ఖాళీలతో బోధన ఎలా ?

ABN , First Publish Date - 2022-08-06T06:34:43+05:30 IST

పదవతరగతిలో అత్యుత్తమ ప్రతిభ చాటిన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సాంకేతికవిద్యను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన బాసరట్రిపుల్‌ ఐటీ (ఆర్జీయూకేటీ)లో పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.

ఖాళీలతో బోధన ఎలా ?
ట్రిపుల్‌ ఐటీ ప్రధాన ప్రవేశ ద్వారం

బాసర ట్రిపుల్‌ ఐటీలో 150  అధ్యాపక పోస్టులు ఖాళీ 

ఏళ్లు గడుస్తున్నా భర్తీకాని పోస్టులు 

గెస్ట్‌ఫ్యాక ల్టీతో కొంత వరకు నెట్టుకొస్తున్న వైనం 

కరోనా తర్వాత ఆందోళనకరంగా విద్యాప్రమాణాలు

బాసర, ఆగస్టు 5 : పదవతరగతిలో అత్యుత్తమ ప్రతిభ చాటిన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సాంకేతికవిద్యను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన బాసరట్రిపుల్‌ ఐటీ (ఆర్జీయూకేటీ)లో పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. యూనివర్సిటీ ఏర్పాటు చేసి 14 సంవత్సరాలు గడిచినా ఇంకా యూనివర్సిటీలో సమస్యలు రాజ్యమేలుతూనే ఉన్నాయి. ఒకపక్క అసౌక ర్యాలు వెక్కిరిస్తుంటే మరోపక్క అధ్యాపకుల కొరతతీవ్రంగా ఉంది. 9వేల మంది విద్యార్థులు చదువుకుంటున్న ఈ యూనివర్సిటీలో రెగ్యులర్‌ అధ్యాపకులు కేవలం 16 మంది మాత్రమే ఉన్నారంటే ఇక్కడ పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. రాష్ట్రంలో ఉన్న ఏకైక ట్రిపుల్‌ ఐటీకి విద్యార్థుల్లో, వారి తల్లిదండ్రుల్లో మంచి ఆదరణ ఉంది. ఎలాంటి ఫీజు లేకుండా సాంకేతికవిద్య అందుతుండడంతో చాలా మంది విద్యార్థులు, వారి తల్లి దండ్రులు ఇక్కడ సీటు లభించడం అదృష్టంగా భావిస్తారు. కాని ఇక్కడ మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. కరోనా తర్వాత విద్యాప్రమాణాలు మరింత దిగజారాయని చెప్పవచ్చు. రెండేళ్ల కరోనా సమయంలో సరైన ఆన్‌లైన్‌ తరగతులు కూడా జరగక చదువులో విద్యా ర్థులు చాలా వెనుకబడి పోయారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం యూని వర్సిటీలో ఖాళీల భర్తీకి ఒక ప్రత్యేకబోర్డును నియమించింది. దీంతోనైనా బాసర ట్రిపుల్‌ ఐటీలో అధ్యాపక పోస్టులు ఎప్పుడు భర్తీ అవుతాయో వేడి చూడాలి. 

3 వేల మంది విద్యార్థులకు 25 మంది అధ్యాపకులే..

యూనివర్సిటీలో ప్రవేశం పొందిన విద్యార్థులు ఆరు సంవత్సరాల కోర్సు పూర్తిచేయాల్సి ఉంటుంది. మొదటి రెండు సంవత్సరాలు పీయూసీ - 1, పీయూసీ-2 (ఇంటర్మీడియట్‌స్థాయి) కోర్సు, తర్వాత నాలుగు సంవత్స రాలు ఇంజనీరింగ్‌ చదవాల్సి ఉంటుంది. పీయూసీ-1, పీయూసీ-2 చదివే విద్యార్థులు 3 వేల మంది ఉండగా వారికి చదువు చెప్పే ఆరు సబ్జెక్టుల ఫ్యాకల్టీ అధ్యాపకులు మొత్తం 25 మంది మాత్రమే ఉన్నారు. యూనివర్సిటీ మంజూరు చేసిన పోస్టుల ప్రకారం ఈ సంఖ్య 140 మంది ఉండాలి. ఒక్కో క్లాసు కు 50 మంది ప్రకారం 60 సెక్షన్లు ఉండగా అధ్యాపకుల కొరత కారణంగా అందులో సగం మందికి మాత్రమే తరగతు లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అధ్యాపకుల కొరత కారణంగా సిలబస్‌ను పూర్తి చేయాలనే క్రమంలో తరగతులు అర్థంకాక విద్యా ర్థులు ఇబ్బందులు పడుతున్నారనే ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయి. 

150 పోస్టులు ఖాళీ 

ఇంజనీరింగ్‌లో 6 వేల మంది విద్యార్థులు ఉండగా వారికి చదువుచెప్పే ప్రొఫెసర్‌లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌లు, గెస్ట్‌ ఫ్యాకల్టీ అధ్యాపకులు కలిపి 150 మంది వరకు ఉన్నారు. ఇందులో 16 మంది రెగ్యులర్‌ ప్యాకల్టీ కాగా మిగితావారందరూ తాత్కాలికమే. దాదాపు ఇంకా 125 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ప్రొఫె సర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏళ్ల తరబడి ఇవి భర్తీకి నోచుకోలేదు. చివరిసారిగా 2016 సంవత్సరంలో అప్పటి ఇన్‌చార్జీ వైస్‌ఛాన్స్‌లర్‌ సత్యనారాయణ కొంత మందిని తీసుకున్నారు. మిగితా పోస్టులు ఇప్పటి వరకు భర్తీకి నోచుకోవడం లేదు. అధ్యాపకుల కొరతను అధిగమిం చేందుకు అధికారులు గెస్ట్‌ఫ్యాకల్టీ పద్ధతిలో తాత్కాలికంగా తీసుకొని నెట్టుకొస్తున్నారు. ట్రిపుల్‌ఐటీలో బోధిం చే అధ్యాపకులకు నెట్టు, సెట్టు, పీజీ, ఎంటెక్‌,  డాక్టరేట్‌  వంటి అర్హతలు ఉం డాల్సి ఉండగా గత్యంతరం లేక తక్కువ అర్హతలు ఉన్నప్పటికీ గెస్ట్‌ఫ్యాకల్టీగా నియ మించుకుంటున్నట్లు తెలిసింది. వీరినే పర్మినెంట్‌ చేస్తున్నారనే పుకార్లు వ్యాపించడంతో సీఎం చిత్రపటానికి ఇటీవల తాత్కాలిక, అతిథి అధ్యాపకులు క్షీరాభిషేకాలు చేశారు. దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటనలు వెలువడ లేదు. దీంతో వారి సంతోషంపై నీళ్లు చల్లినట్లయింది. కానీ పూర్తిస్థాయి అన్ని అర్హతలతో అధ్యాపకులు కావాలని విద్యార్థులు డిమాండ్‌లు చేస్తూ ఎన్నో రోజులుగా వేచి చూస్తూ నీరసించి పోయారు. 

అధ్యాపకులు లేక సీ గ్రేడ్‌ న్యాక్‌ గుర్తింపు 

ట్రిపుల్‌ఐటీలో అధ్యాపకుల కొరత కారణంగా యూనివర్సిటీ పలు గుర్తిం పులను పొందలేకపోతుంది. ట్రిపుల్‌ఐటీలో ఉన్న సుమారు 200ల మంది అధ్యాపకుల్లో కేవలం 16 మంది మాత్రమే రెగ్యులర్‌ అధ్యాప కులు మిగితా వారందరూ తాత్కాలిక ఉద్యోగులే. దీని కారణంగా కేంద్రం ఇచ్చే న్యాక్‌ గుర్తింపు యూనివర్సిటీ సాధించుకునలేకపోయింది. పక్కా భనాలు, ల్యాబులు, తరగతి గదులు, హాస్టళ్లు ఉన్నప్పటికీ నాలుగు నెలల క్రిందట యూనివర్సిటీకి న్యాక్‌ గుర్తింపు సీ గ్రేడుగా వచ్చింది. మామూలు మండల స్థాయి డిగ్రీ, కాలేజీలకు సైతం ఈ రోజుల్లో ఏప్లస్‌, ఏ, బీ వంటి న్యాక్‌ గుర్తింపులు వస్తుంటే యూనివర్సిటీకి మాత్రం మరింత దారుణంగా సీ గ్రేడు రావడంపై విద్యాశాఖ ఉన్నతా ధికారులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-08-06T06:34:43+05:30 IST