కరోనా కట్టడికి పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్న యూఏఈ!

ABN , First Publish Date - 2020-04-04T21:38:10+05:30 IST

ప్రపంచ దేశాలు కరోనా వైరస్ దెబ్బకు గడగడలాడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 11 లక్షల మంది కొవిడ్ బారినపడ్డారు. సుమారు 60వేల మంది కరోనా కాటుకు బల

కరోనా కట్టడికి పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్న యూఏఈ!

అబుధాబి: ప్రపంచ దేశాలు కరోనా వైరస్ దెబ్బకు గడగడలాడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 11 లక్షల మంది కొవిడ్ బారినపడ్డారు. సుమారు 60వేల మంది కరోనా కాటుకు బలయ్యారు. అగ్రరాజ్యాలపైన కూడా కరోనా వైరస్ తీవ్రత అధికంగానే ఉంది. అమెరికా, బ్రిటన్ కూడా మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేయలేకపోతున్నాయి. కానీ యూఏఈ మాత్రం ఈ విషయంలో కాస్త మెరుగ్గానే ఉందని చెప్పొచ్చు. యూఏఈలో ఇప్పటి వరకు కేవలం 1,264 కరోనా కేసులు మాత్రమే నమోదవ్వగా.. 9 మంది మరణించారు. ప్రపంచ దేశాలపై కరోనా వైరస్ విరుచుకుపడుతున్న క్రమంలో.. వరల్డ్ సేఫెస్ట్ కంట్రీస్ జాబితాలో యూఏఈ‌కి స్థానం దక్కింది. కుల, మత, జాతి, దేశ, లింగ బేధాలను పక్కన పెట్టి.. కరోనా‌పై పోరుకు యూఏఈ తీసుకుంటున్న చర్యలే ఇందుకు కారణం. ఇంతకీ మహమ్మారిని కట్టడి చేయడానికి యూఏఈ తీసుకుంటున్న చర్యలు ఏంటంటే..


అన్ని విద్యాసంస్థలకు సెలవులు...

కరోనాను కట్టడి చేయడానికి నడుం బిగించిన అక్కడి ప్రభుత్వం.. యూఏఈ వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. మార్చి 8 నుంచి నాలుగు వారాలపాటు ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్‌లను కూడా మూసేయాల్సిందిగా ఆదేశాలు జారీ  చేసింది. ఇదే సమయంలో మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. 


ప్రయాణికులకు కొవిడ్ పరీక్షలు తప్పనిసరి

విదేశాల నుంచి యూఏఈలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ.. విమానాశ్రయాల్లో కొవిడ్-19 పరీక్షలు చేయించుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రయాణికుల్లో ఎవరికైనా వైరస్ సోకినట్లు లక్షణాలు కనిపిస్తే.. వారికి నిర్ధారణ పరీక్షలు చేసేలా ఏర్పాట్లు చేసింది. ఒకవేళ పాజిటివ్ అని తేలితే.. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. 


ప్రతి వారం స్టెరిలైజేషన్ డ్రైవ్

మార్చి 26 నుంచి వారాంతాల్లో దేశ వ్యాప్తంగా స్టెరిలైజేషన్ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా పారిశుద్ధ్య కార్మికుల చేత రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాప్‌లు తదితర ప్రాంతాల్లో సానిటైజర్‌ను స్ప్రే చేయిస్తోంది. 


మజీదుల్లో ప్రార్థనలు బంద్

కరోనా వ్యాప్తికి ప్రార్థనా మందిరాలే హాట్‌స్పాట్‌లు అవుతాయని యూఏఈ ప్రభుత్వం ముందే గ్రహించింది. అందువల్ల దేశ వ్యాప్తంగా ఉన్న మజీద్‌లలో.. మార్చి 16 నుంచి ప్రార్థనలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 


14 రోజుల్లో అతిపెద్ద ల్యాబ్ నిర్మాణం

కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల కోసం.. కేవలం 14 రోజుల్లో అతిపెద్ద ల్యాబ్‌ను నిర్మించింది. యూఏఈ ప్రభుత్వం కొత్తగా నిర్మించిన ఈ ల్యాబ్‌లో ఒకే రోజు కొన్నివేల టెస్ట్ సాంపిల్స్‌ను పరీక్షించవచ్చు. 


ఇళ్ల నుంచే పని చేసే సదుపాయం

ప్రభుత్వ, ప్రైవేటురంగ ఉద్యోగులకు ఇళ్ల నుంచే పని చేసే సౌకర్యాన్ని యూఏఈ ప్రభుత్వం కల్పించింది. కొన్ని ముఖ్యమైన కార్యాలయాలకు రొటేషన్ పద్ధతిలో కేవలం 30 శాతం ఉద్యోగులు హాజరయ్యేలా చర్యలు తీసుకుంది. కాగా.. యూఏఈలో మార్చి 29 నుంచే వర్క్ ఫ్రం హోం విధానం అమలులోకి వచ్చింది. 


భారీ ఉద్దీపన ప్యాకేజీ

కరోనా ప్రభావం.. దేశ ఆర్థిక వ్యవస్థపై పడకుండా యూఏఈ ప్రభుత్వం భారీ ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది. యూఏఈ సెంట్రల్ బ్యాంక్.. 100 బిలియన్ల దిర్హమ్స్‌ ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది. దీనికి అదనంగా 16 బిలియన్ల దిర్హమ్స్‌ ఉద్దీపన ప్యాకేజీకి కాబినెట్ ఆమోద ముద్ర వేసింది. 


Updated Date - 2020-04-04T21:38:10+05:30 IST