ఏపీలో ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ పెంపు

ABN , First Publish Date - 2022-01-30T00:16:41+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ 8 శాతం నుంచి 16 శాతానికి పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీలో ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ పెంపు

అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ 8 శాతం నుంచి 16 శాతానికి పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో హెచ్‌వోడీ ఆఫీసుల్లో ఉద్యోగుల హెచ్ఆర్‌ఏపై జీవో జారీ చేసింది. హైదరాబాద్‌ నుంచి వచ్చిన అన్ని హెచ్‌వోడీ ఆఫీసుల్లో ఉద్యోగులకు 16 శాతం హెచ్‌ఆర్‌ఏ వర్తించనుంది. గతంలో ఉద్యోగుల కార్యక్షేత్రం జనాభా ప్రాతిపదికన నాలుగు కేటగిరీల్లో హెచ్‌ఆర్‌ఏను నిర్ణయించిన విషయం తెలిసిందే. గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలో ఏర్పాటైన రాష్ట్ర  సచివాలయం, హెచ్‌వోడీ ఉద్యోగులకు గత ప్రభుత్వ హయాంలో  సచివాలయం, హెచ్‌వోడీల ఉద్యోగులకు 30 శాతం హెచ్‌ఆర్‌ఏ లభించేది. విభజనకు ముందు హైదరాబాద్‌లో అమలైన హెచ్‌ఆర్‌ఏనే వీరికి కొనసాగించారు. 


ఇప్పుడు దీనిని 16శాతానికి కుదించారు. అంటే... వీరందరికీ 14 శాతం కోత పడినట్లే. ఇక... గుంటూరు, విశాఖ, నెల్లూరు, విజయవాడ నగరాల్లోని ప్రభుత్వ సిబ్బందికి గతంలో 20 శాతం హెచ్‌ఆర్‌ఏ వచ్చేది. దీనిని 16శాతానికి కుదించారు. రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లో 14.5 హెచ్‌ఆర్‌ఏ ఉండగా... దానిని 8 శాతానికి కుదించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగులకు 12 శాతం ఉన్న హెచ్‌ఆర్‌ఏ ఇప్పుడు 8 శాతానికి దిగిపోయింది. రాష్ట్రంలో నాలుగు పట్టణాలు మినహా... అన్ని గ్రామాలు, మున్సిపాల్టీలలో పని చేసే సిబ్బందికి ఇకపై 8 శాతం హెచ్‌ఆర్‌ఏ మాత్రమే లభిస్తుంది. 50 లక్షలపైగా ఉన్న జనాభా ఉన్న నగరాల్లో పని చేసే సిబ్బందికి 24 శాతం హెచ్‌ఆర్‌ఏ వర్తిస్తుందని జీవోల్లో తెలిపిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-01-30T00:16:41+05:30 IST