్వహించామని వీటిలో 17 కేసులు రాగా 16 కేసుల వాదనలు విని, ఒక కేసు గురువారానికి వాయిదా వేసినట్లు కమిషన్‌ కార్యాలయం తెలిపింది. జేసీ శ్రీధర్‌, ఆర్డీవో మల్లిబాబు, ఇతర జిల్లా అధికారులు, క్యాంపు కోర్టు నోడల్‌ అధికారి, కమిషన్‌ కార్యాలయం అధికారులు, సిబ్బంది, మానవ హక్కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-30T06:22:01+05:30 IST