వడ్డించేదెలా?

ABN , First Publish Date - 2021-12-05T06:02:57+05:30 IST

విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతోపాటు డ్రాపవుట్‌లు తగ్గించడానికి ప్రభుత్వం పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని ప్రవేశపెట్టింది. పథకం సత్ఫలితాలు ఇస్తున్నా నిర్వాహకులు మాత్రం ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రతినెలా మధ్యాహ్న భోజన ఎజెన్సీ నిర్వాహకులకు బిల్లులను అందించకపోవడంతో అప్పులు చేసి వడ్డీలు కడుతూ విద్యార్థులకు భోజనం పెడుతున్నారు.

వడ్డించేదెలా?

- మధ్యాహ్న భోజన నిర్వాహకులకు అందని బిల్లులు 

- మూడు నెలలుగా ఎదురు చూపులు 

- జిల్లాలో 2.33 కోట్ల బకాయిలు 

- పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు 

- ఆహారంలో తగ్గిన నాణ్యత

 (ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతోపాటు డ్రాపవుట్‌లు తగ్గించడానికి ప్రభుత్వం పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని  ప్రవేశపెట్టింది.  పథకం సత్ఫలితాలు ఇస్తున్నా నిర్వాహకులు మాత్రం ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రతినెలా మధ్యాహ్న భోజన ఎజెన్సీ నిర్వాహకులకు బిల్లులను అందించకపోవడంతో అప్పులు చేసి వడ్డీలు కడుతూ విద్యార్థులకు భోజనం పెడుతున్నారు. మూడు నెలలు అవుతున్నా బిల్లులు రాకపోవడంతో  జిల్లాలో మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో రూ.2.33 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. మరోవైపు నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో మధ్యాహ్న భోజనం నాణ్యత కూడా తగ్గిందనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం బియ్యం సరఫరా చేస్తున్నా కూరగాయాలు, నిత్యావసర సరుకులు ఎజెన్సీ నిర్వాహకులు కొనుగోలు  చేయాల్సి ఉంటుంది. సిలిండర్‌పైనే వంట చేయాల్సి ఉన్నా సిలెండర్‌ ధర వెయ్యికి పెరగడంతో కట్టెల పోయ్యిపైనే ఆధారపడుతున్నారు. అంతేకాకుండా విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉంటే సిలిండర్ల భారం కూడా అధికమవుతుంది. దీంతో మొదటి నుంచి కట్టెల పొయ్యిలపైనే వంట చేస్తున్నారు. దీనికి తోడు నెల నెలా రావాల్సిన బిల్లులు రాకపోవడంతో అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. 


జిల్లాలో 38,800 విద్యార్థులకు మధ్యాహ్న భోజనం

రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 499 పాఠశాలల్లో 38,800 మంది విద్యార్థులకు మధ్యాహ్నా భోజనాన్ని అందిస్తున్నారు.  స్లాబ్‌ రేటు ప్రకారం ప్రభుత్వం బిల్లులు చెలిస్తుంది. ఒకటో తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థుల వరకు ఒక్కో విద్యార్థికి రూ.4.97 పైసలు, 6 నుంచి 8వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రూ.7.45 పైసలు, 9, 10 విద్యార్థుల్లో ఒక్కొక్కరికి రూ.9.45 పైసల చొప్పున అందజేస్తుంది.  కూరగాయాలు, పప్పులు, వంటనూనె, గ్యాస్‌తోపాటు ఇతర సామగ్రి ఎజెన్సీ భరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కూరగాయలు కిలోకు రూ.50 నుంచి రూ.80 వరకు ధర పలుకుతున్నాయి. వారంలో మూడు రోజులపాటు కోడిగుడ్డు ఇవ్వాల్సి ఉంటుంది. కోడిగుడ్డు ధర తక్కువగా చెల్లిస్తుండడంతో అదనపు భారం నిర్వాహకులపైనే పడుతుంది. ఇంత కష్టపడి మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నా నిర్వాహకులకు కనీసం రోజువారీ కూలి కూడా పడడం లేదు. మరోవైపు బిల్లులు రాకపోవడంతో వడ్డీల భారం   మోస్తున్నారు. ప్రభుత్వం చెల్లిస్తున్న మెస్‌ చార్జీలకు అనుగుణంగానే భోజనం పెట్టడం ద్వారా నాణ్యత లోపిస్తోందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్లులు రాకపోవడంతో ఉపాధ్యాయులు కూడా ప్రత్యేక దృష్టిసారించ లేకపోతున్నట్లు తెలుస్తోంది.  

బిల్లుల కోసం ధర్నా

మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లించాలని నిర్వాహకులు ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌ ఎదుట శుక్రవారం కార్మికులు నిరసన తెలిపి వినతిపత్రం అందజేశారు. గంభీరావుపేట, ముస్తాబాద్‌, మండలాల్లో భోజన నిర్వాహకులు ధర్నా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా బిల్లుల కోసం ఆందోళనలు ఉధృతం చేయడానికి కార్మికులు సిద్ధమవుతున్నారు. 


Updated Date - 2021-12-05T06:02:57+05:30 IST