Advertisement
Advertisement
Abn logo
Advertisement

వీటిని వాడుతున్నారా?

ఆంధ్రజ్యోతి(04-08-2020)

ఆరోగ్యాన్ని పరీక్షించుకునే ఎన్నో ఆరోగ్య ఉపకరణాలు, పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. జ్వరం మొదలు రక్తపోటు, మధుమేహం... ఇలా పలు రకాల లక్షణాలను కనిపెట్టే ఆరోగ్య ఉపకరణాలు ప్రతి ఇంట్లోనూ ఉంటున్నాయి. అయితే వాటిని వాడే విధానం మీద ప్రస్తుతం పూర్తి అవగాహన ఏర్పరచుకోవడం అవసరం!


బీపీ మానిటర్‌!

డిజిటల్‌ బ్లడ్‌ప్రెషర్‌ మానిటర్‌ను ఉపయోగించడం ఎంతో తేలిక! చేతికి చుట్టే కఫ్‌తో పాటు, డిజిటల్‌ రీడింగ్‌ కనిపించే మానిటర్‌ ఈ ఉపకరణంలో ఉంటాయి. రక్తపోటు తెలుసుకోవడం కోసం కఫ్‌ను మోచేతి పైభాగానికి చుట్టి, మానిటర్‌ ఆన్‌ చేయాలి. కొన్ని సెకన్లలోనే రక్తపోటు రీడింగ్‌ మానిటర్‌ మీద ప్రత్యక్షమవుతుంది. సాధారణ రక్తపోటు 120/80 ఉండాలి. అలా కాకుండా 140/90 అంతకంటే ఎక్కువ చూపిస్తే అధిక రక్తపోటుగా భావించాలి.


ఆక్సీ మీటర్‌!

శ్వాస తీసుకోవడంలో సమస్యలు ఉన్నవారికి రక్తంలో ఆక్సిజన్‌ పరిమాణాన్ని కనిపెట్టే ఆక్సీమీటరు వాడాలని వైద్యులు సూచిస్తారు. మరీ ముఖ్యంగా క్వారంటైన్‌ సెంటర్లు, లేదా హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్న కరోనా అనుమానితులు, బాధితులు వీటిని వాడడం అవసరం. కేవలం మూడు నిమిషాల నడకతో రక్తంలో ఆక్సిజన్‌ పరిమాణం 93 శాతానికి పడిపోతే, ఆస్పత్రిలో చేరవలసి ఉంటుంది. ఒకవేళ ఆస్పత్రిలో చేరడం ఆలస్యం అయ్యే పక్షంలో కొన్ని పడుకునే భంగిమలను ప్రయత్నించాలి.


ఎడమ చేతిని మడిచి, తల కిందుగా ఉంచి, మోచేతి పైభాగాన్ని తల మీదకు వాల్చి, ఎడమ వైపుకు తిరిగి పడుకోవాలి. 

 కుడి చేతిని మడిచి, తల కిందుగా మడిచి, మోచేతి పైభాగాన్ని తల మీదకు వాల్చి, కుడి వైపుకు తిరిగి పడుకోవాలి.

భుజాలు, ఛాతీ కుంగిపోకుండా, నిటారుగా కూర్చోవాలి. ఈ భంగిమల్లో 15 నిమిషాల పాటు ఉంటూ, ఆక్సీమీటరు రీడింగ్‌ను పరీక్షించుకోవాలి. భంగిమకు, భంగిమకూ మధ్య రెండు గంటల విరామం పాటించాలి. ఏ భంగిమలో ఉన్నప్పుడు ఆక్సిజన్‌ పరిమాణం పెరుగుతుందో గమనించుకుని, దాన్నే అనుసరించాలి. ఇలా అనుకూలమైన భంగిమల్లో ఉండడం ద్వారా రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిని పెంచుకోవచ్చు.

అలాగే పల్స్‌ ఆక్సీమీటరు ప్రోబ్‌ వేలికి సరిగా బిగుసుకుని ఉందో, లేదో గమనించుకోవాలి. ప్రోబ్‌ కోసం కుడిచేతి మధ్య వేలు లేదా కుడి బొటనవేలు ఉపయోగించడం ఉత్తమం. సాధారణ ఆక్సీమీటరు రీడింగ్‌ 95 - 100 మధ్య ఉండాలి. 90 కంటే తగ్గితే అదనంగా ఆక్సిజన్‌ అవసరమని అర్ధం.


ఉపయోగించే విధానం: ఆక్సీమీటరులో వేలు ఉంచిన కొన్ని క్షణాల్లో ఆన్‌ అవుతుంది. ఐదు సెకన్లలో దాన్లో రెండు రీడింగ్‌లు ప్రత్యక్షమవుతాయి. ఒకటి ఎస్‌.పి.ఒ2ను (రక్తంలో కలిసిన ఆక్సిజన్‌ పరిమాణం), మరొక రీడింగ్‌ గుండె వేగాన్ని తెలుపుతాయి.


థర్మామీటరు!

జ్వరాన్ని పరీక్షించడానికి గాజు, డిజిటల్‌ థర్మామీటర్లు వాడుతూ ఉంటాం. అయితే ఈ రెండు వాడే విధానాలు సక్రమంగా అనుసరించినప్పుడే రీడింగ్‌ కరెక్టుగా చూపిస్తాయి. 


డిజిటల్‌: వాడే ముందు నోట్లో ఉంచుకునే థర్మామీటరు ముందరి భాగాన్ని సబ్బు నీళ్లతో కడిగి శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఆన్‌ చేసి, నాలుక అడుగున పెట్టుకుని, పెదవులు మూసి ఉంచాలి. కొన్ని క్షణాల్లోనే థర్మామీటరు రకాన్ని బట్టి దాని నుంచి బీప్‌ శబ్దం వెలువడుతుంది, లేదా రీడింగ్‌ కనిపిస్తుంది. కనిపించిన రీడింగ్‌ను బట్టి టెంపరేచర్‌ తెలుసుకోవాలి.


గాజు థర్మామీటరు: దీన్ని వాడే ముందు మొన కాకుండా, చివరి వైపున పట్టుకుని విదిలించాలి. పూర్వపు ఉష్ణోగ్రత దగ్గర ఆగిపోయిన పాదరసాన్ని, అడుగుకు చేర్చి, తాజా ఉష్ణోగ్రత కనిపెట్టడం కోసం ఇలా చేయాలి. ఇలా విదిలించిన థర్మామీటరును నాలుక అడుగున ఉంచి, పెదవులు మూసి, మూడు నిమిషాల తర్వాత బయటకు తీసి, రీడింగ్‌ చూడాలి. రీడింగ్‌ గమనించడం కోసం థర్మామీటరును కళ్లకు సమాంతరంగా పట్టుకుని, ఎరుపు రంగు లైను స్పష్టంగా కనిపించేలా నెమ్మదిగా తిప్పాలి. ఎరుపు లైను 98.6 డిగ్రీలు దాటి 100.4 డిగ్రీలు అంతకంటే ఎక్కువకు చేరుకుంటే జ్వరం ఉన్నట్టు భావించాలి. గాజు థర్మామీటరును పెద్దలైతే నోట్లో, పసికందులైతే బాహుమూలల్లో ఉంచి టెంపరేచర్‌ తెలుసుకోవచ్చు.


గ్లూకో మీటరు!

రక్తంలో చక్కెర స్థాయిని కనిపెట్టే గ్లూకోమీటరును వైద్యుల సూచన మేరకు వాడుకోవచ్చు. మధుమేహ తీవ్రత, రకాలను బట్టి ఎంత తరచుగా చక్కెరను పరీక్షించుకోవాలే వైద్యులు సూచిస్తారు. చక్కెరను పరీక్షించుకోవడం కోసం గ్లూకోమీటరు, టెస్ట్‌ స్ట్రిప్‌, లాన్‌సెట్‌ సిద్ధంగా ఉంచుకోవాలి. చేతులు శుభ్రంగా కడుక్కుని, తడి లేకుండా తుడుచుకోవాలి. తర్వాత గ్లూకోమీటరు ఆన్‌ చేసి, దాన్లో టెస్ట్‌ స్ట్రిప్‌ ఉంచాలి. తర్వాత చూపుడు వేలు లేదా మధ్యవేలు గోరుకు కొద్దిగా దిగువన లాన్‌సెట్‌తో ప్రిక్‌ చేయాలి. ఆ రక్తాన్ని స్ర్టిప్‌ మీద ఉంచితే, క్షణాల్లో చక్కెర స్థాయి రీడింగ్‌ కనిపిస్తుంది. సాధారణ చక్కెర స్థాయులు తినకముందు 80 - 100 మధ్య, తిన్న రెండు గంటల తర్వాత 80 - 140 ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే రక్తంలో చక్కెర పెరిగిందని అర్థం. 


Advertisement

Health Latest newsమరిన్ని...

Advertisement