ఆయనను చంపినవారెంతటి అల్పులు!

ABN , First Publish Date - 2021-07-08T05:51:07+05:30 IST

అన్నిమరణాలకు హాహాకారాలు ఉండవు. కొన్ని దుఃఖాలు కత్తిలాంటి పదునైన నిశ్శబ్దంలో తలదాచుకుంటాయి. చావు ఎంత దయనీయమైనా దారుణమైనా అన్నిసార్లూ పెడబొబ్బలు వినిపించవు...

ఆయనను చంపినవారెంతటి అల్పులు!

అన్నిమరణాలకు హాహాకారాలు ఉండవు. కొన్ని దుఃఖాలు కత్తిలాంటి పదునైన నిశ్శబ్దంలో తలదాచుకుంటాయి. చావు ఎంత దయనీయమైనా దారుణమైనా అన్నిసార్లూ పెడబొబ్బలు వినిపించవు. కొన్ని విషాదాలు పోతపోసిన చీకటిలో సేదతీరతాయి. ఎవరి గుండెల్లో వాళ్లకు వినిపిస్తున్న అలజడులను కలిపి ఒకే కల్లోలంగా అల్లనక్కరలేదు– ఎక్కడికక్కడ ఎవరికి వారు తమ అవనత ఆత్మలను అరనిముషం పాటు జెండాలా ఎగురవేస్తే చాలు. వేదనల కోసం వెచ్చించే శక్తిని రేపటికోసం దాచుకోవాలి. 


ఆయన గురించే తప్ప ఆయనెవరో తెలియదు. కానీ, ఆయన చనిపోయినప్పుడు, నీకూ నాకూ అతనికీ ఆమెకూ కూడా గాయమైంది. బాధ కాదు. వేదన కాదు. కలవరం కాదు. దిగ్ర్భాంతి కాదు. దుర్మార్గ వ్యవస్థ ముందు ఒక నిస్సహాయ దీనత్వం. ఇదింతేనన్న నిర్లిప్తం.


అన్నిటికి మించి అవమానం. ఈదేశం గురించి, దేశంలోని ఈ మనుషుల గురించి ప్రపంచం ఏమనుకుంటుంది? ఎటువంటి పాలనలో ఉంటున్నాం? తలకాయలు ఎక్కడ పెట్టుకుని పరస్పరం తారసపడాలి?


స్టాన్ స్వామి చనిపోయారని తెలిసినప్పుడు, ఆ పదహారు మందినీ ఒక్కొక్కరిని ఊపా తినేస్తుందని ఊహించినదే జరిగినట్టు, ఇంతకు మించి ఏమి జరుగుతుందన్నట్టు, ఏమి జరిగితే మాత్రం ఏమి చేస్తామన్నట్టు అనిపించింది. సమాజం, ప్రజలు, అధికారం కోసం పోటీపడవలసిన రాజకీయపార్టీలు ఇంత నిస్సత్తువలోనో, ఉదాసీనతలోనో ఉన్నప్పుడు ఎవరిని మాత్రం ఎవరు రక్షిస్తారన్న నిర్వేదమూ కలిగింది. తన జీవిత నైతికతనే కాదు, మరణాన్ని కూడా స్టాన్ స్వామి ఒక వెలుగులాగా ప్రసరింపజేశారు. గట్టిగా మాట్లాడక తప్పని అనివార్యతను పౌరసమాజానికి విధించారు. ఆయన మరణాన్ని రచించినవారు మాత్రం సమర్థనలకూ సంజాయిషీలకు వీలు కుదరని శుష్క ప్రకటనలలోకి జారిపోయారు.


స్టాన్ స్వామి, సజ్జనుడైనందున కలిగిన సూనృత శక్తి తప్ప మరేమీ లేని ఒక అర్భకపు వృద్ధుడు. రాళ్ల మీద రాళ్లు పేరుస్తూ నిర్మిస్తున్న జైళ్లను, తాళ్ల మీద తాళ్లు పేనుతూ కడుతున్న ఉరికొయ్యలను, సంకెళ్లను పొదిగిన చట్టాల చట్రాలను ధిక్కరించి, అట్లా చచ్చిపోయాడే, ఆయన చావుకు కారణమైనవారు సిగ్గుతో అయినా చచ్చిపోవాలి కదా?


ఆయన అవశేష కాయాన్ని ఎర్రటి వస్త్రంలో చుట్టి పేటికలో ఉంచారు. ఇక్కడ ఎరుపు, ప్రభుత్వాలు ఆరోపించిన ఎరుపు కాదు. క్రైస్తవంలో, అమరత్వం పొందినవారిని అలంకరించే రంగు. అన్ని మతాలకి లాగే ఆయన ఆచరించిన మతానికీ మంచిచెడ్డలు ఉన్నాయి. కానీ, స్టాన్ స్వామి, పీడితులకు, బాధితులకు తోడు ఉండడంలో తన మార్గాన్ని వెదుక్కున్నారు. స్వామి అగ్నివేశ్ లాగానే, జనసేవలోనే మతాన్ని చూసుకున్నారు. న్యాయం కోసం చేసే పోరాటాన్ని దైవ మార్గం సమర్థిస్తుందని నమ్మారు. తమ లాగానే జనం కోసం పనిచేసేవారిని స్నేహితులని విశ్వసించారు. 


అంత్యక్రియలకు ముందు జరిగే మతకార్యక్రమంలో స్టాన్ స్వామి భౌతిక కాయం సమక్షంలో యోహాను సువార్తచదివారు. క్రీస్తును దోషిగా తాను భావించడం లేదని, అతనిని శిక్షించరాదని అక్కడి సమూహానికి నచ్చచెప్పేందుకు ప్రాంతపాలకుడు పిలాతు ప్రయత్నించిన వర్ణన భాగం అది. పిలాతు ఎంతగా నచ్చచెబుతున్నా వినకుండా క్రీస్తును శిలువ వేయవలసిందేనని ఉన్మాదంతో అక్కడ గుమిగూడిన కులీనులు, మతాధికారులు, సాధారణ ప్రజలు అందరూ కేకలు పెడతారు. పాత్రలు మారాయేమో కానీ, స్టాన్ స్వామి నిర్దోషిత్వం స్పష్టంగా కనిపిస్తుండగా కూడా, రాజ్యం ప్రాణాంతక న్యాయాన్నే ఝళిపించింది. 


సాటి మనుషుల కష్టసుఖాలను పట్టించుకునేవారు, ఈ సమాజాన్ని మెరుగుపరచాలని తాపత్రయపడేవారు, మంచిచెడ్డలు చెప్పేవారు, కథలూ కవిత్వాలతో కొత్త కలలను రగిలించేవారు, అవిద్యలో ఉన్నవారికి చదువును చైతన్యాన్ని, చీకటిలో మగ్గుతున్నవారికి వెలుతురు రుచిని చూపిస్తున్నవారు- ఇటువంటివారందరినీ కలిపి ఒకే బోనులో నిలిపి, ఇక దేశంలో ఆశ అన్నదానికే ఆస్కారం లేకుండా భయోత్పాతాన్ని రాజమతంగా నిలబెట్టాలని ప్రయత్నం జరుగుతోంది. ఒక బూచిని చూపించి, ఒక బీభత్స కథనాన్ని నిర్మించి వేట మొదలుపెట్టారు. జనం దీనంగా, హీనంగా, పరాధీనంగా ఉండాలి, అడవులకీ అడవుల్లోని అంతులేని సంపదకీ కాపుకాస్తున్న వారిని అసహాయులను చేయాలి. స్టాన్ స్వామి చేసిన పాపం ఏమిటి? గ్రాహం స్టెయిన్స్ ఏమి చేశారు? 2011లో జార్ఖండ్ లో కేథలిక్ నన్ వల్సా జాన్ వలేమల్ ఏమి చేసింది? వీళ్లందరూ ఆదివాసులకు చదువుని ధైర్యాన్ని ఇచ్చారు, మంచీ చెడ్డా చెప్పారు, వనరులను కాపాడుకోవాలనే చైతన్యం ఇచ్చారు. వీళ్లే కాదు, బీమా కోరేగావ్ కుట్ర కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న అందరూ తమ చుట్టూ ఉన్న ప్రజల మంచి కోరినవారే, మంచి చేసినవారే. మంచి మీద ఎందుకింత దౌర్జన్యం? ఏ అదానీలకు అంబానీలకు ప్రదానం చేయడం కోసం అడవిబిడ్డలకు అండదండలు లేకుండా చేయడం? 


పిల్లలనీ స్త్రీలనీ వృద్ధులనీ చంపకూడదని పాతకాలం నీతులు చెబుతాయి. భౌతిక యుద్ధంలో లేనివారిని, ఆయుధం పట్టనివారిని చంపకూడదని రాచరికపు నీతి కూడా అంగీకరిస్తుంది. పసిపిల్లలని కూడా గ్యాస్ చాంబర్లలో చంపేసిన హిట్లర్, పిల్లల ఆస్పత్రుల మీద కూడా బాంబులు వేసిన జార్జి బుష్.. వీళ్లను చరిత్ర జ్ఞాపకం ఉంచుకున్నదంటే కారణం వారు దుర్మార్గపు అవధులు మీరిపోయారు కాబట్టి. రాజ్య పాలనలో కచ్చితత్వం ఎప్పుడైనా అవసరం కావచ్చు. ఎప్పుడో కానీ కాఠిన్యం అవసరం రాకపోవచ్చు. ప్రజలకు సేవ చేయడమో, ప్రజావసరాలను సమన్వయం చేయడమో కాక, ప్రజలను అదుపుచేయడమే ప్రభుత్వం పని అనుకునేవారు కాఠిన్యాన్ని కూడా దాటి క్రూరత్వాన్ని ప్రదర్శిస్తారు. క్రౌర్యం రాజ్యం బలాన్ని నిజంగా సూచిస్తుందా? ఎనభైనాలుగేళ్ల బక్కపలచని పెద్దమనిషి, ఆదివాసుల మధ్యనే అనుదినం సంచరించే మనిషి నుంచి ఏమి ప్రమాదం ఉన్నదని బెయిల్ కూడా ఇవ్వకుండా వేధించారు? జబ్బు మనిషి, వణికే వేళ్లతో నీళ్లగ్లాసును కూడా పట్టుకోలేకపోతే, నీళ్లు తాగే పాత్ర కావాలంటే నిరాకరించడానికి నీ ప్రాసిక్యూషన్ ఎందుకంత ఉత్సాహపడింది? ప్రభుత్వపు కళ్లతో తప్ప ప్రత్యక్షంగా కనిపిస్తున్నదాన్ని చూడకుండా న్యాయవ్యవస్థ ఎందుకు కళ్లు మూసుకున్నది? 70లలో, 80లలో ఉన్నవారు, కేవలం ఆలోచనలు, వాదనలు, రచనలు చేసేవారి వల్ల ఏమి ప్రమాదమున్నదని బంధిస్తున్నారు? తొంభైశాతం వైకల్యం ఉన్న మనిషి నుంచి వ్యవస్థ పునాదులకు ఏమి ముప్పు ఉన్నదని అండాజైలులో బంధిస్తారు? ఈ ప్రభుత్వాలు భయపడుతున్న మనుషులను, కారణాలను చూస్తే, దేశానికి బయటి నుంచి ఏదైనా పెను విపత్తు వస్తే నిజంగా పాలకులు ప్రజలను రక్షించగలరా? అని భయం వేస్తుంది. అసమ్మతికి, భిన్నాభిప్రాయానికి భయపడేవారు శత్రువులను ఏమి ఎదుర్కొంటారు? దేశమంటే స్టాన్ స్వామితో సహా ప్రజలందరూ. క్రూరచట్టంతో, కొవిడ్‌తో చంపేయడానికి అతను ఈ దేశప్రజల శత్రువు కాదు, ప్రేమికుడు. 


ఊపా, ఎంత దుర్మార్గం అని ఇప్పుడు అందరూ గుండెలు బాదుకుంటున్నారు– దాన్ని రూపొందించి తరువాతి ప్రభుత్వానికి ఆయుధం అందించిన కాంగ్రెస్‌తో సహా. స్టాన్ స్వామి మరణానికే కాదు, ఊపాలు రాజద్రోహాల కింద జరుగుతున్న అణచివేతలన్నిటి బాధ్యులు ఎవరో బయటపడాలి. అంతా చట్టప్రకారమే జరిగింది అని అంతర్జాతీయ సమాజానికి కూడా నిస్సిగ్గుగా చెప్పుకోవడానికి అవకాశమిస్తున్న ఆ క్రూరచట్టం, దాన్ని తెచ్చినవారు, ఆమోదించినవారు, ప్రయోగిస్తున్నవారు అందరూ ఇప్పుడు దోషులే. స్టాన్ స్వామి మరణం, అది దేశంలోనూ బయటా కలిగిస్తున్న ప్రకంపనలు- దేశంలో ప్రజాస్వామిక ఉత్తేజానికి కారణం కావాలి. యాభై ఏళ్ల నాటి అత్యవసర పరిస్థితి ఒకనాడు విధిస్తే వచ్చి, ఒకనాడు ఎత్తివేస్తే తొలగిపోయింది. ఇప్పటి పరిస్థితి సడలిపోవాలంటే, ప్రతి సందర్భమూ ఒక అవకాశం కావాలి. ఇనుప పంజరాన్ని కొంచెం కొంచెంగా కొరుకుతూ పోవాలి. గెలిచినంత మేర గెలుపును నిలబెట్టుకోవాలి.


కె. శ్రీనివాస్

Updated Date - 2021-07-08T05:51:07+05:30 IST