Advertisement
Advertisement
Abn logo
Advertisement
Oct 19 2021 @ 02:27AM

అయినా.. లంచం తప్పట్లేదు!

  • ధరణి వచ్చినా ఆగని సబ్‌ రిజిస్ట్రార్లు, తహసీల్దార్ల దందా
  • కొర్రీలతో సబ్‌ రిజిస్ట్రార్లు; విచారణల పేరిట తహసీల్దార్ల జాప్యం
  • ఎదురు చూసి చూసీ మధ్యవర్తుల వద్దకు క్రయ విక్రయదారులు
  • రూ.10 వేల నుంచి లక్ష వరకూ లంచం ఇస్తేనే పని పూర్తయ్యేది
  • ముడుపులకు కీలకంగా డాక్యుమెంట్‌ రైటర్లు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది
  • ఎస్‌ఆర్‌లపై ఫిర్యాదులు వచ్చినా తొక్కిపెడుతున్న ఉన్నతాధికారులు
  • ఇప్పటికీ యథేచ్ఛగా కొనసాగుతున్న రిజిస్ట్రేషన్‌ అక్రమాలు


హైదరాబాద్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి ఉదయం 11 గంటలకే డాక్యుమెంట్‌ను సిద్ధం చేసుకుని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్టాంపు డ్యూటీ చెల్లించారు. ప్రస్తుతం మారిన విధానాల ప్రకారం ఓ గంటలో ఆయన రిజిస్ట్రేషన్‌ జరిగిపోవాలి. కానీ, సాయంత్రం 6 గంటల వరకూ డాక్యుమెంట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ టేబుల్‌ వద్దనే ఆగింది. సుమారు 7 గంటలపాటు వేచి ఉన్న ఆయన.. ఆలస్యం ఎందుకవుతోందని నిలదీశారు. అయినా, ఫలితం లేదు. చివరికి, సాయంత్రం ఆరు గంటల తర్వాత ఓ డాక్యుమెంట్‌ రైటర్‌ సలహా మేరకు అతను సూచించిన ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగికి రూ.15 వేలు ఇచ్చారు. నిమిషాల్లోనే, సబ్‌ రిజిస్ట్రార్‌ సదరు డాక్యుమెంట్‌పై రాజ ముద్ర వేశారు. ఇటీవల సదరు కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వారిలో 90 శాతం మంది ఇటువంటి బాధితులే. లంచం ఇవ్వాలని నోరు తెరిచి అడగరు. ఎదురు చూసి ఎదురు చూసి వాళ్లే తెలుసుకుని సమర్పించాలి. అప్పుడే అక్కడ పనవుతుంది. నిషేధిత భూముల జాబితాలో చేరిన పట్టా భూములకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించాలని ప్రభుత్వం ఇటీవల కలెక్టర్లను ఆదేశించిన విషయం తెలిసిందే. దాంతో, కలెక్టర్ల లాగిన్‌లోకి వచ్చిన ఫిర్యాదులను విచారణ నిమిత్తం ఆర్డీవోలకు, తహసీల్దార్లకు కలెక్టర్‌ పంపుతున్నారు. 


ఈ సమయంలో ‘మీ దరఖాస్తు మా వద్దకు వచ్చింది. రిపోర్ట్‌ పాజిటివ్‌గా రాయమంటా వా? నెగెటివ్‌గానా!?’’ అంటూ వీఆర్‌ఏలు, ఆర్‌ఐలు, బ్రోకర్ల ద్వారా కొంతమంది తహసీల్దార్లు బెదిరింపులకు దిగుతున్నారు. అప్పటికే చాలా కాలంగా పడుతున్న సమస్య నుంచి బయటపడేందుకు రైతులు తహసీల్దార్లు అడిగినంత ఇస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.


పేరు మారింది! అధికారులు మారారు! అయినా వ్యవస్థ మారలేదు! అధికారుల అవినీతి మారలేదు! వ్య వసాయ భూములకు అయినా.. వ్యవసాయేతర భూములకు అయినా తహసీల్దార్‌ కార్యాలయాల్లో అయినా, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అయినా రిజిస్ట్రేషన్లకు లంచం ఇవ్వక తప్పని పరిస్థితి రైతులకు తప్పట్లేదు! సరిగ్గా ఏడాది కిందట ధరణి పోర్టల్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌.. దానిని విప్లవాత్మక ముందడుగుగా అభివర్ణించారు. ‘‘కొత్తగా జరిగే క్రయ విక్రయాల నమోదు 15 నిమిషాల్లోనే పూర్తవుతుంది. ఒక్క పైసా లంచం ఇవ్వా ల్సిన అవసరం లేదు’’ అని స్పష్టం చేశారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ వ్యవస్థల్లో అవినీతి జడలు విప్పిందన్న ఆరోపణలతోపాటు రిజిస్ట్రేషన్‌ సమయంలో సబ్‌ రిజిస్ట్రార్లు; మ్యుటేషన్‌ సమయంలో వీఆర్వోలు, తహసీల్దార్లు లంచాల కోసం వేధిస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. దాంతో, ఆ రెండు శాఖల్లోనూ అవినీతిని నిర్మూలించడంతోపాటు ప్రజలకు పారదర్శక సేవలు అందించడానికి సీఎం కేసీఆర్‌ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ‘ధరణి’ విధానాన్ని తీసుకొచ్చారు. సాంకేతిక సమస్యలను పక్కనపెడితే.. ముఖ్యమంత్రి ఆశించినట్లుగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అవినీతి తగ్గలేదు. 


హైదరాబాద్‌; నగర శివారు ప్రాంతాలు; రాష్ట్రవ్యాప్తంగా మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని సబ్‌ రిజిస్ట్రార్లు (ఎస్‌ఆర్‌) ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్‌ చేశారు. ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది, డాక్యుమెంట్‌ రైటర్ల ద్వారా ముడుపులను పుచ్చుకుంటున్నారు. అన్నీ సక్రమంగా ఉన్నా.. ఏదో ఒక తిరకాసు పెడుతూ జిల్లాల్లోనైతే రూ.10 వేల నుంచి రూ.40 వేల వరకు, నగరాలు, పట్టణాల్లో రూ.25 వేల నుంచి రూ.లక్షపైనే ప్రతి డాక్యుమెంట్‌పైనా దండుకుంటున్నారు. ఎస్‌ఆర్‌ల వ్యవహారంపై దృష్టి సారించాల్సిన జిల్లా రిజిస్ట్రార్లు, డీఐజీలు వారి వారి కార్యాలయాలకే పరిమితమవుతున్నారు. ఎస్‌ఆర్‌లపై ఫిర్యాదులు వచ్చినా కొంతమంది తొక్కి పెడుతున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. అంతేనా, గతం లో విజిలెన్స్‌ అధికారులు ఎస్‌ఆర్‌ కార్యాలయాల్లో తనిఖీలు చేసేవారు. ఆ పోస్టులను సర్కారు రద్దు చేసింది. ఆ బాధ్యతలనూ డీఐజీలకే అప్పగించింది. దీంతో, సబ్‌ రిజిస్ట్రార్ల స్వైర విహారం కొనసాగుతూనే ఉంది.

ఆన్‌లైన్‌తో కొర్రీలే!

సుమారు ఏడాదిన్నర కిందటి వరకు వ్యవసాయ భూములతోపాటు వ్యవసాయేతర భూములను కూడా సబ్‌ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్‌ చేసేవారు. అనంతరం, రిజిస్ట్రే షన్‌ డాక్యుమెంట్‌ ఆధారంగా వ్యవసాయ భూములకు తహసీల్దార్లు మ్యూటేషన్‌ చేసేవాళ్లు. ధరణి అమల్లో భాగంగా, వ్యవసాయ భూములకు సంబంధించి రిజిస్ట్రా ర్ల అధికారాలను తహసీల్దార్లకు అన్వయించారు. అప్పటి నుంచి వ్యవసాయ భూములు ధరణిలో; వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో జ రుగుతున్నాయి.  నిజానికి, రిజిస్ట్రేషన్‌ సేవలను సులభతరం చేసేందుకు సాంకేతికతను అందిపుచ్చుకుని స్టాంపులు రిజిస్ట్రేషన్‌ శాఖకు సంబంధించిన సెంట్రల్‌ కాడ్‌ సాఫ్ట్‌వేర్‌లో చాలా మార్పు లు చేశారు. ఇందులో ప్రధానంగా వినియోగదారుల సౌకర్యార్థం ఆన్‌లైన్‌ డాక్యుమెంటేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆన్‌లైన్‌లో పొందుపర్చిన నమూనా డాక్యుమెంట్‌ ప్రకారం రిజిస్టర్‌ డాక్యుమెంట్‌ను సిద్ధం చేసుకుని; ఆన్‌లైన్‌లో స్టాంపు డ్యూటీ చెల్లించి స్లాట్‌ బుక్‌ చేసుకుంటే పావు గంటలోనే రిజిస్ట్రేషన్‌ పూర్తవుతుందని చెప్పారు. కానీ, ఇలా స్లాట్‌ బుక్‌ చేసుకున్న క్రయవిక్రయదారులకు కాలయాపనతోపాటు కొర్రీలు తప్పడం లేదు. దీంతో, మళ్లీ డాక్యుమెంట్‌ రైటర్‌ను గానీ, సబ్‌  రిజిస్ర్టార్‌ కార్యాలయంలోని ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిని కానీ సంప్రదించక తప్పట్లేదు. వారికి ఎంతో కొంత ముడుపులు అప్పగిస్తేనే పనవుతోంది.

 

ముడుపులిస్తే నిబంధనలకు నీళ్లు

ఉన్నతాధికారుల ఉదాసీనత కారణంగా కొన్ని జిల్లాల పరిధిలోని పలువురు సబ్‌ రిజిస్ట్రార్లు వక్ఫ్‌, దేవాదాయ, పీవోటీ భూముల్లోని ప్లాట్లకు దర్జాగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. వంద గజాల్లోపు పేదల ప్లాట్లను ఇంటి నంబర్ల ఆధారంగా సేల్‌డీడ్‌ చేయాలని కొద్ది రోజుల కిందట ఆ శాఖ ఉన్నతాధికారులు ఎస్‌ఆర్‌లకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. వీటిని అడ్డం పెట్టుకొని 100-120 గజాల్లోపు స్థలాలను బోగస్‌ ఇంటి నంబర్లతో రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. అలాగే, అక్రమ లే అవుట్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయవద్దని ఏడాది కాలంగా ప్రభుత్వం ఆదేశించింది. కానీ, రంగారెడ్డి, యాదాద్రి, జనగాం, వరంగల్‌, జగిత్యాల, ఖమ్మం, మేడ్చల్‌ జిల్లాల్లో అక్రమ లే అవుట్లలోని ప్లాట్లతోపాటు నిషేధం నిబంధన ఉన్న ఫాం ల్యాండ్స్‌ను కూడా రిజిస్ట్రేషన్‌ చేసేస్తున్నారు. డాక్యుమెంట్‌ అక్రమమా.. సక్రమమా అనే విషయం కంటే కొంతమంది ఎస్‌ఆర్‌లకు లంచం ఇచ్చారా లేదా అనేదే ప్రామాణికంగా మారింది. ఈ నేపథ్యంలోనే, సంగారెడ్డి జిల్లాలో కొండాపూర్‌ ఎమ్మార్వో రైతుల నుంచి రూ.5 వేల నుంచి రూ.లక్ష వరకు లంచం అడుగుతున్నారని బాధితులు ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ చెప్పారు. అడి గినంత లంచం ఇచ్చినా.. తమకు సంబంధించిన ఇనాం భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించడం లేదని ఓ బాధితుడు సిద్దిపేట కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు.


లంచం ఇచ్చి తీసుకున్నాడని..

ఆయనో ప్రభుత్వ డాక్టర్‌ (ఈఎన్టీ సర్జన్‌). గతంలో తన దస్తావేజును కుదువపెట్టి బ్యాంకులో రుణం తీసుకున్నారు. దానిని పూర్తిగా చెల్లించిన సదరు డాక్టర్‌ గతంలో మార్టిగేజ్‌ చేసిన దస్తావేజుల హక్కు విడుదల పత్రాల కోసం మరో సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం అన్ని పత్రాలూ ఉన్నా.. రూ.10 వేల లంచం అడిగారు. చేసేది లేక రూ.7 వేలు చెల్లించారు. ఇదే విషయాన్ని స్థానికంగా ఆయనకు పరిచయం ఉన్న ఓ రాజకీయ నాయకుడికి చెప్పారు. ఆయన సబ్‌ రిజిస్ట్రార్‌ను బెదిరించడంతో తీసుకున్న డబ్బులను తిరిగి ఇచ్చేశారు. కానీ, ఆయన సమర్పించిన డాక్యుమెంట్లలో ఓ డాక్యుమెంట్‌పై స్టాంపు సక్రమంగా లేదని సాకుగా చూపి దానిని స్కాన్‌  చేయకుండా ఆపారు. దాంతో, ఆ డాక్టర్‌ తనకు తెలిసిన ఓ టీఎన్‌జీవో నాయకుడిని సంప్రదించారు. ఆయన వచ్చి డిపార్ట్‌మెంట్‌ పరువు తీస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేయడంతో స్కానింగ్‌ ప్రక్రియ పూర్తి చేశారు.

Advertisement
Advertisement